Share News

హ్యాట్రిక్‌ ఎంపీ ఎస్పీ వైరెడ్డికి మరణానంతరం ఓటమి

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:35 PM

ఉమ్మడి జిల్లా నుంచి పార్లమెంట్‌కు ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, వరుస విజయాలతో హ్యాట్రిక్‌ ఎంపీగా ఎస్పీవైరెడ్డి రికార్డు సాధించారు.

హ్యాట్రిక్‌ ఎంపీ ఎస్పీ వైరెడ్డికి మరణానంతరం ఓటమి
ఎస్పీవైరెడ్డి

15 సంవత్సరాలు వరుసగా పార్లమెంట్‌ సభ్యుడిగా రికార్డు

నంద్యాల టౌన, ఏప్రిల్‌ 30 : ఉమ్మడి జిల్లా నుంచి పార్లమెంట్‌కు ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, వరుస విజయాలతో హ్యాట్రిక్‌ ఎంపీగా ఎస్పీవైరెడ్డి రికార్డు సాధించారు. 15 సంవత్సరాల పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగిన ఆయన చనిపోయాక పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నంద్యాల ఎంపీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్‌ ఎంపీ ఎస్‌పీవైరెడ్డి ఫలితాలకు ముందే మరణించారు. ఫలితాల్లో మూడో స్థానంలో నిలిచారు. నంద్యాల, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి రాజకీయ ఉద్దండులు ఎంపీలుగా ఎన్నికై రాజకీయాల్లో రాణించారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూమా నాగిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి పీవీ రంగయ్య నాయుడుపై విజయం సాధించి మొదటి సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై భూమా నాగిరెడ్డి పోటీ చేసి రెండోసారి ఎంపీగా గెలుపొందారు. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపైనే టీడీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి పోటీ చేసి గెలుపొంది వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధించినప్పటికీ 8 సంవత్సరాలు మాత్రమే భూమా నాగిరెడ్డి ఎంపీ పదవిలో ఉన్నారు.

చనిపోయాక ఓడిన ఎస్పీవైరెడ్డి..:

2004లో టీడీపీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డిపై 1,11,679 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎస్పీవైరెడ్డి మొదటిసారిగా ఎంపీగా గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి ఎనఎండీ ఫరూక్‌పై 90,847 ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రెండోసారి ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిన ఎస్పీవైరెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎనఎండీ ఫరూక్‌పై 1,05,766 ఓట్లతో మూడోసారి ఎంపీగా గెలిచారు. హ్యాట్రిక్‌ సాధించిన ఎస్‌పీవైరెడ్డి గెలిచిన వారం రోజుల్లోపే సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ముందు వరకు టీడీపీలోనే ఎస్‌పీవైరెడ్డి కొనసాగారు. నంద్యాల సిట్టింగ్‌ ఎంపీగా తెలుగుదేశం టికెట్‌ను దక్కకపోవడంతో జనసేన గూటికి చేరారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాండ్ర శివానందరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పోచా బ్రహ్మానందరెడ్డిలకు ప్రత్యర్థిగా జనసేన అభ్యర్థిగా నంద్యాల పార్లమెంట్‌ బరిలోకి ఎస్‌పీవైరెడ్డి దిగారు. అయితే పోలింగ్‌కు ముందు నుంచే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2019 ఏప్రిల్‌ 30వ తేదీన మృతి చెందాడు. ఆ ఎన్నికల ఫలితాలలో నంద్యాల ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి 2,50,119 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పోచాకు 7,20,888 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డికి 4,70,769 ఓట్లు వచ్చాయి. హ్యాట్రిక్‌ ఎంపీగా జిల్లాలో చక్రం తిప్పిన ఎస్పీవైరెడ్డి (జనసేన)కి 38,871 ఓట్లు వచ్చాయి. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన ఎస్పీవైరెడ్డి 15 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి చివరిలో మరణానంతరం ఓడిపోయిన వ్యక్తిగా రాజకీయ పుటల్లో నిలిచారు.

Updated Date - Apr 30 , 2024 | 11:37 PM