Share News

మాజీ మంత్రి శిద్దా ఇంట్లో దోపిడీకి యత్నం

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:17 AM

మాజీ మంత్రి, వైసీపీ నేత శిద్దా రాఘవరావు ఇంట్లో దోపిడీకి ఇద్దరు ఆగంతుకులు విఫలయత్నం చేశారు. ఒంగోలు లాయర్‌పేట ఎక్స్‌టెన్షన్‌లోని ఆయన ఇంట్లోకి గోడదూకి ప్రవేశించిన వారు కత్తులతో వాచ్‌మన్‌ గొంతు కోసేందుకు ప్రయత్నించారు.

మాజీ మంత్రి శిద్దా ఇంట్లో దోపిడీకి యత్నం
వాచ్‌మన్‌పై దాడి చేస్తున్న ఆగంతుకులు

వాచ్‌మన్‌ గొంతుకోసే ప్రయత్నం

భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో పరారైన ఆగంతుకులు

సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు

ఒంగోలు (క్రైం), ఏప్రిల్‌ 27 : మాజీ మంత్రి, వైసీపీ నేత శిద్దా రాఘవరావు ఇంట్లో దోపిడీకి ఇద్దరు ఆగంతుకులు విఫలయత్నం చేశారు. ఒంగోలు లాయర్‌పేట ఎక్స్‌టెన్షన్‌లోని ఆయన ఇంట్లోకి గోడదూకి ప్రవేశించిన వారు కత్తులతో వాచ్‌మన్‌ గొంతు కోసేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించిన ఆయన కిందపడటంతో అలికిడికి పక్కనే నిద్రిస్తున్న భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో ఆగంతుకులు పరారయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అయితే విషయాన్ని శనివారం మధ్యాహ్నం వరకూ రహస్యంగా ఉంచారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన వారు దర్యాప్తు ప్రారంభించారు.

గోడదూకి ఇంట్లోకి ప్రవేశం

ముఖాలకు మాస్కులు ధరించి ఉన్న ఇద్దరు ఆగంతుకులు శిద్దా ఇంటికి ఉత్తరం వైపు ఉన్న గోడ దూకి లోపలకు ప్రవేశించారు. అనంతరం నేరుగా శిద్దా దంపతులు ఉండే మొదటి అంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. తలుపులు మూసిఉండటంతో తిరిగి కింద భాగాన ఉన్న కార్యాలయం లోపలికి వచ్చారు. అక్కడ వాచ్‌మన్‌ దుర్గారావు కుర్చీలో కూర్చొని కన్పించాడు. దీంతో ఆగంతుకులు దుర్గారావు పైదాడి చేశారు. కత్తులతో గొంతు కోసే ప్రయత్నం చేయగా ప్రతిఘటించాడు. ఆ సమయంలో ఆయన కిందపడిపోయాడు. అలికిడి విన్న శిద్దా గన్‌మన్‌ అప్రమత్తమయ్యారు. ఆయన కేకలు వేయడంతో ఇరువురు ఆగంతుకులు తిరిగి గోడ దూకి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ ఫుటేజీలో కనిపించాయి. ఇదంతా జరుగుతున్న సమయంలో శిద్దా దంపతులు ఇంట్లోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న వారు భయాందోళనకు గురయ్యారు. కొన్నేళ్ల క్రితం కూడా చీమకుర్తిలోని శిద్దా ఇంట్లో చోరీ జరిగింది. మరలా ఒంగోలులోని ఆయన నివాసంలోకి ఇద్దరు ఆగంతుకులు కత్తులతో ప్రవేశించడం చర్చనీయాంశమైంది. వారు దొంగతనం కోసం వచ్చారా? ఏదైనా ఆఘాయిత్యానికి పాల్పడటానికి వచ్చారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రంగంలోకి పోలీసులు

మాజీ మంత్రి శిద్దా ఇంట్లో దోపిడీయత్నం గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అదనపు ఎస్పీ (క్రైమ్స్‌) ఎస్‌.వి.శ్రీధర్‌రావు, ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ లక్ష్మణ్‌ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీని చూశారు. అనంతరం విచారణ ప్రారంభించారు. ఆగంతుకులు ఎటువైపు నుంచి వచ్చారు? ఎటువైపు నుంచి వెళ్లారు? వాహనం వినియోగించారా? అన్నదానిపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ (క్రైమ్స్‌) శ్రీధర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ సీసీ ఫుటేజీతోపాటు, వేలిముద్రల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆగంతుకులు ముఖాలకు మాస్క్‌లు వేసుకొని, కత్తులు చేతబట్టి ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:17 AM