Share News

ప్రాణాలు మట్టిలో కలిపేస్తున్నారు..!

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:45 AM

ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా.. ట్రాక్టర్‌ డ్రైవర్ల ప్రాణాలు పోతున్నా.. బందరు మండలంలో మట్టిమాఫియా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయట్లేదు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా పోతేపల్లి గ్రామ పరిధిలో రోడ్‌ కం రైలు మార్గాల కోసం రైతులు విక్రయించిన భూముల నుంచి మట్టిని తవ్వి ఇష్టానుసారంగా విక్రయించేస్తున్నారు. రాత్రిపూట గుట్టుగా జరుగుతున్న ఈ బాగోతం శనివారం ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతితో వెలుగులోకి వచ్చింది.

ప్రాణాలు మట్టిలో కలిపేస్తున్నారు..!

బందరు మండలంలో ఆగని మట్టి అక్రమ రవాణా

అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో అర్ధరాత్రి తవ్వకాలు

మట్టి ట్రాక్టర్‌ గోతిలో పడి డ్రైవర్‌ మృతి

తెల్లవారేసరికి వెలుగులోకి వచ్చిన మట్టిమాఫియా బాగోతం

ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా.. ట్రాక్టర్‌ డ్రైవర్ల ప్రాణాలు పోతున్నా.. బందరు మండలంలో మట్టిమాఫియా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయట్లేదు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా పోతేపల్లి గ్రామ పరిధిలో రోడ్‌ కం రైలు మార్గాల కోసం రైతులు విక్రయించిన భూముల నుంచి మట్టిని తవ్వి ఇష్టానుసారంగా విక్రయించేస్తున్నారు. రాత్రిపూట గుట్టుగా జరుగుతున్న ఈ బాగోతం శనివారం ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతితో వెలుగులోకి వచ్చింది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బందరు మండలంలోని ముడా భూములు, రోడ్‌ కం రైలుకు రైతులు విక్రయించిన భూముల నుంచి అక్రమంగా బుసక, మట్టిని తరలిస్తున్నారని ముడా అధికారులకు ఇటీవల ఫిర్యాదులు వెళ్లాయి. స్పందించిన ముడా అధికారులు.. ఇకపై తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటా మని, ఈ ప్రాంతంలో నిఘా ఉంచుతామని ప్రకటించారు. అయినా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోని మట్టి రవాణా మరింత వేగవంతమైంది.

ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతితో వెలుగులోకి..

సముద్రతీరం వెంబడి ఉన్న గ్రామాల్లో కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు రాత్రి సమయంలో మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారు. అలాగే, నాలుగు రోజులుగా పోతేపల్లి సమీపంలో రోడ్‌ కం రైలు మార్గాల నిర్మాణం కోసం ప్రభుత్వం కొన్న భూముల నుంచి రాత్రిపూట మట్టిని తవ్వి, ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. పోతేపల్లికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడికి ఈ మట్టి తవ్వకాల వ్యవహారాలను స్థానిక వైసీపీ నాయకులు అప్పజెప్పారు. ఎవరి వాటాలు ఎంతో కూడా నిర్ణయించారు. అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా మేము చూసుకుంటామని భరోసా కూడా ఇచ్చారు. దీంతో పోతేపల్లికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడి నేతృత్వంలో మట్టి అక్రమ రవాణా జరుగుతోంది. నాలుగు రోజులుగా రాత్రి సమయంలో తవ్వకాలు ప్రారంభించి తెల్లవారేసరికి ఆపేస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా మట్టి తవ్వకాలు ప్రారంభించారు. శనివారం ఉదయం పోతేపల్లికి చెందిన పుప్పాల గణేశ్‌ (32) అనే యువకుడు నడుపుతున్న మట్టి ట్రాక్టర్‌ రహదారికి ఉన్న గోతిలో పడింది. ట్రాక్టర్‌ తిరగబడిపోతుందనే భయంతో గణేశ్‌ కిందకు దూకేశాడు. దీంతో అతని ముఖంపై తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని ద్విచక్రవాహనంపై మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. గణేశ్‌ మృతితో పోతేపల్లి వద్ద మట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారనే అంశం వెలుగులోకి వచ్చింది.

వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్ర పరామర్శ

గణేశ్‌ కుటుంబ సభ్యులను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, జనసేన మచిలీపట్నం ఇన్‌చార్జి బండి రామకృష్ణ పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పోతేపల్లి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధికార పార్టీ నాయకులు చేపట్టిన మట్టి అక్రమ తవ్వకాల కారణంగానే ట్రాక్టర్‌ డ్రైవర్‌ మరణించాడని ఆయన పేర్కొన్నారు. అధికారులు స్పందించి మట్టి తవ్వకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 28 , 2024 | 12:45 AM