Share News

పాతపాటే!

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:57 AM

ఈసారి ఎన్నికల వైసీపీ మేనిఫెస్టో తుస్సుమంది. కొద్దిరోజులుగా జగన్‌ ప్రకటించే మేనిఫెస్టోపై రకరకాల ఊహాగానాలను ఆ పార్టీ నేతలు ప్రచారంలోకి తెచ్చారు. అభ్యర్థుల ప్రచార సమయంలో కూడా ఓటర్లకు పింఛన్లు భారీగా పెంచుతామని, యువతకు ఉద్యోగాలంటూ నేరుగా చెబుతూ వచ్చారు. తీరా మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఆ పార్టీ వారికే మింగుడుపడడం లేదు.

పాతపాటే!
జగన్‌ మేనిఫెస్టో

విస్తుబోయిన నేతలు.. డీలాపడిన సొంత పార్టీ శ్రేణులు..

ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతకు జగన్‌ మొండిచెయ్యి

బీసీ, ముస్లిం, మైనారిటీల రిజర్వేషన్ల ఊసూ లేదు

పోలవరానికి మరో అయిదేళ్లూ కావాలట

పింఛనుదారులకు గత ఎన్నికల నాటి తంతే ఈసారీ

2028లో రూ.250, 2029లో రూ.250 పెంచుతామని మెలిక

ఇప్పటికే రూ.4 వేలు పింఛను ఇస్తామని టీడీపీ కూటమి ప్రకటన

వ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని మరో అద్భుత వరం

మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తామన్న చంద్రబాబు

బీసీల రిజర్వేషన్లు 34 శాతానికి పెంపు.. ప్రత్యేక రక్షణ చట్టం

పథకాలతో కూటమిలో జోష్‌.. మేనిఫెస్టోతో వైసీపీ కేడర్‌ డీలా

ఈసారి ఎన్నికల వైసీపీ మేనిఫెస్టో తుస్సుమంది. కొద్దిరోజులుగా జగన్‌ ప్రకటించే మేనిఫెస్టోపై రకరకాల ఊహాగానాలను ఆ పార్టీ నేతలు ప్రచారంలోకి తెచ్చారు. అభ్యర్థుల ప్రచార సమయంలో కూడా ఓటర్లకు పింఛన్లు భారీగా పెంచుతామని, యువతకు ఉద్యోగాలంటూ నేరుగా చెబుతూ వచ్చారు. తీరా మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఆ పార్టీ వారికే మింగుడుపడడం లేదు. గత ఎన్నికల్లో మాదిరే ఈసారీ ‘పెంచుకుంటూ పోతాం’ అనే పల్లవినే జగన్‌ అందుకోవడం విశేషం. గత ఎన్నికల సమయంలో పింఛన్ల ప్రకటనలో కూడా ఇదే గందరగోళం సృష్టించారు. పెంచుకుంటూ పోతామనే దానికి అర్థం ఏమిటో పింఛనుదార్లకు తర్వాతగానీ బోధపడలేదు. ఈసారీ అదే పల్లవి అందుకోవడంతో గత హామీ అమలును గుర్తుచేస్తున్నారు. కొత్తగా వైసీపీ మేనిఫెస్టోలో ఏ పథకాలు లేకపోగా, టీడీపీ ఏడాదికాలం కింద ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పేరిట జనం నోళ్లలో నానుతున్న పథకాలతో పోల్చి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పింఛన్ల పెంపు, 20 లక్షల ఉద్యోగాల కల్పన, మహాశక్తి పథకాలపై చర్చ జరుగుతోంది.

