Share News

వేదవతి ప్రాజెక్టును పూర్తి చేస్తాం

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:54 PM

వేదవతి ప్రాజెక్టును పూర్తి చేస్తాం

వేదవతి ప్రాజెక్టును పూర్తి చేస్తాం

ప్రతి పల్లెకు సాగు, తాగు నీరందిస్తాం

నగరడోన జలాశయం పూర్తి చేస్తాం

డిగ్రీ కళాశాలకు పక్కా భవనాల నిర్మాణం

టీడీపీ ద్వారానే సామాజిక న్యాయం

ఆలూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు

కర్నూలు, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి)/ఆలూరు/ఆదోని:

రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆలూరు.. ఈ ప్రాంతంలో కరువును నివారించాలని 8 టీఎంసీల సామర్థ్యంతో వేదవతి ప్రాజెక్టు చేపడితే.. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఈ దుర్మార్గుడు 3 టీఎంసీలు తగ్గించాడు.. నిధులు ఇవ్వలేక ప్రాజెక్టును కూడా ఆపేసి కరువు రైతులకు తీరని ద్రోహం చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం ఆలూరు అంబేడ్కర్‌ సర్కిల్‌లో జరిగిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బి.వీరభద్రగౌడు, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజుతో కలిసి చంద్రబాబు రోడ్‌షోలో మాట్లాడారు. ప్రజాగళం యాత్ర సభకు జనం పోటెత్తారు. ఎల్లార్తి రోడ్డు, ఆదోని రోడ్డు, బళ్లారి రోడ్డు ఎటు చూసినా జనం.. జనం ప్రభంజనమే. ఉప్పొంగిన ఉత్సాహంతో సైకో పోవాలి.. సైకిల్‌ రావాలనే పాటకు తెలుగు యువత కార్యకర్తలు చిందులు వేశారు. బాబు ప్రశ్నలకు జగన్‌ గుండెల్లో దడ పుట్టేలా ప్రజలు సమాధానం ఇచ్చారు. ఈ దుర్మార్గుడు మాకొద్దు.. రాక్షస పాలన అంతం చేద్దాం.. సైకిల్‌ను గెలిపిస్తామంటూ ప్రజలు బాబుకు సూచించారు. కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి చంద్రబాబు రెట్టింపు ఉత్సాహంతో ప్రసంగాన్ని కొనసాగించారు. రాబోయే ఎన్డీయే సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో ఆలూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామంటూ వరాల జల్లులు కురిపించారు. 8 టీఎంసీలతో వేదవతి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. నదిలో నీరు లేకపోతే హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు నింపి కరువు నేలకు మళ్లిస్తా. టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తాం. ఆదోనిలో మిరప ప్రత్యేక మార్కెట్‌ ఏర్పాటు, డిగ్రీ కళాశాలకు ప్రత్యేక భవనాలు నిర్మాణం. జాతీయ రహదారితోపాటు ఆలూరు, హొళగుంద రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బుడగజంగాలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

శ్రమించే వారిని ఆదుకుంటా

ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన టీడీపీ కార్యకర్తలు, నాయకులను ఆదుకునే బాధ్యత నాది అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆలూరు నియోజకవర్గంలో వైకుంఠం కుటుంబం టీడీపీకి అండగా ఉంది. దివంగత వైకుంఠం శ్రీరాములు టీడీపీ బాగు కోసం పని చేశారు. కొందరు స్వార్థపరులు పార్టీని వీడినా.. వైకుంఠం జ్యోతి, వైకుంఠం ప్రసాద్‌లు టీడీపీ కోసం అండగా నిలిచారు. కప్పట్రాళ్ల బొజ్జమ్మ కుటుంబం టీడీపీకి దన్నుగా నిలుస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన కోట్ల సుజాతమ్మ అనివార్య కారణాల వల్ల ఆమె త్యాగం చేయాల్సి వచ్చింది. కోట్ల, వైకుంఠం, కప్పట్రాళ్ల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుంది. మీ రాజకీయ భవిష్యత్తు నాది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు వీరభద్రగౌడు, బస్తిపాటి నాగరాజులను గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. గతంలో ఎన్నోసార్లు ఆలూరు వచ్చాను. ఇంతటి ఆదరణ ఇప్పుడే చూస్తున్నా. ఆలూరు నుంచి ఒక సామాన్య కార్యకర్త లింగాయతి సా మాజికవర్గానికి చెందిన వీరభద్ర గౌడుకు టికెట్‌ ఇచ్చాను. కురువ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజును కర్నూలు నుంచి ఢిల్లీకి పంపించేందుకు ఎంపీ టికెట్‌ ఇచ్చాను. ఆయన సామాన్య కుటుంబా నికి చెందిన ఎంపీటీసీ. వీరిద్దరిని గెలిపించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని పిలుపు నిచ్చారు.

