Share News

సపోర్టు లేక..

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:42 AM

ఏళ్లు గడుస్తున్నాయి.. ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి.. బందరు పోర్టు నిర్మాణం కూడా మొదలవుతుంది అనుకునేలోపే దూరమవుతోంది.. ప్రతి ఎన్నికలకు రాజకీయ పార్టీలకు ఇదొక అస్త్రమైతే అవుతోంది కానీ, శాశ్వతం మాత్రం కావట్లేదు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో 2015లో మచిలీపట్నంలో పర్యటించిన జగన్‌ తాము అధికారంలోకి వచ్చాక పటిష్టంగా పోర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పటిష్టత మాట పక్కనపెడితే.. ఎన్నికలకు ముందు హడావిడిగా పనులు ప్రారంభించిన జగన్‌ మేజర్‌ పోర్టును కాస్త మైనర్‌గా మార్చారు. 16 బెర్తుల నుంచి 4 బెర్తులకు కుదించారు. రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న రుణంతో మమ.. అనిపిస్తున్నారు. పనులైతే ప్రారంభమయ్యాయి కానీ, పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో బందరు వాసుల చిరకాల కల ఈసారి కూడా సముద్రంలో కలిసిపోయింది. - మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి

సపోర్టు లేక..

బందరు పోర్టుకు వీడని గ్రహణం

తూతూమంత్రంగానే సాగుతున్న పనులు

11 నెలల్లో చేసిన పనులు 20 శాతమే..

16 బెర్తులతో అంచనాలు.. 4 బెర్తులకు కుదింపు

మేజర్‌ ప్రాజెక్టు నుంచి మైనర్‌ ప్రాజెక్టుకు తగ్గింపు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా వచ్చింది లేదు

పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రుణమే..

మళ్లీ రుణం కోసం తెరవెనుక ప్రయత్నాలు

భారత్‌ సాల్ట్‌ ఫ్యాక్టరీ భూములపై కన్ను

కుదరక.. తీరం వెంబడి స్థలాలు కొట్టేసే కుట్ర

ఏళ్లు గడుస్తున్నాయి.. ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి.. బందరు పోర్టు నిర్మాణం కూడా మొదలవుతుంది అనుకునేలోపే దూరమవుతోంది.. ప్రతి ఎన్నికలకు రాజకీయ పార్టీలకు ఇదొక అస్త్రమైతే అవుతోంది కానీ, శాశ్వతం మాత్రం కావట్లేదు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో 2015లో మచిలీపట్నంలో పర్యటించిన జగన్‌ తాము అధికారంలోకి వచ్చాక పటిష్టంగా పోర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పటిష్టత మాట పక్కనపెడితే.. ఎన్నికలకు ముందు హడావిడిగా పనులు ప్రారంభించిన జగన్‌ మేజర్‌ పోర్టును కాస్త మైనర్‌గా మార్చారు. 16 బెర్తుల నుంచి 4 బెర్తులకు కుదించారు. రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న రుణంతో మమ.. అనిపిస్తున్నారు. పనులైతే ప్రారంభమయ్యాయి కానీ, పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో బందరు వాసుల చిరకాల కల ఈసారి కూడా సముద్రంలో కలిసిపోయింది.

- మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి

టీడీపీ హయాంలో..

2008, ఏప్రిల్‌ 23న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బందరు పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో మేటాస్‌ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. ఆ సంస్థ వివాదాల్లో చిక్కుకోవడంతో పనులు నిలిచిపోయాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు, భూసేకరణ కోసం 2017లో మచిలీపట్నం డెవ లప్‌మెంట్‌ అఽథారిటీ (ముడా)ను ఏర్పాటుచేసింది. దీనిద్వారా 750 ఎకరాలకు పైగా పోర్టు నిర్మాణం జరిగే గ్రామాల పరిధిలోని భూములను రైతుల నుంచి కొన్నారు. ఇందుకోసం ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి 2018లో రూ.200 కోట్లు రుణంగా తీసుకున్నారు. పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో పట్టా భూములను ఎకరం రూ.25 లక్షల చొప్పున చెల్లించి కొన్నారు. మచిలీపట్నం పోర్టుతో పాటు మచిలీపట్నం నగర అభివృద్ధి కోసం సింగపూర్‌, జపాన్‌కు చెందిన సాంకేతిక సంస్థలతో మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేయించారు. 2019 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోర్టు పనులను ప్రారంభించారు. పనులు నవయుగ సంస్థకు అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నాలుగు నెలల్లోనే ఆ కాంట్రాక్టును రద్దు చేసింది.

వైసీపీ వచ్చాక..

2018లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్‌ నాలుగు రోజులు మచిలీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోర్టు నిర్మించి ఓడలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నాలుగు నెలల వ్యవధిలోనే ఆ పనులను నవయుగ సంస్థకు పీపీపీ పద్ధతిలో ఇచ్చి పాత కాంట్రాక్టును రద్దు చేసింది. ప్రభుత్వమే పోర్టు పనులను చేస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.3,683 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ 11 నెలల కిందట పనులు ప్రారంభించారు.

రైతులకు పరిహారం లేదు..!

