Share News

ధర ధగధగ

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:15 AM

దక్షిణాది పొగాకు మార్కెట్‌ రోజురోజుకూ మరింత హాట్‌హాట్‌గా సాగుతోంది. ఒకవైపు మేలు రకం, మరో వైపు లోగ్రేడ్‌లో నాణ్యమైనదిగా భావించే బ్రౌన్‌ రకం ధరలు పైపైకి చేరుతున్నాయి.

 ధర ధగధగ

పొగాకు మార్కెట్లో రికార్డు స్థాయి రేట్లు

మేలు రకం కిలో రూ.294, బ్రౌన్‌ రకం రూ.270కు కొనుగోలు

బోర్డు చరిత్రలోనే దక్షిణాదిన ఇదే అధికం

ఇప్పటి వరకూ 32 మిలియన్‌ కేజీల విక్రయం

కిలోకు రూ.231 లభించిన సగటు ధర

ఒంగోలు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్‌ రోజురోజుకూ మరింత హాట్‌హాట్‌గా సాగుతోంది. ఒకవైపు మేలు రకం, మరో వైపు లోగ్రేడ్‌లో నాణ్యమైనదిగా భావించే బ్రౌన్‌ రకం ధరలు పైపైకి చేరుతున్నాయి. శనివారం మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు లభించాయి. మేలు రకం గరిష్ఠ ధర కిలో రూ.294పలికింది. బ్రౌన్‌ రకం రూ.270 లభించింది. పొగాకు బోర్డు చరిత్రలో దక్షిణాది వేలం కేంద్రాలలో ఈ స్థాయి ధరలు లభించడం ఇదే ప్రథమం. రెండు నెలల క్రితం ప్రస్తుత సీజన్‌ పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కిలో రూ.230 గరిష్ఠ ధర లభించింది. అలా దాదాపు నెలరోజులపైనే నిలకడగా సాగింది. అనంతరం కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో లోగ్రేడ్‌ బేళ్లపై వ్యాపారులు దృష్టిపెట్టడంతో వాటి ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి. అలా నెల క్రితం వరకూ మేలు రకం ఽగరిష్ఠ ధర కిలో రూ.230 నుంచి 235 వరకూ ఉండగా.. లోగ్రేడ్‌లో కాస్త నాణ్యత కలిగిన వాటి ధరలు కిలో రూ.225 నుంచి 230 వరకూ పలికాయి. ఆ సమయంలో గ్రేడ్‌ ఏదైనా ఒకే ధర అన్నట్లుగా మార్కెట్‌ సాగడంతో ఎక్కువ మంది రైతులు మేలు రకం బేళ్లను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచి లోగ్రేడ్‌ను వేలం కేంద్రాలకు తెచ్చారు. ఇప్పుడు కూడా ఎక్కువ కేంద్రాల్లో అలాగే వస్తున్నాయి.

మేలు రకం కోసం వ్యాపారుల పోటీ

పక్షం రోజులుగా మేలు రకం బేళ్ల కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో క్రమంగా వాటి ధరలు పెరుగుతున్నాయి. 15 రోజుల క్రితం మేలు రకం పొగాకు గరిష్ఠ ధర కిలో రూ.250కు అటుఇటు ఉండగా సోమవారం నాటికి అది రూ.270కి చేరింది. ఐదారు రోజులుగా రోజూ కొంత పెరుగుతుండగా శనివారం ఒంగోలు-1, వెల్లంపల్లి కేంద్రాల్లో ఏకంగా గరిష్ఠ ధర కిలో రూ.294 పలికింది. మిగిలిన వాటిలో ఎక్కువ చోట్ల కిలో రూ.290పైన లభించింది. అదేసమయంలో లోగ్రేడ్‌లో నాణ్యతమైనదిగా భావించే బ్రౌన్‌రకం ధరలు కూడా ఇలాగే పెరుగుతున్నాయి. పక్షం క్రితం ఆ రకం ధర కిలో రూ.230 ఉండగా క్రమంగా పెరుగుతూ శనివారం రూ.270కి చేరింది. ప్రస్తుతం వేలం కేంద్రాల్లో బేళ్ల కోసం బయ్యర్లు పోటీపడుతున్న తీరును చూస్తే గరిష్ఠ ధర కిలో రూ.300 దాటే అవకాశం ఉంది. దక్షిణాదిలో ఇప్పటి వరకు 32 మిలియన్‌ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. సగటున కిలోకు రూ.231లభించింది. ఇప్పటి వరకు అమ్మకం జరిగిన పొగాకులో మూడొంతులు లోగ్రేడ్‌ కాగా రానున్న రోజుల్లో సగటు ధర కిలోకు రూ.250 దాటుతుందని సమాచారం.

Updated Date - Apr 28 , 2024 | 01:15 AM