Share News

ప్రజల పక్షాన నిలిచేది కాంగ్రెస్సే..

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:17 AM

ప్రజల పక్షాన నిలిచేది కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌షర్మిల అన్నారు. పాడేరులో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కంకిపాటి వీరన్నపడాల్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ఏపీ న్యాయయాత్రలో ఆమె మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో గిరిజన ప్రాంతాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, 20 లక్షల మంది గిరిజన కుటుంబాలకు పోడు పట్టాలు ఇచ్చారని ఆమె తెలిపారు.

ప్రజల పక్షాన నిలిచేది కాంగ్రెస్సే..
పాడేరులో మాట్లాడుతున్న షర్మిల - పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

పాడేరు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ప్రజల పక్షాన నిలిచేది కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌షర్మిల అన్నారు. పాడేరులో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కంకిపాటి వీరన్నపడాల్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ఏపీ న్యాయయాత్రలో ఆమె మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో గిరిజన ప్రాంతాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, 20 లక్షల మంది గిరిజన కుటుంబాలకు పోడు పట్టాలు ఇచ్చారని ఆమె తెలిపారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లయితే ఐదేళ్లు చంద్రబాబు పాలిస్తే, మరో ఐదేళ్లు జగన్మోహన్‌రెడ్డి పాలించారని, కానీ అభివృద్ధిలో ఒక్క అడుగైనా ముందుకు పడలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రూ.10 లక్షల కోట్ల అభివృద్ధి జరిగేదని, దురదృష్టవశాత్తూ కాంగ్రెస్‌ రాకపోవడంతో ప్రత్యేక హోదా రాకుండా పోయిందన్నారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే స్థితిలో ఉందన్నారు. ఇండియా కూటమిదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివాసీ రిజర్వేషన్లు ఎత్తేయడానికి కుట్ర చేస్తున్నారని, ఇతరుల్ని ఆదివాసీల్లో కలపడానికి కృషి చేస్తున్నారని, అడవులపై హక్కు ఆదివాసీలదా? అదానీదా? అని ఆయన ప్రశ్నించారు. సీపీఎం అరకులోయ ఎంపీ అభ్యర్థి అప్పలనర్స మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఇండియా కూటమి అధికారంలో ఉంటే గిరిజనులకు సంబంధించిన జీవో:3, 1/70 చట్టానికి రక్షణ ఉంటుందన్నారు. ఆదివాసీల హక్కులు, చట్టాలకు రక్షణతో పాటు, ఆదివాసీ సహజ సంపదలు సైతం దోచుకోకుండా కాపాడతారన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రతిఘటించడానికి కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ ముందుకు వచ్చాయని అప్పలనర్స అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి సతకా బుల్లిబాబు, కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేత కృష్ణకుమారి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కొత్తపల్లి లోకనాథం, సీపీఐ నేతలు పొట్టిన సత్యనారాయణ, అమర్‌, రాజబాబు, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు, గిరిజనులు పాల్గొన్నారు.

కల్తీ మద్యంతో జనం అనారోగ్యంపాలు

అరకులోయ: వైసీపీ ప్రభుత్వం నాసిరకం బ్రాండ్‌ మద్యాన్ని విక్రయిస్తుండడంతో వాటిని తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు అనారోగ్యానికి గురయ్యారని పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. అరకులోయలో శనివారం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ హామీలను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పోరాడే సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం అరకులోయ ఎంపీ అభ్యర్థి అప్పలనర్స, కాంగ్రెస్‌ అరకు అసెంబ్లీ అభ్యర్థి శెట్టి గంగాధర్‌స్వామి, సీపీఎం నాయకులు లోకనాథం, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:17 AM