Share News

అట్టహాసంగా కేశినేని శివనాథ్‌(చిన్ని) నామినేషన్‌

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:10 AM

బీజేపీ-జనసేన బలపరచిన విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) శుక్రవారం విజయోత్సవంలా.. ఉత్సాహపూరిత వాతావరణంలో అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అట్టహాసంగా కేశినేని శివనాథ్‌(చిన్ని) నామినేషన్‌

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 19 : బీజేపీ-జనసేన బలపరచిన విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) శుక్రవారం విజయోత్సవంలా.. ఉత్సాహపూరిత వాతావరణంలో అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీగా వెళుతుండగా.. కేశినేని చిన్ని, జానకీలక్ష్మి దంపతులకు గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు ఇచ్చారు. అనంతరం ప్రత్యేక వాహనంపై ర్యాలీగా బయలుదేరగా.. కేశినేని శివనాథ్‌ కుటుంబసభ్యులు, బుద్దా వెంకన్న, గద్దె రామ్మోహన్‌, ఆళ్ల గోపాలకృష్ణ, తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ-జనసేన-టీడీపీ శ్రేణులు పార్టీ జెండాలతో ఆకర్షణీయంగా జన ప్రవాహంతో ర్యాలీ కొనసాగింది. పెద్ద ఎత్తున జనం పాల్గొనడంతో విజయం ముందే వచ్చేసిందన్న ఆనందోత్సాహాల్లో పార్టీశ్రేణులు ఉన్నారు. తొలుత బుద్దా వెంకన్న బైక్‌పై కేశినేని చిన్ని సందడి చేశారు. బందర్‌రోడ్డులోని మాంటిస్సోరి స్కూల్‌లో సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ సంతకం చేసి ప్రతిపాదన చేయగా నామినేషన్‌ పత్రాన్ని శివనాథ్‌ రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.

ముందుగా గురునానక్‌ కాలనీలోని ఎన్టీఆర్‌ భవన్‌లో శివనాథ్‌ కుటుంబసభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెంజిసర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఆధ్వర్యంలో మహిళలు చిన్నికి హారతులు ఇచ్చి విజయతిలకం దిద్దారు. హజరత్‌ సయ్యద్‌ షాహీ ఖాదిరి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కెనాల్‌రోడ్డులో వినాయకుడి ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుల్లెట్‌ నడపగా కేశినేని శివనాథ్‌ కండువా గాలిలో ఊపుతూ ప్రజలకు అభివాదం చేశారు. పార్టీశ్రేణులు చిన్నికి గజమాలలతో స్వాగతం పలికారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌, పట్టాభిరామ్‌, నాగుల్‌మీరా, ఎంఎస్‌ బేగ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌, జనసేన సమన్వయకర్త అమ్మిశెట్టి వాసులు పాల్గొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాధం, యునైటెడ్‌ క్రిష్టియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల జవహర్‌ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. నామినేషన్‌ దాఖలుకు ముహూర్తం దగ్గరపడటంతో విజయవాడ పాత బస్టాండ్‌ నుంచి జలీల్‌ఖాన్‌తో కారులో సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. నందిగామ అభ్యర్థిని తంగిరాల సౌమ్య శివనాథ్‌కు అభినందనలు తెలిపారు.

పెనమలూరులో బోడె ప్రసాద్‌..

పెనమలూరు : వచ్చే ఎన్నికల్లో పెనమలూరు అసెంబ్లీ సీటును అత్యధిక మెజారిటీతో గెలిచి అధినేత చంద్రబాబుకు కానుకగా ఇస్తానని టీడీపీ కూటమి అభ్యర్ధి బోడె ప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ల పత్రాలను ఆయన నియోజకవర్గ కార్యాలయంలో ఆర్వో రాజుకు అందజేశారు. బోడె సతీమణి హేమ మరో రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ, చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానివ్వనని స్పష్టం చేశారు. పార్టీల శ్రేణులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా మాట్లాడుతూ, ఒక వ్యక్తి తాను బటన్‌ నొక్కానని పదేపదే అంటున్నాడని ప్రజలు కూడా టీడీపీ కూటమి గెలుపు కోసం బటన్‌ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు బోడెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నామినేషన్‌ కార్యక్రమంలో బందరు పార్లమెంటు అభ్యర్ధి బాలశౌరి, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్‌, అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకరబాబు, ముప్పా రాజా, మారుపూడి ధనకోటేశ్వరరావు, కోయ ఆనంద్‌ ప్రసాద్‌, యార్లగడ్డ సుచిత్ర, షేక్‌ బుజ్జిలు ఉన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:10 AM