Share News

మార్కాపురం జిల్లా ఏదీ?

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:21 AM

జిల్లాలోని పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్షల్లో ముఖ్యమైనది ప్రత్యేక మార్కాపురం జిల్లా. గత 55ఏళ్లుగా ఉన్న డిమాండ్‌ ఇది. పలు సందర్భాల్లో ఆప్రాంత ప్రజలు గొంతెత్తి చాటారు.

మార్కాపురం జిల్లా ఏదీ?
మార్కాపురం పట్టణం వ్యూ (ఇన్‌సెట్‌లో) మార్కాపురం జిల్లా కోరుతూ తర్లుపాడులో రాస్తారోకో చేస్తున్న టీడీపీ నాయకులు (ఫైల్‌)

పశ్చిమ ప్రాంత ప్రజల సూటి ప్రశ్న

సమాధానం లేక వైసీపీ అభ్యర్థులు విలవిల

జిల్లాల పునర్విభజనలో పట్టించుకోని పాలకులు

సీఎంను గట్టిగా అడగలేని స్థితిలో నేతలు

అప్పుడు మిన్నకుండటంతో ఇప్పుడు ఇరకాటం

జిల్లా ఏర్పాటుతో అన్ని విధాలా అభివృద్ధి చెందే అవకాశం

అదే హామీతో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థులు

జిల్లాలోని పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్షల్లో ముఖ్యమైనది ప్రత్యేక మార్కాపురం జిల్లా. గత 55ఏళ్లుగా ఉన్న డిమాండ్‌ ఇది. పలు సందర్భాల్లో ఆప్రాంత ప్రజలు గొంతెత్తి చాటారు. వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26గా విభజించిన సమయంలో తమ డిమాండ్‌ను మరింతగా వినిపించారు. రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. భారీ ఉద్యమమే చేశారు. అయినా వారి ఆకాంక్షను వైసీపీ ప్రభుత్వం కానీ, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదు. దీంతో సమయం వచ్చినప్పుడు చూద్దామనుకున్నారు కాబోలు ఎన్నికల ప్రచారం ప్రారంభమైన ప్రస్తుత తరుణంలో జనం ప్రత్యేక జిల్లా ఏది అంటూ ప్రశ్నించడం ప్రారంభించారు. ప్రభుత్వానికి నచ్చజెప్పో, ఒత్తిడితో కదిలించో జిల్లాను సాధించాల్సిన మీరు అప్పుడేమి చేశారంటూ నిలదీస్తున్నారు. ఇది పశ్చిమప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన వైసీపీ అభ్యర్థులు, నాయకులకు ఇబ్బందికరంగా మారింది. అదేసమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీతో టీడీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా 1970లో ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు. 1972లో సమరయో ధులు ప్రకాశం పంతులు పేరుమీద ప్రకాశం జిల్లాగా మార్చారు. ప్రస్తుత జిల్లాకేంద్రం ఒంగోలు, తాజాగా బాపట్ల జిల్లాలోకి వెళ్లిన చీరాల, పర్చూరు. అద్దంకి ప్రాంతాలను అప్పట్లో గుంటూరు జిల్లా నుంచి విడదీశారు. కొండపి, కందుకూరు, కనిగిరి దర్శిలోని కొంత ప్రాంతాన్ని అప్పటి నెల్లూరు జిల్లా నుంచి బయటకు తీశారు. గిద్దలూరు, మార్కా పురం, వైపాలెం నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను కర్నూ లు జిల్లా నుంచి విడగొట్టారు. జిల్లా ఏర్పాటు సమయంలోనే విజ్ఞులైన అప్పటి కొందరు నాయకులు అంతో ఇంతో జిల్లాకు నడిబొడ్డున ఉన్న పొదిలిని జిల్లాకేంద్రంగా చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చక్రంతిప్పుతున్న ఒక నాయకుడి పలుకుబడితో ఒంగోలును జిల్లాకేంద్రంగా చేశారు. ఆతర్వాత పొదిలిని కనీసం డివిజన్‌ కేంద్రగానైనా చేయాలని డిమాండ్‌ వచ్చినా పట్టించుకోలేదు. ఒకప్పుడు మార్కాపురం కేంద్రంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గం కూడా పునర్విభజనలో రద్దయింది. అయితే రాయలసీమ నుంచి ప్రకాశం జిల్లాలో చేరిన తర్వాత ఆ ప్రాంత ప్రజల మనోభావాల్లో మార్పు వచ్చింది. ఆయా దశల్లో పాలనా వికేంద్రీకరణ జరిగిన సందర్భాల్లో జిల్లాకేంద్రం సుదూరంగా ఉండటం సమస్యగా మారి పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్‌ ఉద్భవించింది.

సుదూరంలో జిల్లాకేంద్రం

ఇప్పటికీ పశ్చిమప్రాంతంలోని మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే అధికారులకు, ప్రజాప్రతి నిధులకు రోజంతా సరిపోతుంది. ఒంగోలుకు గిద్దలూరు 140 కి.మీ, పుల్లలచెరువు మండలం 120 కి.మీ దూరంలో ఉన్నాయి. ఇక అటవీ ప్రాంత గ్రామాలకు అధికారులు కానీ, ఆయా సందర్భాల్లో పాలక ప్రజాప్రతినిధులు వెళ్లి రావాలంటే రెండు రోజులు పడుతుంది. దీంతో క్రమేపీ పశ్చిమ ప్రాంతవాసులు తమ ప్రాంతా న్ని ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతున్నారు.

