Share News

ఆళ్లగడ్డలో అన్నీ సమస్యలే

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:17 AM

వాగ్దానాల జోరులో వైసీపీతో సాటి ఎవ్వరూ రారు. ప్రజల కష్టాలు తీర్చి అందలం ఎక్కిస్తామని అన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జనం నమ్మారు.

ఆళ్లగడ్డలో అన్నీ సమస్యలే

నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోని ఎమ్మెల్యే

కష్టాలు తీరని చాగలమర్రి

రాజోలి జలాశయానికి గ్రహణం

సంత మార్కెట్లలో కనీస వసతులు కరువు

శిథిలావస్థలో లక్ష్మీ నరసింహ స్వామి

ఈసారి వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్న ప్రజలు

వాగ్దానాల జోరులో వైసీపీతో సాటి ఎవ్వరూ రారు. ప్రజల కష్టాలు తీర్చి అందలం ఎక్కిస్తామని అన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జనం నమ్మారు. ఓట్లు వేసి అధికారం అప్పగించారు. ఆ తర్వాత అంతా మర్చిపోయారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం వైసీపీ చేతిలో పూర్తిగా దగా పడింది. మాటలు తప్ప పనులు చేయని ఎమ్మెల్యే ఎట్లా ఉండేదీ నియోజకవర్గ ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. ఇలాంటి పార్టీని మళ్లీ ఎలా గెలిపిస్తామని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.

నంద్యాల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి)/ చాగలమర్రి/ శిరివెళ్ల :

నియోజకవర్గంలో ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న రాజోలి జలాశయాన్ని నిర్మించి రైతుల వెతలు తీర్చుతామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. పంట కాలువలను మెరుగు పరిచి ఆయకట్టు భూములకు నీరిస్తామన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తామన్నారు. వైఎస్‌ జగన్‌, స్థానిక ఎమ్మెల్యే వరస పెట్టి వాగ్దానాలు ఇచ్చారు. ప్రజలు నిలదీస్తారనే భయం లేకపోవడంతో వాటన్నిటినీ మర్చిపోయారు. నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరుకున్న దేవస్థానం బాగోగుల పట్టించుకోకపోవడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా మండల కేంద్రాల్లోని సంతల్లో అసౌకర్యాల కంపు కొడుతోంది. శిరివెళ్లలోని యర్రగుంట్ల డిగ్రీ కళాశాల పీజీ కళాశాలగా మారుతుందన్న ఆశ కలగానే మిగిలిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆళ్లగడ్డ నియోజకవర్గం సమస్యల చిట్టా చాంతాండంత అవుతుంది. ఇవన్నీ తెలిసి కూడా వీటి గురించి పట్టించుకునే తీరిక లేకుండా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి ఐదేళ్ళు గడిపారు. ఇక మళ్లీ ఎన్నికలు రాగానే ప్రజల ముందుకు వచ్చి తాము చేసిన అభివృద్ధి, అందించిన సంక్షమ పథకాలు చూసి ఓటేయమని మభ్యపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు ఒకసారి కూడా ఓటేస్తే నియోజకవర్గం అభివృద్ధి శాశ్వతంగా వెనక్కి తీసుకువెళతారనే అభిప్రాయాన్ని ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు.

ప్రారంభించి వదిలేశారు..

