Share News

ఆరోగ్యశ్రీ ప్యాకేజీలతో ప్రయోజనం లేదు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:21 AM

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంలో అమలు చేస్తున్న ప్యాకేజీ విధానం వల్ల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఎలాంటి లాభం ఉండడం లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌(ఆష) స్పష్టం చేసింది. ఈ పథకంలో రోగుల భాగస్వామ్యం, బీమా విధానాలను ప్రవేశపెడితే అటు రోగులకు, ఇటు ఆసుపత్రులకు ఉపయోకరంగా ఉంటుందని అభిప్రాయపడింది.

ఆరోగ్యశ్రీ ప్యాకేజీలతో ప్రయోజనం లేదు

విజయవాడ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంలో అమలు చేస్తున్న ప్యాకేజీ విధానం వల్ల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఎలాంటి లాభం ఉండడం లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌(ఆష) స్పష్టం చేసింది. ఈ పథకంలో రోగుల భాగస్వామ్యం, బీమా విధానాలను ప్రవేశపెడితే అటు రోగులకు, ఇటు ఆసుపత్రులకు ఉపయోకరంగా ఉంటుందని అభిప్రాయపడింది. ఆష ప్రతినిధులు అవినాష్‌, విజయ్‌కుమార్‌, వై.రమే్‌షకుమార్‌, నాగమల్లేశ్వరరావు, అప్నా ప్రతినిధి శ్రీనివాసరావు విజయవాడలోని ఓ హోటల్‌లో శనివారం చర్చాగోష్టి నిర్వహించారు. 2007లో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం విస్తృతమైందన్నారు. నాడు ప్రజల వార్షికాదాయాన్ని రూ.75 వేలుగా నిర్ణయించి ఈ పథకానికి లబ్ధిదారులను నిర్ణయించారన్నారు. ఇప్పుడు ఆ పరిమితి రూ.5 లక్షలకు పెంచడంతో పథకాన్ని ఉపయోగించుకునే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ ధరలు మాత్రం పెరగడం లేదన్నారు. ప్రభుత్వం తాజాగా ఈ ప్యాకేజీని రూ.25 లక్షలకు పెంచి, సేవల సంఖ్యను పెంచిందని చెప్పారు. ఈ ప్యాకేజీ విధానం ఆపరేషన్ల చేయాల్సిన వ్యాధులకు మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. మెడికల్‌ (డెంగ్యూ, టైఫాయిడ్‌) వంటి వైద్యానికి ఈ ప్యాకేజీ లాభదాయకం కాదన్నారు. ఈ ప్యాకేజీల విధానం వల్ల వైద్యంలో నాణ్యత తగ్గుతోందని, దాని ప్రభావం రోగులపై పడుతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కొంత ప్రభుత్వం భరిస్తే, మిగిలిన మొత్తాన్ని రోగులు భరించేలా (కోపే) విధానం అమలు చేస్తున్నాయన్నారు. ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల స్పెషాలిటీ ఆసుపత్రులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీని ప్రారంభించినప్పుడు ఒక బీమా కంపెనీల ద్వారా రోగులకు లబ్ది చేకూరే ఏర్పాట్లు చేశారన్నారు. ఈ విధానాన్ని అమలు చేసినా మంచి ప్రయోజనాలు ఉంటాయన్నారు. మెడికల్‌ టూరిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా రాష్ట్రంలో టైర్‌ 1 నగరం ఎక్కడా లేదన్నారు. విజయవాడ, విశాఖపట్నం నగరాలు టైర్‌ 2 కేటగిరీలో ఉన్నాయన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:21 AM