Share News

సింగూరులో ఇసుక దోపిడీ

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:55 PM

ఎన్నికల హడావుడి వేళ.. కొంతమంది వైసీపీ నేతలు ఇసుక దోపిడీకి తెరలేపారు. ఓ పోలీసు అధికారి పేరు చెప్పి.. దందా సాగిస్తున్నారు. అనుమతుల్లేకుండానే రోజుకు రూ.15 లక్షల మేర ఇసుక నిల్వలు అక్రమ రవాణా చేస్తున్నారు.

సింగూరులో ఇసుక దోపిడీ
నాగావళి నదిలో ట్రాక్టర్‌లోకి ఇసుకను లోడ్‌ చేస్తున్న దృశ్యం

- పోలీసు అధికారి పేరు చెప్పి వైసీపీ నేత దందా

- రోజుకు రూ.15లక్షల మేర నిల్వలు అక్రమ తరలింపు

(పొందూరు)

ఎన్నికల హడావుడి వేళ.. కొంతమంది వైసీపీ నేతలు ఇసుక దోపిడీకి తెరలేపారు. ఓ పోలీసు అధికారి పేరు చెప్పి.. దందా సాగిస్తున్నారు. అనుమతుల్లేకుండానే రోజుకు రూ.15 లక్షల మేర ఇసుక నిల్వలు అక్రమ రవాణా చేస్తున్నారు. అధికార పార్టీ అండ ఉండడంతో ఈ అక్రమాలను అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. పొందూరు మండలం సింగూరులోని నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఇక్కడ ఉన్న ర్యాంపు కొద్దినెలల కిందట నిలిచిపోయింది. ప్రస్తుతం అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో.. తమకు అడ్డులేదని భావించి స్థానిక వైసీపీ నాయకుడు ఇక్కడ ఇసుక ర్యాంపు నిర్వహణకు సిద్ధమయ్యాడు. ఒక పోలీసు అధికారి పేరును అడ్డుపెట్టుకుని.. ఆయనకు తెలియకుండానే వారి కుటుంబ సభ్యులను ఇందులో భాగస్వామ్యం చేశాడు. దీనిపై కొందరు స్థానికులు అధికారులకు రహస్యంగా ఫిర్యాదు చేశారు. కానీ నేరుగా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఇటీవల ఓ కంపెనీ పేరు రశీదులతో.. అనుమతులు లేకపోయినా.. రోజూ సుమారు 80 పెద్ద లారీలు, వందకు ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు రూ.15లక్షలకుపైగా సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులకు ముడుపులు అందుతుండడంతో.. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఈ విషయమై పొందూరు తహసీల్దార్‌ ఎం.కిరణ్‌పాల్‌ వద్ద ప్రస్తావించగా.. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 11:55 PM