2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌ చాగలమర్రి మండలం రాజోలి వద్ద జలాశయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును రూ.1357.20 కోట్ల అంచనా వ్యయంతో, 2.95 టీఎంసీల సామర్థ్యంతో దాదాపు 91 వేల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా నిర్మించేందుకు 2019 డిసెంబరు 18న పరిపాలన అనుమతులు ఇచ్చారు. 2019 డిసెంబరు 23న కడప జిల్లా దువ్వూరు మండలం నేలటూరు గ్రామం వద్ద ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేశారు. వాస్తవానికి ఈ జలాశయం నిర్మాణాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో డిసెంబరు 23న రూ.291.02 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. అయితే వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తండ్రి చేపట్టిన నిర్మాణాన్ని కొడుకు నెరవేరుస్తున్నాడని మండల ప్రజలు ఆనంద పడ్డారు. ఇక రిజర్వాయర్‌ నిర్మాణం మొదలైనట్లేనని నమ్మారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ఈ తతంగమంతా అని అర్థం కావడానికి ప్రజలకు ఎక్కువ కాలం పట్టలేదు. ఈ జలాశయం నిర్మాణం భూసేకరణను దాటి ముందుకు సాగలేదు. పైగా రైతుల వద్ద నుంచి సేకరించిన 10 వేల ఎకరాల పాసు పుస్తకాలను కూడా ప్రభుత్వం తీసేసుకుంది. కానీ వారికి భూ పరిహారం కింద ఎకరాకు రూ.12.50 లక్షలు ఇంకా ఇవ్వనే లేదు. దీనికి తోడు ఆ భూముల క్రయవిక్రయాలు జరగకుండా రెడ్‌మార్కులో పెట్టారు. దీంతో రాజోలి జలాశయానికి భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం రాక, తమ భూములను వేరే వాళ్లకు అమ్ముకోలే నానా అవస్థలు పడుతున్నారు. జలాశయం నిర్మాణమైతే భూములకు నీటి సాగునీటి సమస్య తీరుతుందని భావించిన రైతుల ఆశలు అడియాశలయ్యాయి.

శిథిలావస్థకు సర్వలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం..

నంద్యాల-గిద్దలూరు నల్లమల అడవిలో ఉన్న సర్వలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారని చెబుతారు. 2018లో కురిసిన వర్షాల ధాటికి ఆలయ ముందు భాగంలోని పురాతన రాతి కట్టడం, ప్రహరీ, ధ్వజస్తంభం కూలిపోయాయి. ఆలయం కింద నుంచి పై భాగం వరకు దాదాపు 50 అడుగుల మేర నిర్మాణ పనులు చేపట్టాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతాయని దేవదాయ శాఖ వారు అంచనా వేశారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.20 లక్షల దేవదాయశాఖ నిధులతో 2020వ సంవత్సరంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ తర్వాత రూ.1.6 కోట్ల టీటీడీ నిధులతో రక్షణ గోడ నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, అప్పటి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి 2022, జూన్‌ 4న భూమి పూజ చేశారు. అయితే ఆ తర్వాత నిధుల మంజూరు విషయంలో శ్రద్ధ చూపకపోవడంతో ఆలయ పునరుద్ధరణ పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ఈ దేవాలయ పునరుద్ధరణ పనులపట్ల ప్రభుత్వానికి, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.

అధ్వాన స్థితిలో కేసీ పంట కాలువలు

ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని భూములకు కాలువల ద్వారా సాగునీరు అందుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వం పంట కాలువలను మరమ్మతు చేయలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాగలమర్రి మండలంలోని మల్లేవేముల, చాగలమర్రి, నేలంపాడు గ్రామాల పరిధిలో కేసీ పంట కాలువలు అధ్వానస్థితిలో ఉన్నాయి. చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని కేసీ పంట కాలువలను బాగు చేసి రైతుల సమస్యను తీరిస్తే బాగుంటుంది. ఇక దీనికి తోడు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రభుత్వ భవనాల నిర్మాణం కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాగలమర్రిలో ఐదేళ్ల క్రితం ప్రారంభించిన తహసీల్దార్‌ భవన నిర్మాణం నేటికి పిల్లర్లకే పరిమితమైంది. ఈ భవనానికి రూ.95 లక్షలు నిధులు గత టీడీపీ ప్రభుత్వ హయంలో మంజూరయ్యాయి. పనులు ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ భవనం నిర్మాణం పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. పంచాయతీరాజ్‌ అధికారులు రెండు విడతలుగా భవన నిర్మాణ పనులకు ప్రతిపాదనలు పంపించినా ఫలితం లేదు. పాలకుల నిర్లక్ష్య వల్ల ఈ భవన నిర్మాణం పూర్తి కాలేదు.

