Fire Accident: పెళ్లి వేడుకలో ఘోర అగ్నిప్రమాదం.. 100 మంది ప్రాణాలు గల్లంతు

ABN , First Publish Date - 2023-09-27T09:23:09+05:30 IST

ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పెళ్లి వేడుకలో చెలరేగిన మంటల్లో ఇప్పటివరకు 100 మంది మరణించారు. 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

Fire Accident: పెళ్లి వేడుకలో ఘోర అగ్నిప్రమాదం.. 100 మంది ప్రాణాలు గల్లంతు

బాగ్దాద్: ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పెళ్లి వేడుకలో చెలరేగిన మంటల్లో ఇప్పటివరకు 100 మంది మరణించారు. 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో వివాహ వేడుకలో పెను విషాదం చోటుచేసుకుంది. ఉత్తర ఇరాక్‌లోని నినెవే ప్రావిన్స్‌లో గల హమ్దానియాలో ఓ క్రైస్తవ వివాహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది రాజధాని బాగ్దాద్‌కు వాయువ్యంగా దాదాపు 335 కిలోమీటర్ల (205 మైళ్లు) దూరంలో ఉన్న మోసుల్ నగరానికి వెలుపల క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతం. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10:45 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో వధువరులు కూడా గాయపడినట్లు సమాచారం. పెళ్లి వేడుకల సందర్భంగా వివాహా హాల్‌లో పేల్చిన బాణాసంచానే ఈ అగ్నిప్రమాదానికి కారణమని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ‘‘ప్రాథమిక సమాచారం ప్రకారం వివాహ వేడుకలో బాణాసంచా కాల్చారు. దీంతో హాల్‌లో మంటలు చేలరేగడానికి కారణమైంది’’ అని పౌర రక్షణ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఇరాక్‌లో జరిగే వివాహ వేడుకల్లో బాణాసంచా కాల్చడం సాధారణ విషయం అని స్థానికులు చెబుతున్నారు.


ప్రమాదం జరిగిన సమయంలో వివాహ వేడుకలో దాదాపు 1000 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించినట్లు ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్-బదర్ తెలిపారు. "దురదృష్టకర ప్రమాదంలో ప్రభావితమైన వారికి సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని అల్-బదర్ చెప్పారు. మరోవైపు ప్రధాన మంత్రి మహమ్మద్ షియా అల్-సుడానీ అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను కోరినట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారిలో కొందరిని ప్రాంతీయ ఆసుపత్రులకు తరలించినట్లు నినెవే ప్రావిన్షియల్ గవర్నర్ నజిమ్ అల్-జుబౌరీ తెలిపారు. మంటలు చెలరేగడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

Updated Date - 2023-09-27T09:23:09+05:30 IST