Share News

అదానీ పోర్టు శ్రమ దోపిడీ

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:41 AM

అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం కార్మికులను భయపెడుతూ శ్రమ దోపిడీకి పాల్పడుతోంది.

అదానీ పోర్టు శ్రమ దోపిడీ

రెగ్యులర్‌ కార్మికులకూ అందని కనీస వేతనాలు

15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారి వేతనం 15 వేలే

విజయవాడ నుంచి కార్మిక శాఖ అదనపు కమిషనర్‌ రాక

చర్చల్లో పాల్గొననని వెళ్లిపోయిన పోర్టు హెచ్‌ఆర్‌ ప్రతినిధి

మరోవైపు చర్చలకు వచ్చిన కార్మికులకు 41-ఏ నోటీసులు

పోలీసుల తీరుపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం

వారు పోర్టు తరఫున పనిచేస్తున్నట్టుందని ఆవేదన

ఉద్యోగాలు వదిలేయడానికి రూ.25 లక్షలు ఇస్తామని ఆఫర్‌

ఒక్కొక్కరికీ రూ.35 లక్షలు అడుగుతున్న కార్మికులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం కార్మికులను భయపెడుతూ శ్రమ దోపిడీకి పాల్పడుతోంది. ఓ పక్క కార్మికులు కనీస వేతనాల కోసం ఆందోళన చేస్తుంటే.. వారికి నైపుణ్యం లేదని న్యాయస్థానంలో చెబుతోంది. అన్ని నైపుణ్యాలు ఉన్నవారికి కూడా సరైన వేతనాలు ఇవ్వడం లేదని తాజాగా శనివారం వెలుగులోకి వచ్చింది. వారంతా కార్మిక శాఖ అదనపు కమిషనర్‌ను ఆశ్రయిస్తే వారి విషయంలో చర్చలు జరిపేది లేదని చెప్పి పోర్టు ప్రతినిధి వెళ్లిపోయారు. మరోవైపు 18 రోజులుగా సమ్మె చేస్తున్న నిర్వాసిత కార్మికుల నాయకులను విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ చర్చలకు పిలిచి, వారు సమ్మె విరమణకు అంగీకరించకపోవడంతో 41-ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. దీనిపై కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. పోలీసులు పూర్తిగా పోర్టు తరఫున పనిచేస్తున్నట్టు ఉందని ఆరోపిస్తున్నాయి.

వారితో అయితే మేం చర్చించం..

అదానీ గంగవరం పోర్టులో 18 రోజులుగా నిర్వాసిత కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పోర్టులో మొత్తం రెండు వేల మంది కార్మికులు ఉండగా వారిలో నిర్వాసిత కార్మికులు 500 మంది ఉన్నారు. మిగిలిన వారంతా యాజమాన్యం అర్హతలను బట్టి నియమించుకున్నవారే. వేతనాలు పెంచాలని కోరుతూ నిర్వాసిత కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. పోర్టు గేట్లకు తాళాలు వేసేశారు. తమకు కూడా సరైన వేతనాలు ఇవ్వడం లేదని, న్యాయం చేయాలంటూ మిగిలిన 1,500 మంది కార్మికులు కూడా ఇప్పుడు ముందుకొచ్చారు. ప్రస్తుతం పోర్టు ఆపరేషన్లు ఆగిపోయి, విశాఖ స్టీల్‌ప్లాంటుకు ముడి పదార్థాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దాంతో ప్లాంటు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పోర్టు నుంచి ముడి పదార్థాలు అందేలా చూడాలని కోరుతూ విశాఖ స్టీల్‌ అధికారుల సంఘం హైకోర్టులో కేసు వేసింది. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు కార్మిక శాఖ అడిషనల్‌ కమిషనర్‌ లక్ష్మీనారాయణ విజయవాడ నుంచి శనివారం విశాఖపట్నం వచ్చారు. గంగవరం పోర్టు కార్మిక సంఘాల ప్రతినిధులను చర్చల నిమిత్తం నగరంలోని కార్మిక శాఖ అధికారి కార్యాలయానికి పిలిచారు. యాజమాన్యం తరఫున ఒక అధికారి హాజరయ్యారు. సమ్మె చేస్తున్నది వీరు కాదని, నిర్వాసిత కార్మికులని ఆ అధికారి పేర్కొన్నారు. దీంతో చర్చలకు హాజరైన కార్మికుల్లో పలువురు లేచి, తమకు అన్ని అర్హతలూ, నైపుణ్యం ఉన్నా కనీస వేతనాలివ్వడం లేదని, తమకూ వేతనాలు పెంచాలని కోరారు. నిర్వాసిత కార్మికుల సమ్మెకు తమ మద్దతు తెలుపుతున్నామన్నారు. దీంతో పోర్టు ప్రతినిధి లేచి.. ఈ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు తనకు యాజమాన్యం అనుమతి ఇవ్వలేదని బయటకు వెళ్లిపోయారు.

ఎవరికైనా రూ.15 వేలే జీతం..

కార్మిక శాఖ అధికారి కార్యాలయానికి వచ్చిన పోర్టు కార్మికులు మాట్లాడుతూ.. నిర్వాసిత కార్మికులు తోట పని, క్లీనింగ్‌, కొందరు కలాసీలుగా చేస్తారని, తాము మాత్రం యాజమాన్యం పెట్టిన పరీక్షలు పాసై విధుల్లో చేరామని చెప్పారు. 15 ఏళ్ల నుంచి చేస్తున్నా, ఇంకా రూ.15 వేలు మాత్రమే జీతంగా ఇస్తున్నారని చెప్పారు. జీతం పెంచాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. నిర్వాసిత కార్మికుల సమ్మెకు తాము కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఉత్తరాది నుంచి వచ్చిన వారికే పోర్టులో ఎక్కువ వేతనాలు ఇస్తున్నారని, ఇక్కడి వారికి శ్రమ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.

కార్మికులకు నోటీసులు

సమ్మె చేస్తున్న నిర్వాసిత కార్మికుల నాయకులను నగర పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ శనివారం చర్చలకు పిలిచారు. మొత్తం 12 మంది నాయకులు రాగా వారితో చర్చించారు. ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవడానికి తమకు మనిషికి రూ.35 లక్షలు ఇవ్వాలని వారు కోరగా, పోర్టు యాజమాన్యంతో మాట్లాడి రూ.25 లక్షల వరకు ఇప్పించగలమని కమిషనర్‌ హామీ ఇచ్చారు. అంత తక్కువైతే తాము సమ్మెలోనే ఉంటామని నాయకులు చెప్పారు. దీంతో వారందరికీ న్యూపోర్టు పోలీస్‌ స్టేషన్‌ అధికారితో 41-ఏ నోటీసులు ఇప్పించారు. తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, ఎటువంటి ఆందోళనలు చేయకూడదని చెప్పి పంపించారు.

Updated Date - Apr 28 , 2024 | 01:41 AM