పీజీ కళాశాల కల తీరేదెన్నడు..?

కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై యర్రగుంట్ల సమీపంలో గంగుల తిమ్మారెడ్డి ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్‌ ముగియగానే పక్కనే ఉన్న డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఆ తర్వాత పీజీ చేసేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అయితే చాలా మంది ఆర్థిక స్థోమత దృష్ట్యా, దూరాభారాల దృష్ట్యా డిగ్రీతోనే తమ చదువును నిలిపివేస్తున్నారు. ఆ ఇబ్బంది తీర్చేలా అధికారులు ఈ కళాశాలలోనే పీజీ కళాశాల కూడా ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. మండల ప్రజలు కూడా పీజీ కళాశాల గురించి కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ కళాశాలలో ఫోర్‌ ఇయర్స్‌ ఆనర్స్‌ డిగ్రీ విధానాన్ని యర్రగుంట్ల డిగ్రీ కళాశాలలో ప్రారంభిస్తే నాలుగేళ్లలోనే డిగ్రీ, పీజీ పూర్తి చేసుకుని పట్టభద్రులవుతారని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ పీజీ కళాశాల కలగానే మిగిలిపోయింది. జూనియర్‌, డిగ్రీ కళాశాలలకు రక్షణ గోడ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మార్కెట్లలో సమస్యల మోత..

శిరివెళ్ల మండలంలోని యర్రగుంట్ల, శిరివెళ్ల, మహదేవపురం గ్రామాల్లోని సంతమార్కెట్లు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో యర్రగుంట్లలో ప్రతి బుధవారం గ్రామంలోని ప్రధాన రహదారిలో, శిరివెళ్లలో ప్రతి ఆదివారం వక్ఫ్‌బోర్డు స్థలంలో సంత నిర్వహిస్తున్నారు. ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో వర్షాకాలంలో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యర్రగుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దినసరి మార్కెట్‌, వారపు సంత, కబేళా ద్వారా 2019-20 నుంచి 2024-25 వరకు ఆరు సంవత్సరాలకు గాను రూ.65.56 లక్షల ఆదాయం వచ్చింది. శిరివెళ్లలోని సంతమార్కెట్‌లు, కబేళా ద్వారా 2019-20 నుంచి 2024-25 వరకు ఆరు సంవత్సరాలకు గాను రూ.74.65 లక్షల ఆదాయం సమకూరింది. అలాగే మహదేవపురం పంచాయతీలో వారపు సంతకు ఆరేళ్లకు గాను రూ.31.84 లక్షల ఆదాయం వచ్చింది. ఇక నియోజకవర్గంలోని రుద్రవరం మండలంలోని వారసంత మార్కెట్‌ సమస్యల చెంత కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ ప్రతి సోమవారం వారపు సంత నిర్వహిస్తారు. ఈ సంతకు మార్కెట్‌కు కొండమాయపల్లె, నాగిరెడ్డిపల్లె, మాకినేనిపల్లె వంటి 16 గ్రామాల ప్రజలు సరుకులు కొనేందుకు వస్తారు. వారపు సంత మార్కెట్‌ వేలం ద్వారా రూ.9.03 లక్షలు, రోజూవారి మార్కెట్‌ వేలం ద్వారా రూ.3.70 లక్షలు, కబేలా మార్కెట్‌ వేలం ద్వారా రూ.8,200 ఆదాయం వస్తోంది. ఈ స్థాయిలో ఆదాయం వస్తున్నా ఈ సంతలో కనీస వసతులు, మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా మార్కెట్‌ వేలాల ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నా ఇక్కడ సౌకర్యాల గురించి, వసతుల గురించి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 28 , 2024 | 12:17 AM