మచిలీపట్నం-విజయవాడ, కత్తిపూడి -ఒంగోలు జాతీయ రహదారులను మచిలీపట్నంలోని రైలుమార్గానికి అనుసంధానం చేస్తూ పోర్టు నుంచి రోడ్‌ కం రైలు మార్గం నిర్మించాలని 280 ఎకరాలు రైతుల నుంచి కొన్నారు. కానీ, రైతులకు పరిహారం ఇవ్వలేదు. మంగినపూడి బీచ్‌ రోడ్డు నుంచి పోతేపల్లి వరకు రోడ్‌ కం రైలు మార్గాలకు భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ.55 లక్షలు ఇస్తామని అధికారులు చెప్పి అంగీకార పతాల్రు రాయించుకున్నారు. కానీ, రైతులకు నగదు జమ చేయకుండా నిలిపివేశారు. రోడ్‌ కం రైలు నిర్మాణం కోసం గుప్పెడు మట్టి వేయలేదు.

16 బెర్తుల నుంచి 4 బెర్తులకు కుదింపు

మచిలీపట్నం పోర్టును 16 బెర్తులతో నిర్మించాలి. కానీ, వైసీపీ ప్రభుత్వం నాలుగు బెర్తులకే పరిమితం చేసింది. మేజరు పోర్టుగా నిర్మించాల్సింది పోయి మైనర్‌ పోర్టుగా మార్చి పనులు ప్రారంభించింది. రూ.11,994 కోట్ల అంచనాలతో 16 బెర్తులతో నిర్మించాల్సిన పోర్టు పనులను రెండు ఫేజ్‌లుగా విభజించారు. మొదటి ఫేజ్‌లో రూ.3,683 కోట్లతో నాలుగు బెర్తులతో పనులు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న రుణంతోనే ఈ పనులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయలేదు. గత ఏడాది మేలో పనులు ప్రారంభించగా, ఇప్పటివరకు రూ.400 కోట్ల విలువైన పనులే పూర్తయ్యాయి. ఒక్కో బెర్తుకు 300 చొప్పున 1,200 పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 270 పిల్లర్లకు పునాదులు వేశారు. ఓడల రాకపోకల కోసం డ్రెడ్జింగ్‌ పనులను పెద్దఎత్తున చేయాల్సి ఉంది. ప్రస్తుతం మూడు డ్రెడ్జర్లతో కట్టర్‌ సెక్షన్‌ డ్రెడ్జింగ్‌ (సీఎస్‌డీ) పనులు చేస్తున్నారు. మరో డ్రెడ్జరును పనికోసం సిద్ధం చేస్తున్నారు. వీటిద్వారా పనులు ఎప్పటికి పూర్తిచేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. సౌత్‌బ్రేక్‌ వాటర్‌ నిర్మాణం 2,070 మీటర్ల మేర జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,047 మీటర్ల పనులే జరిగాయి. సౌత్‌బ్రేక్‌ వాటర్‌ తొలిదశ పనులు మాత్రమే పూర్తయ్యేదశలో ఉన్నాయి. ఈ రెండు బ్రేక్‌ వాటర్‌ల తొలివిడత నిర్మాణ పనులు పూర్తయ్యాక ఇక్కడి సముద్ర పరిస్థితులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి శాశ్వత ప్రాతిపదికన ఈ బ్రేక్‌ వాటర్‌లు పనిచేసేలా పటిష్టవంతంగా మరో రెండు, మూడు మీటర్ల ఎత్తును పెంచాల్సి ఉంది. ఈ పనులపై ఎప్పటికి అధ్యయనం చేస్తారో, ఎప్పటికి ప్రారంభిస్తారో చూడాలి.

సబ్‌ కాంట్రాక్టర్లకు బిల్లుల్లేవ్‌..!

మెఘా సంస్థ పోర్టు పనులను దక్కించుకుంది. పనులు చేసే అనుభవం ఉన్న వివిధ కాంట్రాక్టర్లకు ఈ పనులను సబ్‌కాంట్రాక్టుకు ఇచ్చింది. అయితే, కొన్ని నెలలుగా సబ్‌ కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. పోర్టు పనులకు సంబంధించిన నిధులను ప్రభుత్వ పక్కదారి పట్టించిందనే ఆరోపణలూ లేకపోలేదు. దీంతో ప్రభుత్వం పోర్టుకు అనుబంధ పరిశ్రమల స్థాపన పేరుతో బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు పల్లెతుమ్మలపాలెంలోని భారత్‌ సాల్ట్‌ ఫ్యాక్టరీకి లీజుకు ఇచ్చిన 6,500 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు గత డిసెంబరులో నోటీసులు జారీచేసింది. దీంతో సాల్ట్‌ కంపెనీపై ఆధారపడి జీవిస్తున్న 2,500 కుటుంబాల వారు ఉద్యమానికి సిద్ధం కావడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. గిలకలదిండి నుంచి పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతం వరకు సముద్రతీరం వెంబడి ఉన్న 2,836 ఎకరాలను ఏపీ మేరీటైమ్‌ బోర్డ్డుకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగంసిద్ధం చేసింది. ఈలోగా ఎన్నికల కోడ్‌ రావడంతో ఈ ఫైలును పక్కనపెట్టేశారు. ఈ భూములను తనఖాగా పెట్టి వివిధ బ్యాంకుల ద్వారా రుణం తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది.

Updated Date - Apr 28 , 2024 | 12:42 AM