Share News

నరకయాత్రన!

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:42 AM

సీఎం జగన్‌ రోడ్‌ షో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావాసులకు నరకయాతనగా మారింది.

నరకయాత్రన!
జగన్‌ కదిలితేనే కదలండి : ఎస్టీ రాజాపురం వద్ద ప్రయాణికుల అడ్డగింత

కాకినాడ సభకు భారీగా ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల ఇక్కట్లు

జగన్‌ రోడ్‌ షో.. జనాన్ని మండుటెండలో నిలిపేసిన పోలీసులు

కాకినాడలో ‘మేమంతా సిద్ధం’ సభ

మధ్యలోనే వెళ్లిపోయిన జనం

పిఠాపురంలో బస్‌ లోపల్నుంచే అభివాదం

రాజమహేంద్రవరం/సర్పవరంజంక్షన్‌/పిఠాపురం/గొల్లప్రోలు/ప్రత్తిపాడు/ కొత్తపల్లి/ఏలేశ్వరం, ఏప్రిల్‌19: సీఎం జగన్‌ రోడ్‌ షో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావాసులకు నరకయాతనగా మారింది. కాకినాడ రూరల్‌ అచ్చంపేట వద్ద జరి గిన మేమంతా సిద్ధం సభకు భారీగా ఆర్టీసీ బస్సుల కేటాయించారు. దీంతో డిపో ల్లో బస్సులు లేక ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు యాత్ర దారిలో ప్రజలను ఎక్కడికక్కడ మండుటెండలో నిలిపివేశారు. పెద్దా పురం ఏడీబీ రహదారిపైకి రాకుండా బారికేడ్లు పెట్టి అడ్డుకున్నా రు. దీంతో విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లేవారు సతమతమ య్యారు. జగన్‌ బస్సు యాత్ర రెండో రోజు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఎస్టీ రాజా పురంలోని బస కేంద్రం నుంచి ఉదయం 10.30 గంటల కు జగన్‌ బస్సులో బయలుదేరారు. యథావిధిగా నోరు విప్పకుండా ఏసీ బస్సులోంచి నమస్కారం పెడుతూ వెళ్లిపోయారు. జగన్‌ వస్తే జనాలకు తిప్పలు తప్పవనే నానుడి మరోసారి రుజువైంది. ముందస్తు సమాచారం లేకుండా ఏడీబీ రోడ్డులో ట్రాఫిక్‌ని ఇష్టానుసారం ఎక్కడి కక్కడ నిలిపి వేయడంతో జనం ఎండలో అల్లాడిపోయా రు. రాజమహేంద్రవరం నుంచి పెద్దాపురం వెళుతున్న ఓ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులను సీఎం బసకు కొద్దిదూరంలో రాజానగరం జంక్షను వద్ద బస్సుల్లోంచి దింపేశారు. వారి ఎక్కి వచ్చిన ఆర్టీసీ బస్సులను అక్కడే నిలిపివేశారు. తమకు సెమిస్టర్‌ పరీక్షలు ఉన్నాయని కనీసం ఒక్క బస్సునైనా అనుమతించాలని విద్యార్థులు పోలీసుల కాళ్లావేళ్లాపడ్డా కనికరించలేదు. దీంతో సుమారు 50మంది ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఎండలో రోడ్డుపై, తాటిచెట్ల కింద నిలబడి వాహనాల కోసం ఒత్తిడి పడుతూ ఎదురుచూశారు. అటు కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి 300 ఆర్టీసీ బస్సులు, సిటీకి 150 బస్సులు సమకూర్చినా, బస్సులో సీఎం సభకు వచ్చేందుకు ప్రజలు నిరాసక్తత ప్రదర్శించడంతో నాయకులు ఖంగుతిన్నారు. ఫలితంగా సగానికి పైగా ఆర్టీసీ బస్సులు ఖాళీగానే కాకినాడ సిటీ, రూరల్‌, కరప మండలాల నుంచి అచ్చంపేట సెంటర్‌కు రావడం విశేషం. ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడిన తర్వాత ప్రజలను ఉద్ధేశించి సీఎం జగన్‌ ప్రసంగం ప్రారంభించిన వెంటనే కార్యకర్తలు, మహిళలు సభా ప్రాంగణం నుంచి బయటకువెళ్లిపోవడం మొదలుపెట్టారు. దీంతో ఖంగుతిన్న నాయకులు సభాప్రాంగణం నుంచి బయటకు వెళ్లకుండా చూడాలంటూ పోలీసులను అభ్యర్థించడంతో కొద్దిసేపు పోలీసులు ప్రజలను నిలువరించినా, వీరి మాటలను పట్టించుకోకుండా బారికేడ్లు దాటుకుని మరీ బయటకు వెళ్లిపోవడం కనిపించింది.

