Share News

సమాచారం, నిఘా కీలకం

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:15 AM

జిల్లాలో ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయని, ఇక్కడ సమర్థవంతమైన బృందాలు పనిచేస్తున్నాయని, ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు సమాచారం, నిఘా ఆధారిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కీలకమని ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల పరిశీలకులు పేర్కొన్నారు.

సమాచారం, నిఘా కీలకం
నోడల్‌ అధికారుల సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్న కలెక్టర్‌ దిల్లీరావు, హాజరైన ఎన్నికల అధికారులు

కృష్ణలంక, ఏప్రిల్‌ 27 : జిల్లాలో ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయని, ఇక్కడ సమర్థవంతమైన బృందాలు పనిచేస్తున్నాయని, ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు సమాచారం, నిఘా ఆధారిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కీలకమని ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల పరిశీలకులు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అధ్వర్యంలో జరిగిన 16 విభాగాల నోడల్‌ అధికారుల సమీక్షా సమావేశంలో సాధారణ పరిశీలకులు మంజూ రాజ్‌పాల్‌, నరీందర్‌ సింగ్‌ బాలి, పోలీస్‌ అబ్జర్వర్‌ ప్రీతీందర్‌ సింగ్‌, ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.జస్టిన్‌, సౌరభ్‌శర్మ, మదన్‌కుమార్‌లతో పాటు సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ, జేసీ పి.సంపత్‌కుమార్‌, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తదితరులు హాజరయ్యారు. తొలుత కలెక్టర్‌ దిల్లీరావు జిల్లా ఎన్నికల ప్రణాళికలోని అంశాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సాఫీగా సాగిందని, తదుపరి ఈవీఎంల ర్యాండమైజేషన్‌, కమిషనింగ్‌ తదితర పనులను ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 2024 మార్చి16 నుంచి ఏప్రిల్‌ 27 వరకు చూస్తే రూ.3.33 కోట్ల నగదు, రూ.45.82 లక్షల విలువైన మద్యంతో పాటు మొత్తం రూ.6.79 కోట్ల విలువైన సీజర్లు జరిగినట్టు వివరించారు. ఓటర్‌ హెల్ప్‌లైన్‌, ఎన్‌జీఎ్‌సపీ, కాల్‌సెంటర్‌, సీ విజిల్‌ తదితర మార్గాల ద్వారా 1,993 ఫిర్యాదులు రాగా 1974 ఫిర్యాదుల పరిష్కరించినట్టు వివరించారు. జిల్లాలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. జనరల్‌ అబ్జర్వర్‌ మంజూరాజ్‌ పాల్‌ మాట్లాడుతూ, జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో సమర్థవంతమైన అధికారులు పనిచేస్తున్నారని, ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్ల పరిశీలనకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. మరో జనరల్‌ అబ్జర్వర్‌ నరీందర్‌ సింగ్‌ బాలి మాట్లాడుతూ, వేసవి నేపధ్యంలో పోలింగ్‌ స్టేషన్ల వద్ద చేయనున్న ఏర్పాట్లపై పలు సూచనలిచ్చారు. పోలీసు పరిశీలకులు ప్రీతీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ, సమాచార, నిఘా ఆధారిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాధాన్యాన్ని తెలియజేశారు. ఎలాంటి ప్రలోభాలు లేని వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యల్లో భాగంగా సీజర్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను అమలు చేయడం జరుగుతోందని, ప్రతి సమాచారం చాలా విలువైనదని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, డీసీపీలు అదిరాజ్‌ సింగ్‌ రాణా, కె.శ్రీనివాసరావు తదితరులతో పాటు విజయవాడ ఆర్డీవో, తూర్పు నియోజకవర్గ ఆర్‌ఓ బీహెచ్‌.భవానీశంకర్‌, కేఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఆర్వో ఇ.కిరణ్మయి, తిరువూరు ఆర్డీవో కె.మాధవి, నందిగామ ఆర్డీవో ఎ.రవీంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్‌, సీపీ

కృష్ణలంక : సాధారణ ఎన్నికల సందర్భంగా చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా, పర్యవేక్షణ కొనసాగుతుందని, మద్యం, డబ్బు తదితరాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు, పోలీసు కమిషనర్‌ పీహెచ్‌డీ రామక్రిష్ణ హెచ్చరించారు. శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌, సీపీ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శుభం నోఖ్వాల్‌తో కలిసి పోలీసు, ఎక్సైజ్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులతో సహా జిల్లాలోని వివిధ చెక్‌పోస్టుల ద్వారా కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని నిఘా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత పెంచేలా అదనపు బృందాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు కమిషనర్‌ పీహెచ్‌డీ రామక్రిష్ణ మాట్లాడుతూ, మద్యం దుకాణాలు, డిస్టలరీలు, డిపోలు, బాట్లింగ్‌ యూనిట్లు తదితరాలపై నిఘా వుంటుందని, ఎక్సైజ్‌ కంట్రోల్‌ కేంద్రంగా ఇప్పటికే సీసీ టీవీల ఫుటేజీ డేటా విశ్లేషణ జరుగుతోందని, అయితే మరింత సమర్థవంతంగా చర్యలకు పోలీసు కంట్రోల్‌ రూం కేంద్రంగా ఈ కార్యకలాపాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అక్రమాలు, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ రామక్రిష్ణ ప్రసాద్‌, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్‌ శ్రీనాథుడు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:15 AM