Share News

మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు కృషి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:14 AM

టీడీపీ అధికారంలోకి వస్తే శ్రీశైలం మండలంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

 మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు కృషి
శ్రీశైలం: బుడ్డా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

శ్రీశైలం, ఏప్రిల్‌ 27: టీడీపీ అధికారంలోకి వస్తే శ్రీశైలం మండలంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. బుడ్డా శ్రీశైలం నుంచి శనివారం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శ్రీశైలంతో పాటు సుండిపెంట, లింగాలగట్టులో ప్రచారం చేశారు. ఈ ప్రాంతాల నుంచి 250 కుటుంబాలు వైసీపీని వీడి బుడ్డా సమక్షంలో టీడీపీలో చేరాయి. బుడ్డా మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే శిల్పా తన అనుచరులతో కలిసి మల్లన్న సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఇళ్లు కట్టించి ఇస్తానని నమ్మబలికి శ్రీశైలం ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఎన్ని పూర్తి చేశారని ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన శిల్పా నియోజకవర్గ ప్రజలను బెదిరిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగటానికి వస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ అధికారంలోనికి రాగానే శ్రీశైలంలో ఉన్న దుకాణాలకు కాలపరిమితి 11 ఏళ్లకు పెంచుతూ అధిక బాడుగలను క్రమబద్ధీకరిస్తానని, దుకాణాలకు ముందుగానే కట్టే సంవత్సరం బాడుగ విధానానికి స్వస్తి చెప్పి నెలసరి బాడుగ కట్టే విధానం తీసుకొస్తానని బుడ్డా హామీ ఇచ్చారు. శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే శ్రీశైలంలో నివాసముంటున్న వారికి ఇక్కడే ఉండేందుకు స్థలం చూపిస్తానని, ఆస్తిగా ఇంటి పట్టాలు మాత్రం సుండిపెంటలో కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ఎన్నికలల్లో బుడ్డాను గెలిపిస్తే స్థానికులను సుండిపెంటకు తరలిస్తారని దుష్ప్రచారం చేసి ఓట్లు దండుకున్నారని ఆయన అన్నారు.

‘వైసీపీకి తొత్తులుగా దేవస్థానం అధికారులు’

శ్రీశైలం క్షేత్ర పరిధిలోనికి వైసీపీ గుర్తులతో కూడిన ప్రచారరథం తీసుకొచ్చి, వైసీపీ నాయకులు దేవస్థానం నిబంధనలను ఉల్లంఘించినా చర్యలు తీసుకోలేదని, దేవస్థానం అధికారులు వైసీపీకి తొత్తులుగా మారారని బుడ్డా రాజశేఖరరెడ్డి ఆరోపించారు. ఇటీవల శిల్పా చక్రపాణిరెడ్డి శ్రీశైలంలో చేపట్టిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో దేవస్థానం ఉద్యోగులు పాల్గొంటే ఎందుకు ఈవో చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తాము మైక్‌ ప్రచారం అడిగితే ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పిన ఈవో వైసీపీకి ఏ విధంగా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని ఎందుకు సీజ్‌ చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శ్రీశైలం దర్శనానికి వస్తే ఈవో ప్రోటోకాల్‌ పాటించలేదని మండిడ్డారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోకపోతే ఈవోపై ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

ఆత్మకూరు: మెరుగైన పాలన అందించే సమర్థవంతమైన నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సతీమణి బుడ్డా శైలజ పిలుపునిచ్చారు. పట్టణంలోని 7వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శైలజ మాట్లాడుతూ 40 ఏళ్లకు పైగా బుడ్డా కుటుంబం ఇక్కడి ప్రజలతో మమేకమై సేవలందిస్తున్నట్లు చెప్పారు. తన భర్త ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్రీశైల నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ప్రత్యేకించి సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఆత్మకూరు మండలానికి సాగునీరు అందించారన్నారు. ఆత్మకూరులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.116.93కోట్లతో నాన్‌అమృత్‌ స్కీంను మంజూరు చేయించారని చెప్పారు. గ్రామాల్లో సీసీ రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా పథకాలను నిర్మించినట్లు తెలిపారు. పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా చేయూతనిచ్చినట్లు వివరించారు. గృహనిర్మాణ పథకం ద్వారా సుమారు 2500 మందికి పక్కాగృహాలను మంజూరు చేయించిన ఘనత టీడీపీదేన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగూర్‌ఖాన్‌, అబ్దుల్లాపురం బాషా, ఇబ్రహీం ఖలీలుల్లా, యూసుఫ్‌, పస్పీల్‌ మున్నా, మహెబూబ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:14 AM