80శాతంపైగా బస్సులు రద్దు

ఎన్నికలు వచ్చినా వైసీపీ అధికార దుర్వినియోగం ఆగడం లేదు. సీఎం జగన్‌ సిద్ధం సభకు ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు భారీగా వినియోగించారు. దీంతో ఆయా బస్టాపుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, అనకాపల్లి, విశాఖపట్టణం జిల్లాల్లోని అన్ని డిపోలనుంచి ఆర్టీసీ బస్సులను తీసుకువచ్చారు. వీటికి అదనంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డిపోల ఆర్టీసీ బస్సులను సిద్ధం సభ కోసం కేటాయించారు. కాకినాడ, తుని, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, పిఠాపురం సహా అన్ని ఆర్టీసీ డిపోలకు చెందిన బస్సులను సభ కోసం కేటాయించడంతో కాకినాడ-కత్తిపూడి-తుని-సామర్లకోట రూట్‌లో తిరిగే బస్సుల్లో 80శాతంపైగా రద్దు చేశారు. దీనివల్ల ఆయా బస్టాపుల్లో ఉదయం నుంచి ప్రయాణికులకు పడిగాపులు తప్పలేదు. కళాశాలలు, పాఠశాలలుకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలు, వ్యాపారాలు నిమిత్తం వెళ్లే వారితోపాటు వివిధ వర్గాల ప్రజలు, మహిళలు బస్సులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది.

బస్సుయాత్రలో ఆగని జగన్‌

పిఠాపురం/పిఠాపురం రూరల్‌, ఏప్రిల్‌ 19: కాకినాడ రూరల్‌ అచ్చం పేటలో ‘మేమంతా సిద్ధం’ సభ ముగిసిన తర్వాత సీఎం జగన్‌ బస్సు యాత్ర పిఠాపురం బైపాస్‌రోడ్డులో వెళ్లింది. జగన్‌ కోసం ఎదురుచూపులు చూసిన వారికి నిరాశే మిగిలింది. బస్సును ఆపకుండా లోపల నుంచే అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. పిఠాపురం మండలం చిత్రాడలో సీఎం జగన్‌ బస్సుయాత్రకు జనం కరువయ్యారు. జగన్‌ శుక్రవారం సాయంత్రం వస్తున్నట్టు ప్రచారం చేసినా ఎవ్వరు రోడ్ల మీదకు రాలేదు. దీంతో పోలీసులు రోడ్లుకు ఇరువైపులా ఉన్న షాపులను మూ యించకుండా వదిలివేశారు. జగన్‌ రాకతో ట్రాఫిక్‌ నిలిపివేత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. జగన్‌ రాక ముందు, వెళ్లిన తర్వాత గంటకు పైగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో వాహనదారులు అందులో చిక్కుకున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టి పెట్టకపోవడంతో బైపాస్‌రోడ్డుకి ఇరువైపులా, పిఠాపురం-సామర్లకోట రోడ్డులో వెళ్తున్న వారికి అనేక అగచాట్లు తప్పలేదు.

పెద్దాపురంలో రోడ్‌ షో వెలవెల

పెద్దాపురం/సామర్లకోట, ఏప్రిల్‌ 19: మేమంతా సిద్ధం పేరుతో బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం జగన్‌కు పెద్దాపురం పట్టణంలో ప్రజలు గట్టి షాకిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం ఎస్టీ రాజాపురం నుంచి బయలుదేరిన సీఎం జగన్‌కు పెద్దాపురంలో స్వాగతం పలికేందుకు ఒక్కరూ కూడా రాలేదు. పెద్దాపురం పాండవుల మెట్ట జంక్షన్‌, వాలుతిమ్మాపురం జంక్షన్‌, ఆర్‌బీ పట్నం జంక్షన్‌లవద్ద జనాలు లేకపోవడంతో రోడ్‌ షో వెలవెల బోయింది.ఏడీబీ రహదారి పొడవునా బస్సు యాత్రకు జనం కరువయ్యారు. దీంతో రోడ్‌ షో చప్పగా సాగింది. జగన్‌ బస్సు యాత్ర కారణంగా ఉదయం 7 గంటల నుంచి ప్రజలు నరకయాతన అనుభవించారు. రాజమహేంద్రవరం వైపుగా వెళ్లే వాహనాలను పోలీసులు అనుమతించకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఐదు గంటలపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఆస్పత్రికి వెళ్లే రోగులు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు అల్లాడిపోయారు.

Updated Date - Apr 20 , 2024 | 12:42 AM