టీడీపీతోనే సామాజిక న్యాయం

టీడీపీతోనే సామాజిక న్యాయం సాధ్యమని చంద్ర బాబు అన్నారు. కర్నూలు పార్లమెం టులో వాల్మీకి వర్గానికి చెందిన రాఘ వేంద్రరెడ్డికి మంత్రాలయంలో, పార్థసారథికి ఆదోనిలో టికెట్‌ ఇచ్చాం. పత్తికొండలో ఈడిగ సామాజిక వర్గానికి చెందిన కేఈ శ్యాంబాబు, ఆలూరులో లింగాయతికి సామాజిక వర్గానికి చెందిన వీరభద్రగౌడు, కోడుమూరులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన బొగ్గుల దస్తగిరి, కర్నూలులో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన టీజీ భరత్‌కు టికెట్లు ఇచ్చాం. కర్నూలు ఎంపీగా కురువ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజును బరిలో దింపాం. ఎమ్మగనూరులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జయనాగేశ్వరరెడ్డికి టికెట్‌ ఇచ్చాం. ఇది కదా సామాజిక న్యాయం అంటే. జగన్‌ చెప్పగలడా అంటూ ప్రశ్నించారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, ఆలూరు అభ్యర్థి వీరభద్రగౌడు, కర్నూలు ఎంపీ సంజీవకుమార్‌, ఆదోని ఇన్‌చార్జి కె.మీనాక్షి నాయుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడుతోపాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సీమకు జగన్‌ ద్రోహం

రాయలసీమలో గత ఎన్నికల్లో 49 సీట్లు ద్వారా వైసీపీని గెలిపిస్తే.. ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ సీమకు తీరని ద్రోహం చేశారని చంద్రబాబు అన్నారు. ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.. ఆయన ఇచ్చిన వలంటీర్ల ఉద్యోగాల వల్ల యువత బాగు పడ్డారా అంటూ ప్రశ్నించారు. పేదల ఆదాయం పెరిగిందా.. గిట్టుబాటు ధర వచ్చిందా అంటూ నిలదీశారు. ఒక్క టీచర్‌ పోస్టయినా ఇచ్చాడా అంటూ ప్రశ్నించారు. విద్యపైన పెట్టిన ఖర్చు ఎంత.. మీరు దోచింది ఎంతో లెక్కలు చెప్పాలి అంటూ జగన్‌ను నిలదీశారు. కర్నూలు జిల్లాలో రూ.650 కోట్లతో మెగా సీడ్‌ పార్కును తీసుకువచ్చాను. రూ.350 కోట్లతో జైన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును తెచ్చా. రూ.90 కోట్లతో విమానాశ్రయాన్ని నిర్మించాను. ఎమ్మిగనూరులో వంద ఎకరాల్లో టెక్స్‌టైల్‌ పార్కుకు శ్రీకారం చుట్టాను. ముచ్చుమర్రి లిఫ్టు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్‌, వేదవతి ప్రాజెక్టులు తీసుకువచ్చాను. గాలేరు నగరి పూర్తి చేసి గండికోటకు నీరు మళ్లించి పులివెందులకు నీరు ఇచ్చాను. ఇది తెలుగుదేశం సాధించిన విజయాలు. జగన్‌ చేసిందేమిటో ఒక్కటైనా చెప్పగలడా అంటూ నిలదీశారు. చివరకు రోజంతా శ్రమ పడి సాయంత్రం ఓ క్వాటర్‌ మద్యం తాగుదామనే మద్యం ప్రియులను సైతం ముంచేశాడు. నాడు రూ.60 ఉన్న క్వాటర్‌ మద్యం.. ఇప్పుడు రూ.260కు చేరింది. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే.. రూ.500 అవుతుంది.. మద్యం డబ్బు అంతా ఎక్కడకు వెళ్తుందంటూ నిలదీశాడు. ప్రత్యేక హోదా తెస్తానంటూ మాట తప్పాడు. మద్యనిషేధం అని నిలువునా ముంచేశాడు.. సీపీఎస్‌ రద్దు అంటూ ఉద్యోగులను మోసం చేశాడు. ఇలాంటి మాట తప్పిన దుర్మార్గుడికి ఓటు వేస్తారా అని ప్రశ్నిస్తే.. వేయం.. వేయం అని గట్టిగా ప్రజలు కేకలు వేశారు.

Updated Date - Apr 19 , 2024 | 11:54 PM