Share News

వైసీపీ అరాచక పాలనను అంతం చేద్దాం

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:23 AM

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొంది ద్దామని డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

వైసీపీ అరాచక పాలనను అంతం చేద్దాం

డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

డోన్‌, ఏప్రిల్‌ 27: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొంది ద్దామని డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వర రావు యాదవ్‌, వలసల రామక్రిష్ణ, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ టీఈ కేశన్నగౌడు, బీజేపీ నాయకులు వడ్డె మహారాజ్‌, జనసేన నాయకులు ఆలా మోహన్‌ రెడ్డిలతో కలిసి ఎన్డీయే చార్జిషీట్‌ బుక్‌లెట్‌ను కోట్ల విడుదల చేశారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ ధరలు, పన్నులు, చార్జిలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.10లక్షల భారం మోపిన ఘనత సీఎం జగన్‌కే దక్కింద న్నారు. ల్యాండ్‌, ఇసుక, మైనింగ్‌, గంజాయి, డ్రగ్స్‌తోపాటు రేషన్‌ బియ్యంలో రూ.8 లక్షల కోట్లు వైసీపీ కొట్టేసిందని ఆరోపించారు. కల్తీ మద్యాన్ని విక్రయించి రాష్ట్రంలో 35 లక్షల మంది ఆరోగ్యాలను పాడు చేసి 30వేల మంది మహిళల తాళిబొట్లను వైసీపీ పాలకులు తెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని జగన్‌ మాట ఇచ్చి నేరుగా ప్రభుత్వమే రూ.లక్ష కోట్ల మద్యం అమ్మి దోచుకోవడం దారుణమన్నారు. వైసీపీ మేనిఫెస్టో హామీ లు 99 శాతం అమలు చేశామని జగన్‌ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇసుక ధరలు నాలుగు రెట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి రూ.75వేల కోట్లు ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్‌ కేశవయ్య గౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, చిట్యాల మద్దయ్యగౌడు, హరి చక్రపాణి, ఎస్‌ఎండీ రఫి, జనసేన నాయకులు బ్రహ్మం పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:23 AM