Share News

జగన్‌... ఇచ్చిన హామీ మరిచావా ?

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:33 PM

జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట మారిచావా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

జగన్‌... ఇచ్చిన హామీ మరిచావా ?
మధ్యలో నిలిచిపోయిన వంతెన పనులు

ఓట్లు తప్ప ప్రజల కష్టాలు పట్టవా

గోరంట్ల-కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం ఏమైంది..!

గెలిచిన నాలుగేళ్లకు టెంకాయ కొట్టిన మంత్రి బుగ్గన

బిల్లులు పెండింగ్‌తో పనులు ఆపేసిన కాంట్రాక్టర్‌

కోడుమూరు, ఏప్రిల్‌ 30: జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట మారిచావా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 40 గ్రామాల ప్రజలకు రాకపోకలు కొనసాగే విధంగా కోడుమూరు మండలం గోరంట్ల కొత్తపల్లి హంద్రీనదిపై వంతెన నిర్మాణం చేపడతానని 2017 డిసెంబరు 25న పాదయాత్రలో సాక్షాత్తు జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని ఓట్ల కోసం వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల అనంతరం 2023 జనవరి 24న గోరంట్ల, కొత్తపల్లి వంతెన నిర్మాణమంటూ ఎంతో ఆర్భాటంగా రాష్ట్ర మంత్రి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎంపీ సంజీవ్‌కుమార్‌ పత్తికొండ, కోడుమూరు ఎమ్మెల్యేలు శ్రీదేవి, డాక్టర్‌ జరదొడ్డి సుధాకర్‌, కూడా చైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి అందరు కలిసి టెంకాయకొట్టి పనులను ప్రారంభిచారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అంటూ సదరు కాంట్రాక్టర్‌ ఎంతో ఉల్లాసంగా పనులు చకచకా చేపట్టారు. ఒకటి కాదు రెండు కాదు సుమారు రూ.6 కోట్లు ఖర్చు చేసి వంతెన నిర్మాణం కోసం 19 పిల్లర్లు నిర్మించారు. అదిగో బిల్లు ఇదిగో అంటూ సంబంధిత అధికారులు కాంట్రాక్టర్‌ను ఊరించారు. ఏడు నెలలు బిల్లుల కోసం ఎదురు చూశాడు. కానీ ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ రాలేదు. దీంతో బిల్లు వస్తే తప్ప పనులు చేయలేనని కాంట్రాక్టరు చేతులెత్తేశాడు. 2023 ఆగస్టులో పనులను నిలిపివేసిన సదరు కాంట్రాక్టర్‌ ఇంత వరకు పనుల వైపు తొంగి చూడలేదు.

జగన్‌ ఇచ్చిన హామికే నిధుల కొరత :

కోడుమూరు మండలం గోరంట్ల - కొత్తపల్లి గ్రామాల హాంద్రీనదిపై హైలెవల్‌ వంతెన నిర్మాణం అలాగే హంద్రీ నుంచి కొత్తపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం రూ.21 కోట్లు నిధులను విడుదల చేసింది. టెండర్‌ ప్రక్రియను వైఎంఆర్‌ కన్ట్స్రక్షన్‌ సంస్థ చేజిక్కించుకుంది. పీఐయూ పర్యవేక్షణలో ఎంతో వేగవంతంగా పనులను ప్రారంభించారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ యంత్రాలను వదిలేసి కాంట్రాక్టర్‌ తట్టాబుట్ట సర్దుకొని పరార్‌ అయ్యాడు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామికే నిధుల కొరత అంటూ ప్రజలు ప్రజలు వైసీపీ ప్రభుత్వం విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్‌ :

వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకొని సదరు కాంట్రాక్టర్‌ గోరంట్ల-కొత్తపల్లి వంతెనతో పాటు కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల-కర్నూలు రోడ్డు, ముడుమలగుర్తి, బుడిదపాడు, గొందిపర్ల, బ్రహ్మణదొడ్డి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు సమాచారం. రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసినా ఇంత వరకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ భారీ ఎత్తున నష్టపోయినట్లు తెలిసింది. బిల్లుల కోసం కాంట్రాక్టర్‌ కోర్టును ఆశ్రయించి కొంత డబ్బును రాబట్టుకున్నట్లు సమాచారం.

Updated Date - Apr 30 , 2024 | 11:34 PM