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

ఈసారి మేనిఫెస్టో రూపకల్పనలోనే వైసీపీ బోల్తాపడింది. ప్రజలకు కొత్తగా ఒక హామీ కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఎన్నో ఊహాగానాలు అల్లుకున్న ఆ పార్టీ కేడర్‌ సైతం డీలా పడిపోయింది. శనివారం ప్రకటించిన వైసీపీ ఎన్నికల మేని ఫెస్టో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రకటించిన సూపర్‌సి క్స్‌ మేనిఫెస్టో ముందు బోల్తాపడింది. గతంలోని పథకాలకే కొన్ని రంగులు పులిమి, నవరత్నాలు పేరిట ఉన్న పథకాలనే కొనసాగిస్తామని చెబుతూ రెండు పేజీలతో సరిపెట్టారు. నిజానికి ఆనాటి హామీలు కూడా పూర్తిస్థాయిలో అమలుకాలే దు. అలాగే ఆయా పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను కుదించి, అరకొరగా అమలుచేశారు. దీంతో అర్హులెందరికో లబ్ధి చేకూర లేదు. ఆదిలోనే పింఛను విషయంలో బురుడీ కొట్టించిన వైనా న్ని పలువురు గుర్తుచేస్తున్నారు. మూడు వేల పింఛను ఇస్తా మని.. ఏడాదికి రూ.250 ఇవ్వడంపై లబ్ధిదారులు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. ప్రస్తుత మేనిఫెస్టోలో కూడా ఇదే పాట పాడగా, రూ.500 మాత్రమే పెంచి అది కూడా చివరి రెండు ఏళ్లలో పెంచుతామని మెలిక పెట్టారు. అంటే పెన్షన్ల సొమ్ము ఈ ఏడాది పెంచరట. వచ్చే ఏడాది 2025లో పెంచరు. 2026, 2027లోనూ పెంచరు. ఎన్నికల చివరి ఏడాది అంటే 2028లో రూ.250, ఎన్నికల ఏడాది 2029లో రూ.250 పెంచి మొత్తం రూ.3,500 చేస్తారట. ఈ ప్రకటన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర కేటగిరీల కింద పెన్షన్‌ పొందుతున్న వారి లో తీవ్ర ఆవేదన మిగిల్చింది. ఆగ్రహానికి గురిచేసింది. దివ్యాం గులకు వైసీపీ పాలనలో తీరని అన్యాయం చేశారు. వారికి ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఇప్పుడూ వారి మాట మరిచారు. ఇక టీడీపీ ఏడాది కిందటే సూపర్‌ సిక్స్‌ పేరిట ప్రజలకు అనేక వరాలిచ్చింది. ఇప్పుడు కూటమి తరపున కూడా ఈ పథకాలను ఇస్తామంటూ చంద్రబాబు, పవన్‌ భరోసా ఇచ్చారు. అందులో నెలకు రూ.4 వేల పింఛన్‌.. అది కూడా ఏప్రిల్‌ నుంచే లెక్కకట్టి, జూలై నెలలో ఏకంగా ఏడు వేలు ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దివ్యాంగులకు నెలకు రూ.ఆరు వేలు ఇస్తానని స్పష్టంచేశారు. ఇక వైసీపీ అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించింది. దీంతో వేలాది మంది బీసీలు స్థానిక సంస్థల్లో పదవులు కోల్పోయారు. కానీ జగన్‌ మేనిఫెస్టోలో ఆ ఊసే లేదు. టీడీపీ కూటమి మాత్రం బీసీల రిజర్వేషన్లు 34 శాతానికి పెంచుతామని స్పష్టంచేసింది. అలాగే బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకొస్తామని సూపర్‌ సిక్స్‌లో ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టంపై ప్రధానంగా ఆయా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మహిళల విషయంలో కూడా పాతపాటే. ఎంతో చేశానని, అదే మళ్లీ చేసేస్తానని జగన్‌ చెప్పారు. ఇది కూడా మహిళల్లో మరింత అసంృత్తిని రేపింది. బటన్‌ నొక్కిన కొన్ని నెలలకు కొంత జమ చేస్తూ ఈ ఐదేళ్లు మహిళలను ఇబ్బంది పెట్టిన సంగతి తెలి సిందే. ఇవాళ టీడీపీ కూటమి మహిళలకు మహాశక్తి పథకం అమలుచేయనుంది. ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది మహిళలకు నెలకు రూ.1500 ఇస్తారు. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు వారికి ఏడా దికి రూ.15వేల వంతున ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, మూడు గ్యాస్‌ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని కూటమి ప్రకటించింది. ఇక రైతులకు ఏడాది రూ.20 వేలు పంట పెట్టుబడికి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇలా అన్నివర్గాల సంక్షేమంతోపాటు రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తామనే కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇవాళ జగనన్న ఇళ్లు పేరిట కేవలం సెంటు భూమి పనికిరాని భూముల్లో ఇవ్వగా, తాము 3 సెంట్ల భూమి ఇచ్చి.. ఇల్లు మంజూరు చేస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. 2019కే పూర్తి కావలసిన పోలవరాన్ని ఐదేళ్లలో గాలికి వదిలేసిన జగన్‌, దీని నిర్మాణానికి మరో ఐదేళ్లు కావా లని మేనిఫెస్టోలో పెట్టడాన్ని జనం ఆక్షేపిస్తున్నారు. తిరకాసు, మోసపూరిత హామీలతో బురిడీ కొట్టించాలని చూస్తే.. జనం నమ్మరని జగన్‌ మేనిఫెస్టోపై పలువురు వ్యాఖ్యానించారు.

ఒరిగేదేం లేదు...

వైసీపీ మేనిఫెస్టో నిరాశపరిచింది. దీనివల్ల ప్రజలకు కొత్తగా ఒరిగేది ఏం లేదు. అవ్వాతాతలకు రూ.4 వేల పింఛను ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. సూపర్‌సిక్స్‌ పథకాలు అందరికీ మేలు చేకూరుస్తా యి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ప్రతి నెలా ఆర్థిక చేయూత ఇస్తామని బాబు హామీ ఇచ్చారు.

- కరుటూరి విశ్వేశ్వరి, అంకంపాలెం

చంద్రబాబు హయాంలోనే బాగు

ప్రతీ ఇంటికీ ఫించన్‌, ఇల్లు, రేషన్‌కార్డులు వంటి పథకాలు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కూడా అమలుచేశారు. కొత్తగా జగన్‌ ప్రభుత్వంలో ఒరగబెట్టింది లేదు.

- సత్యవతి, సామర్లకోట

అంతా మోసమే..

ఒక ఛాన్స్‌ అంటూ అధి కారంలోకి వచ్చిన జగన్‌ గత ఎన్నికల మేనిఫె స్టోలో 95 శాతం పూర్తి చేశానని చెప్పి ప్రజల్ని మోసం చేశారు. యువకులు నిరుద్యోగంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రజలకు ఏదీ అందలేదు.

- సత్తిరాజు ఆదిత్యకిరణ్‌, కొత్తపేట

Updated Date - Apr 28 , 2024 | 12:57 AM