Share News

5 కి.మీ.లు... గంటకుపైగా ప్రయాణం

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:23 AM

జిల్లా కేంద్రం నుంచి చోడవరం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ఛిద్రమైంది. ప్రధానంగా తుమ్మపాల నుంచి మామిడిపాలెం వరకు ఐదు కిలోమీటర్ల మేర అడుగడుగునా భారీ గోతులతో దారుణంగా తయారైంది. ఈ మార్గంలో ఏ వాహనంలో వెళ్లినాసరే.. ఒళ్లు హూనం అవుతున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలో వున్న అనకాపల్లి- చోడవరం రోడ్డుకు గత ఐదేళ్లలో నిర్వహణ పనులు చేపట్టలేదు. కనీసం గోతులను కూడా పూడ్చలేదు. దీంతో తుమ్మపాల నుంచి మామిడిపాలెం వరకు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంట సమయం పడుతున్నదని పలువురు వాహనదారులు వాపోతున్నారు.

5 కి.మీ.లు... గంటకుపైగా ప్రయాణం
తుమ్మపాల వద్ద గోతులు ఏర్పడి ఒకవైపు మొత్తం ఛిద్రమైన రోడ్డు

అత్యంత దారుణంగా అనకాపల్లి- చోడవరం రోడ్డు

తుమ్మపాల నుంచి మామిడిపాలెం వరకు అడుగడుగునా గోతులు

పలుచోట్ల ఆనవాళ్లు లేని బీటీ రోడ్డు

గోతుల రోడ్డులో ఏ వాహనంలో వెళ్లినా.. ఒళ్లు హూనమే!

ప్రమాదాలకు గురవుతున్న ద్విచక్రవాహనదారులు

కనీస నిర్వహణ పనులు చేపట్టని ఆర్‌అండ్‌బీ

ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా నిధులు ఇవ్వని వైసీపీ ప్రభుత్వం

మాటలకే పరిమితమైన మంత్రి అమర్‌నాథ్‌ హామీలు

తుమ్మపాల (అనకాపల్లి), ఏప్రిల్‌ 19:

జిల్లా కేంద్రం నుంచి చోడవరం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ఛిద్రమైంది. ప్రధానంగా తుమ్మపాల నుంచి మామిడిపాలెం వరకు ఐదు కిలోమీటర్ల మేర అడుగడుగునా భారీ గోతులతో దారుణంగా తయారైంది. ఈ మార్గంలో ఏ వాహనంలో వెళ్లినాసరే.. ఒళ్లు హూనం అవుతున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలో వున్న అనకాపల్లి- చోడవరం రోడ్డుకు గత ఐదేళ్లలో నిర్వహణ పనులు చేపట్టలేదు. కనీసం గోతులను కూడా పూడ్చలేదు. దీంతో తుమ్మపాల నుంచి మామిడిపాలెం వరకు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంట సమయం పడుతున్నదని పలువురు వాహనదారులు వాపోతున్నారు.

జిల్లాలో అనకాపల్లి- చోడవరం రహదారికి ఎంతో ప్రాధాన్యం వుంది. పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల ప్రజలు చోడవరం, మాడుగులతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చుట్టుపక్కల మండలాలకు వెళ్లాలంటే ఈ మార్గంలోనే ప్రయాణించాలి. ప్రధానంగా అనకాపల్లి మండలంలోని తుమ్మపాల, మార్టూరు, మాకవరం, బవులవాడ, దిబ్బపాలెం, ఊడేరు, మామిడిపాలెం, పాపయ్యపాలెం, సంతపాలెం, కొండుపాలెం, వెంకుపాలెం, తదితర గ్రామాల నుంచి నిత్యం అధికం సంఖ్యలో ప్రజలు అనకాపల్లికి రాకపోకలు సాగిస్తుంటారు. మరోవైపు దాదాపు 80 శాతం రాయి క్వారీలు, స్టోర్‌ క్రషర్లు ఈ రోడ్డు పక్కనే వున్నాయి. ఇక రావికమతం, మాడుగుల మండలాల్లోని క్వారీల నుంచి భారీ గ్రానైట్‌ శిలల ట్రాలీలు చోడవరం మీదుగా అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపైకి చేరుకుని ఇతర ప్రాంతాలకు వెళుతుంటాయి. దీంతో అనకాపల్లి- చోడవరం రోడ్డులో వాహనాల రద్దీ అధికంగా వుంటున్నది. ఎంతో ప్రాధాన్యం వున్న ఈ రహదారి నిర్వహణను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. కనీసం గోతులు పూడ్చడానికి కూడా నిధులు విడుదల చేయలేదు. ఫలితంగా అడుగుకోగొయ్యి, గజానికోగుంత ఏర్పడడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. క్వారీలు, క్రషర్ల నుంచి రాళ్లు, మెటల్‌, బుగ్గి రవాణా చేసే లారీలు, గ్రానైట్‌ శిలలను తరలించే భారీ ట్రాలీల కారణంగా ఈ రోడ్డు మరింత దారుణంగా తయారైంది. ప్రధానంగా తుమ్మపాల నుంచి మామిడిపాలెం వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ భారీ గోతులు ఏర్పడడంతో ప్రయాణికుల ఒళ్లు హూనం అవుతున్నది. వాహనాల టైర్లు, ఇతర విడిభాగాలు దెబ్బతింటున్నాయని యజమానులు వాపోతున్నారు. రాత్రి పూట ప్రయాణించేటప్పుడు దగ్గరకు వెళ్లే వరకు గోతులు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ కొద్దిపాటి దూరం ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పడుతున్నదని ప్రజలు వాపోతున్నారు. కాగా తుమ్మపాల నుంచి చోడవరం మండలం వెంకన్నపాలెం జంక్షన్‌ వరకు రహదారిని అభివృద్ధి చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, ఆమ్‌ ఆద్మీ, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు గతంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు.

నీటిమూటలుగా మంత్రి అమర్‌ హామీ

సందిన చినబాబు, తుమ్మపాల, అనకాపల్లి మండలం (ఫొటో 19ఎకెపి-టీఎంపీ-6)

అనకాపల్లి నుంచి చోడవరం వెళ్లే రోడ్డును విస్తరించి, శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి చేస్తామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పలుమార్లు హామీ ఇచ్చారు. మరికొద్ది రోజుల్లో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. అనకాపల్లి- చోడవరం రోడ్డు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రోడ్డులో భారీ గోతులు ఏర్పడడంతో నానా అవస్థలు పడుతున్నాం. గోతుల కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించుకునే క్రమంలో పలువురు ప్రమాదాలబారిన పడ్డారు. ఐదు కిలోమీటర్లు ప్రయాణించడానికి గంటన్నర సమయం పడుతున్నది. ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వం అయినా.. అనకాపల్లి నుంచి వెంకన్నపాలం జంక్షన్‌ వరకు రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి.

Updated Date - Apr 20 , 2024 | 01:23 AM