Home » TG Politics
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి హరీష్‌రావుకు మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.
ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి తామే కారణమని సభకు వచ్చి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హితవు పలికారు. బీసీ రిజర్వేషన్లపై, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు ఎందుకు రారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆదివారం హడావుడిగా చర్చ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏంటో అర్థమైందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కేసీఆర్‌కు, తనకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 8బీ కింద నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. 8బీ కింద నోటీసులు ఇవ్వకపోతే రిపోర్టు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని మాజీ మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు.
కేబినెట్ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేలకోట్లు అవసరమని పేర్కొన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని వెల్లడించారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. యువతకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత తమలోని శక్తిని గుర్తించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కానీ ఆది శ్రీనివాస్ వరకు ప్రతిఫలాలు వెళ్ళే పరిస్థితులు కాంగ్రెస్‌లో లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయంటే తెలంగాణ బీసీ సమాజం అంత సంబర పడ్డారని గుర్తు చేశారు.
అసెంబ్లీ వాయిదా అనంతరం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్, హరీశ్ రావు సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుచరించాల్సిన వ్యూహంపై వారు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చే సాంప్రదాయం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు.
అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు లేదా అంతకు మించి నిర్వహించినా తాము సిద్ధమే అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.