వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధులు తీసుకొస్తా
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:41 AM
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఇందుకోసం ఈ ఏడాది కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌ను సోమవారం ఆయన సందర్శించారు. vemulawada temple
వేములవాడ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఇందుకోసం ఈ ఏడాది కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, హెల్త్ కార్డులు పనిచేయడం లేదని, డబుల్ బెడ్రూం ఇల్లు కలగానే మారాయన్నారు. ఈ సారి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. కొంతమంది జర్నలిజం అనుభవం లేకున్నా యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో ఇష్టానుసారం వ్యక్తిగత దూషణలు చేస్తూ కుటుంబాలపై బురద చల్లుతూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బ్లాక్ మెయిలింగ్ యూట్యూబర్లతో జర్నలిజానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. జర్నలిస్టు సంఘాలు, ప్రెస్‌క్లబ్ నిర్వాహకులు ఈ విషయంలో కఠినంగా ఉండాలని కోరారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ సమాజ హితం కోసం పనిచేసే యూట్యూబ్ ఛానళ్లను ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్వరలోనే సైనిక్ స్కూల్ ఏర్పాటు అయ్యేందుకు కృషిచేస్తానని అన్నారు. వేములవాడ ప్రెస్‌క్లబ్ భవనానికి గతంలో పది లక్షల రూపాయలు కేటాయించానని, త్వరలో మరిన్ని నిధులు కేటాయిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కుమ్మరి శంకర్, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.