Share News

చందనోత్సవం నాడు అంతరాలయ దర్శనాలు రద్దు

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:50 AM

సింహగిరిపై వచ్చే నెల 10న జరగనున్న చందనోత్సవంలో భక్తులందరికీ అప్పన్న నిజరూప దర్శనం కల్పిస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.మల్లికార్జున తెలిపారు.

చందనోత్సవం నాడు అంతరాలయ దర్శనాలు రద్దు

  • అప్పన్న నిజరూప దర్శనం

  • భక్తులందరికీ కల్పించేలా ప్రణాళికలు

  • ఘాట్‌రోడ్డులో 40 సాధారణ, 40 మినీ బస్సులకు మాత్రమే అనుమతి

  • కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున

  • సింహగిరిపై ఏర్పాట్లు పరిశీలన

సింహాచలం, ఏప్రిల్‌ 27:

సింహగిరిపై వచ్చే నెల 10న జరగనున్న చందనోత్సవంలో భక్తులందరికీ అప్పన్న నిజరూప దర్శనం కల్పిస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.మల్లికార్జున తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన నగర పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌, దేవస్థానం ఈఓ శ్రీనివాసమూర్తితో కలిసి చందనోత్సవానికి అధికారులు సిద్ధం చేసిన ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ వల్ల ప్రొటోకాల్‌ దర్శనాలు లేవని స్పష్టంచేశారు. అంతరాలయ దర్శనాన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వైదిక కార్యక్రమాల అనంతరం వేకువజామున నాలుగు గంటల నుంచి గంటపాటు ధర్మకర్తల కుటుంబానికి, దేవాలయ దాతలకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించి, ఆ తరువాత నీలాద్రి గుమ్మం వద్ద నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు పోలీసు శాఖ సమగ్ర ప్రణాళికలు రూపొందించిందని, 40 సాధారణ బస్సులు, 40 మినీ బస్సులను మాత్రమే ఘాట్‌ రోడ్డులో రాకపోకలకు అనుమతిస్తామని చెప్పారు. టికెట్లు రీ సేల్‌ జరగకుండా ప్రతి టికెట్‌ను రెండుసార్లు పంచింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశామని, బార్‌ కోడ్‌ తప్పనిసరిగా ఉంటుందన్నారు. బయటకు వెళ్లే మార్గం నుంచి ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య దేవాలయ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలకు అనుమతిస్తామని, 4 నుంచి 5 వరకు దివ్యాంగులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. రూ.1,500 టికెట్లు గతంలో కంటే తక్కువగా ముద్రించాలని నిర్ణయించామని, అవసరమైతే తదుపరి నిర్ణయం మేరకు 7 వేల కంటే తక్కువకు తగ్గిస్తామన్నారు. చందనోత్సవం టికెట్లను వచ్చే నెల రెండో తేదీ నుంచి విక్రయించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అడిషినల్‌ కమిషనర్‌ విశ్వనాథన్‌, అడిషినల్‌ సీపీ ఫకీరప్ప, వైద్య ఆరోగ్య శాఖ, జీవీఎంసీ, సింహాచలం దేవస్థానం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:50 AM