Share News

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:09 AM

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం చైత్రమాస వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. తొలిరోజు శుక్రవారం మంగళవాయిద్యాలు, పండితుల వేదఘోష, వేద మంత్రాల మధ్య వైదిక కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు, అర్చక సిబ్బందితో పాటు ఈవో కేఎస్‌ రామారావు పాల్గొని గంగా, పార్వతి సమేత మల్లేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 19 : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం చైత్రమాస వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. తొలిరోజు శుక్రవారం మంగళవాయిద్యాలు, పండితుల వేదఘోష, వేద మంత్రాల మధ్య వైదిక కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు, అర్చక సిబ్బందితో పాటు ఈవో కేఎస్‌ రామారావు పాల్గొని గంగా, పార్వతి సమేత మల్లేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. పుణ్యాహవచనం, గణపతిపూజ, ఆఖండ దీపస్థాపన, కలశారాధన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గంగా, పార్వతి సమేత మల్లేశ్వరస్వామికి మంగళస్నానాలు చేయించారు. స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించారు. సాయంత్రం ధ్వజారోహణ చేసి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెండి పల్లకిపై ఉత్సవమూర్తులను ఊరేగించారు. మహామండపం నుంచి కనకదుర్గానగర్‌, రథం సెంటర్‌, బ్రాహ్మణవీధి, కోమలావిలాస్‌ సెంటర్‌, సామరంగం చౌక్‌, బ్రాహ్మణ వీధి, రథం సెంటర్ల మీదుగా తిరిగి కొండపైకి ఊరేగింపు చేరుకుంది. ఈవో రామారావు, అర్చక సిబ్బంది పాల్గొన్నారు.

దుర్గమ్మకు కానుకగా 4 బంగారు గాజులు

గుడివాడ రాజేంద్రనగర్‌కు చెందిన కె.సింధూర కుటుంబ సభ్యులు శుక్రవారం ఆలయానికి విచ్చేసి 55 గ్రాముల బరువు గల 4 బంగారు గాజులను అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా ఈవో రామారావుకు అందజేశారు.

దుర్గమ్మను దర్శించుకున్న ఎన్నికల అధికారి సౌరభశర్మ

కనకదుర్గమ్మను ఎన్నికల అభ్యర్థుల వ్యయపరిశీలకుడు సౌరభ్‌ శర్మ దర్శించుకున్నారు. ఈవో కేఎస్‌ రామారావు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈవో ఆయనకు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు.

దుర్గగుడిలో మౌలిక వసతుల పరిశీలన

దుర్గగుడిలో క్యూలలో భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, శానిటేషన్‌ తదితర వసతులపై ఈఈ రమాదేవితో కలిసి ఈవో రామారావు తనిఖీలు చేశారు. భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడొద్దని భక్తులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని వసతులు మెరుగుపరచాలని సూచించారు. ప్రసాదాల కౌంటర్‌లో ఆకస్మిక తనిఖీ చేసి స్టాక్‌ వెరిఫికేషన్‌ రిజిస్టర్‌ నిర్వహణ తదితరాలను సరిచూశారు.

ధర్మపథం వేదికపై ఆంధ్ర నాట్యప్రదర్శన

ధర్మపథం వేదికపై శుక్రవారం రాయన శ్రీనివాసరావు బృందంతో ఆంధ్ర నాట్య ప్రదర్శన జరిగింది. నవ్య, శ్రావణి, తిలోత్తమ, లీలాలాస్య, హేమ, అపర్ణ, లక్ష్మిఛైత్ర, మీనాక్షి, పి.ఉష, జశ్రిత, మధులిక ఆంధ్రనాట్యంలో పాల్గొన్నారు. ఆద్యంతం ఆంధ్రనాట్యం ఆకట్టుకుంది. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం దత్తత దేవాలయం సీతానగరంలోని శ్రీమద్వీరాంజనేయ సహిత కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన పూర్ణాహుతితో శ్రీరామనవమి ఉత్సవాలు ముగిశాయి.

Updated Date - Apr 20 , 2024 | 01:09 AM