Share News

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:29 AM

నంద్యాల జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమా దాల్లో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ఇద్దరికి స్వల్ప గాయాలు

డోన్‌(రూరల్‌), ఏప్రిల్‌ 27: నంద్యాల జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమా దాల్లో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. డోన్‌ మండలం వెంకటాపురం గ్రామ సమీ పంలోని చెరువు రోడ్డులో శనివారం తెల్లవారుజామున ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. రూరల్‌ సీఐ అస్రత్‌ బాషా తెలిపిన వివరాల మేరకు పత్తి కొండ మండలం జీవరాల తాండ గ్రామానికి చెందిన శంకర్‌ నాయక్‌ (40) మోటారు బైక్‌పై డోన్‌ నుంచి వెంకటాపురం గ్రామ ప్రధాన రోడ్డు మీదుగా స్వగ్రామానికి వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు రూరల్‌ సీఐ అస్రత్‌ బాషా తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డోన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బస్సు ఢీకొని మహిళ..

నంద్యాల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ పట్టణ శివార్లలోని శోభా ఘాట్‌ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పెసల శ్రీవాణి(38) మృతి చెందారు. ఆళ్లగడ్డ పట్టణంలో జరిగే ఓ శుభకార్యానికి కడప జిల్లా పెండ్లి మర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన చిన్నకృష్ణారెడ్డి, భార్య శ్రీవాణి, కుమారుడు ప్రవీణ్‌ ఉత్తేజ్‌రెడ్డితో మోటార్‌సైకిల్‌పై శుక్రవారం వచ్చారు. శుభకార్యం చూసుకొని శనివారం ఉదయం మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా హైదరాబాద్‌ నుంచి కడపకు వెళ్తున్న ప్రైవేటు బస్సు శోభా ఘాటు వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, తండ్రి, కొడుకులకు స్వల్ప గాయాలయ్యాయి. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు డివైడర్‌ను ఢీకొని యువకుడి..

చాగలమర్రి: మండలంలోని నగల్లపాడు హైవే వద్ద భవనాశి బ్రిడ్జి వంతెనలో ఆళ్లగడ్డ వైపు నుంచి చాగలమర్రి వైపు వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పి బ్రిడ్జిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన యువకుడు చక్రపాణి (20) కారులో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందారు. ఆళ్లగడ్డ రూరల్‌ సీఐ హనుమంతనాయక్‌, ఎస్‌ఐ రమణయ్య, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. టోల్‌ప్లాజా సిబ్బంది బ్రిడ్జిలోపల పడ్డ కారును క్రేన్‌ సాయంతో బయటకు తీశారు. కారులో ఇరుక్కపోయిన చక్రపాణిని బయటకు తీశారు. ట్రాఫిక్‌ అంత రాయం కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కారులో బ్రిడ్జి లోపల పడటంతో నుజ్జు అయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చక్రపాణి ప్రొద్దుటూరులోని ఎస్‌ ఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సెలవు దినాల్లో డ్రైవర్‌గా కూలీకి వెళ్తూ తన చదువును కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగా డ్రైవర్‌గా వెళ్లి ప్రమాదంలో చనిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 28 , 2024 | 12:29 AM