కొత్త రాష్ట్రం.. కొత్త జిల్లాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై అందరూ దృష్టి కేంద్రీకరించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం జిల్లాల విభజన జోలికి వెళ్లలేదు. దీంతో మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై ప్రజల ఆకాంక్ష పాలకులకు తెలియజేయడమే తప్ప ఉద్యమాలు జరగలేదు. కానీ స్థానికంగా అన్ని పార్టీల నాయకులు పశ్చిమప్రాంతంలో నడిబొడ్డున ఉన్న మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడం పరిపాటైంది.

జగన్‌ మాటతో పెరిగిన విశ్వాసం

గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ కొత్త జిల్లాల ఏర్పాటుకు హామీ కూడా ఇచ్చారు. దీంతో ఆప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించాయి. పైగా ఒక్క చాన్స్‌ అని చెప్పిన ఆయన్ను నమ్మి ఆ ప్రాంత వాసులు గత ఎన్నికల్లో వైసీపీకి భారీ ఆధిక్యం ఇచ్చారు. టీడీపీ జిల్లాలోని తూర్పుప్రాంతంలోని నాలుగు స్థానాల్లో గెలుపొందగా, పశ్చిమప్రాంతాల్లో అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రతిచోటా భారీ ఆధిక్యం లభించింది. ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ వారే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా ఆప్రాంత ప్రజలు తమ డిమాండ్‌ను బయటపెట్టారు. మార్కాపురంతోపాటు గిద్దలూరు, వైపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ సమయంలో అధికార వైసీపీ నేతలు మౌనవ్రతం పాటించారు. టీడీపీ నాయకులు అటు మార్కాపురం, ఇటు ఒంగోలు కేంద్రంగా ఆరు నియోజకవర్గాలకు ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ మేరకు ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. కానీ వీటన్నింటినీ వైసీపీ సర్కారు పెడచెవిన పెట్టింది.

పార్టీలకతీతంగా ఐక్య ఉద్యమం

మార్కాపురం జిల్లా సాధన సమితి పేరుతో పార్టీలకతీతంగా ప్రజలు ఐక్యకార్యాచరణతో ఆందోళన చేపట్టారు. కొన్నినెలల పాటు ఉద్యమం సాగింది. ఆ సమయంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని ఒకచోట గాడితప్పితే మిగిలిన చోట ఇబ్బంది వస్తుందని జగన్‌ చెప్పిన మాటలను వైసీపీ నాయకులు ప్రజలకు వల్లెవేయడం ప్రారంభించారు. అయితే 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉండగా ఒక జిల్లా అదనంగా ఏర్పాటు చేశారు. స్థానికుల డిమాండ్‌కు అనుగుణంగా లోక్‌సభలతో సంబంధం లేకుండా కొన్ని నియోజకవర్గాలను మార్చారు. ఉదాహరణకు బాపట్ల లోక్‌సభలో ఉన్న ఎస్‌ఎన్‌పాడును ప్రకాశం జిల్లాలో కలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలోని కొన్ని మండలాలను నెల్లూరు జిల్లాలో ఉంచి మరికొన్ని మండలాలను కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలోకి మార్చారు. ఈ రెండు అంశాలను పశ్చిమప్రాంత ప్రజలు ప్రస్తావిస్తూ స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు అన్యాయం చేశారని దుమ్మెత్తిపోశారు. మంత్రిగా ఉన్న బాలినేని ఎస్‌ఎన్‌పాడు విషయంలో అంత శ్రద్ధ తీసుకొని మార్కాపురం ప్రజల ఆకాంక్షను గాలికొదిలేశారని విమర్శించారు. ప్రజల అసంతృప్తిని అప్పట్లోనే వైసీపీ ప్రజాప్రతినిధులు గుర్తించినా కనీసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే చర్యలు కూడా తీసుకోలేదు.

సమాధానం చెప్పలేని పరిస్థితిలో వైసీపీ నేతలు

ప్రస్తుతం పశ్చిమప్రాంతంలో గిద్దలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నాగార్జునరెడ్డి మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మార్కాపురంలో పోటీలో ఉన్న అన్నా రాంబాబు గిద్దలూరు ఎమ్మెల్యే. దర్శి నుంచి పోటీలో ఉన్న శివప్రసాద్‌రెడ్డి అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. కనిగిరి నుంచి పోటీలో ఉన్న నారాయణ విభజన సమయంలో వైసీపీ జడ్పీటీసీగా ఉన్నారు. వైపాలెం నుంచి పోటీలో ఉన్న చంద్రశేఖర్‌ స్థానికేతరుడు. అప్పట్లో వైపాలెం ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్న సురేష్‌ ఇప్పుడు జిల్లాలోని కొండపి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో పశ్చిమప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి వెళ్లినప్పుడు మార్కాపురం జిల్లా ఏమైంది. మీరు అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదు? అని కొందరు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కొనకనమిట్ల మండలం, దొనకొండ అడ్డరోడ్డు వద్ద జరిగిన సిద్ధం సభలో జగన్‌ మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఘనంగా చెప్పుకున్నారు. కానీ మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి ప్రస్తావించలేదు. ఆ సభలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ ప్రజల సంతృప్తి కోసమైనా ఈ అంశాన్ని ప్రస్తావించ లేదు. ఈ విషయాన్ని ప్రచారంలోకి వెళ్లిన అభ్యర్థులను వైసీపీ శ్రేణులు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థులు నీళ్లు నములుతున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థులు మాత్రం తమ ప్రభుత్వం రాగానే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీని ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:21 AM