Share News

1955లో స్వతంత్రులదే హవా!

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:38 AM

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు రంగంలో ఉన్నప్పటికీ స్వతంత్రులుగా పోటీచేసిన ఎంతోమందిని చట్టసభలకు పంపిన చరిత్ర విశాఖ జిల్లాకు ఉంది.

1955లో స్వతంత్రులదే హవా!

ఇండిపెండెంట్లకు పట్టం కట్టిన జిల్లా

భీమునిపట్నం (రూరల్‌) ఏప్రిల్‌ 25:

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు రంగంలో ఉన్నప్పటికీ స్వతంత్రులుగా పోటీచేసిన ఎంతోమందిని చట్టసభలకు పంపిన చరిత్ర విశాఖ జిల్లాకు ఉంది. రాష్ట్రంలో 1955లో పూర్తిస్థాయి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇతర జిల్లాలకు భిన్నంగా విశాఖపట్నం జిల్లాలో అనేక నియోజకవర్గాలలో ఇండిపెండెంట్లు జయకేతనం ఎగరవేశారు. ఈ రికార్డు ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ నమోదు కాలేదు.

అప్పటి అసెంబ్లీలో 196 సీట్లుండగా వాటిలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీకి 119 సీట్లు వచ్చాయి. కృషీకార్‌ లోక్‌పార్టీకి 22, సీపీఐకు 15, ప్రజా సోషలిస్టుపార్టీకి 13, ప్రజాపార్టీకి 5 సీట్లు రాగా ఇండిపెండెంట్లు 22 మంది ఎన్నికయ్యారు. వీరిలో ఎనిమిది మంది విశాఖ జిల్లా నుంచే గెలుపొందడం విశేషం. అప్పటి ఎన్నికల సమయంలో ఒక నియోజకవర్గానికి ఇద్దరేసి ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించేవారు. ఒకరే ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాలూ ఉండేవి. ఆ ఎన్నికల సమయానికి గూడెం, కణితి, కొండకర్ల, గొలుగొండ, రేవిడి, నియోజకవర్గ కేంద్రాలుగా ఏండువి. ఆ తర్వాత కాలంలో వాటిని పక్క నియోజకవర్గాలలో విలీనం చేశారు.

సత్తాచాటిన ఇండిపెండెట్లు

ఆనాటి విశాఖ జిల్లాలో అనేక నియోజకవర్గాలలో ఇండి పెండెంట్లు గెలుపొందారు. గూడెం నియోజకవర్గంలో మత్స్యరాజు మత్స్యరాజు కృషీకార్‌ లోక్‌పార్టీ నాయకుడు కాద పెన్నయ్యపై గెలుపొందారు. ఇతనికి 3,880 ఓట్లు రాగా పెన్నయ్యకు 2,066 ఓట్లు వచ్చాయి. గొలుగొండ నియోజకవర్గంలో రుత్తల లచ్చాపాత్రుడు 13,932 ఓట్లు తెచ్చుకుని గెలుపొందారు ఇతనిపై పోటీ చేసిన కృషీకార్‌లోక్‌ పార్టీ అభ్యర్థి పాసపు తమ్మునాయుడుకు 7,826 ఓట్లు వచ్చాయి. నర్సీపట్నం నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలూ ఇండిపెండెంట్లే జాతీయ పార్టీల అభ్యర్థులను ఓడించారు. ఒకరు రాజాసాగి సూర్యనారాయణరాజు. ఇతనికి 23,574 ఓట్లు రాగా మరొకరు ముత్యాల పోతురాజు 21,346 ఓట్లు సంపాదించారు. ఎలమంచిలి నియోజకవర్గం నుంచి చింతలపాటి వెంకట సూర్యనారాయణరాజు 13,621 ఓట్లు తెచ్చుకుని గెలవగా, సీపీఐ అభ్యర్ధి కాండ్రేగుల రామజోగి 9,961 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. చోడవరం నియోజకవర్గంలో ఇండిపెండెంటు రెడ్డి జగన్నాథం 12,658 ఓట్లు సాధించగా, కృషికార్‌ లోక్‌పార్టీ అభ్యర్థి బోజంకి గంగయ్యనాయుడు 11,796 ఓట్లకు పరిమితమయ్యారు. కణితి నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ బీజీఎంఏ నరసింగరావు 10,171 ఓట్లు సంపాదించగా, సీపీఐ అభ్యర్థి పోతిన సన్యాసిరావుకు 6,233 ఓట్లు వచ్చాయి. విశాఖపట్నం నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నాయకులు ఎవరూ సరైన ఓట్లు సంపాదించలేకపోయారు. ఇండిపెండెంటు అంకితం వెంకట భానోజీరావు 15,457 ఓట్లు, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దిపాటి అభిరామరెడ్డి 6,955 ఓట్లు సాధించారు. కాగా ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌పార్టీ కి రాష్ట్రంలో 119 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా విశాఖజిల్లాలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం విచిత్రంగా చెప్పుకుంటారు.

Updated Date - Apr 28 , 2024 | 01:38 AM