Share News

అనకాపల్లి జిల్లాలోకి జగన్‌ బస్సు యాత్ర

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:59 AM

ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాకినాడ జిల్లా నుంచి శుక్రవారం రాత్రి పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించింది.

అనకాపల్లి జిల్లాలోకి జగన్‌ బస్సు యాత్ర

  • కాకినాడ జిల్లా నుంచి పాయకరావుపేట వద్ద ప్రవేశం

  • అభివాదం చేస్తూ ముందుకు సాగిన సీఎం

  • నక్కపల్లి మండలం గొడిచెర్లలో రాత్రి బస

  • నేడు కశింకోట మండలం గొబ్బూరులో బహిరంగసభ

పాయకరావుపేట/నక్కపల్లి/అనకాపల్లి, ఏప్రిల్‌ 19:

ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాకినాడ జిల్లా నుంచి శుక్రవారం రాత్రి పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. తుని నుంచి పాయకరావుపేట వద్ద గల తాండవ జంక్షన్‌ వరకు బస్సు లోపల ఉన్న ఆయన అక్కడి నుంచి వాహనంపైకి ఎక్కి అభివాదం చేసుకుంటూ ముందుకుసాగారు. వై జంక్షన్‌ వద్ద వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎంపీ కె.సత్యవతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, ఎమ్మెల్యే కంబాల జోగులు, తదితరులు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపటి అనంతరం జగన్మోహన్‌రెడ్డి మళ్లీ బస్సు లోపలకు వెళ్లి, ముందు సీట్లో కూర్చుని ప్రజలకు అభివాదం చేసుకుంటూ నక్కపల్లి మండలంలోకి ప్రవేశించారు.

గొడిచెర్లలో రాత్రి బసకు చేరుకున్న జగన్‌

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు నక్కపల్లి మండలం గొడిచెర్ల చేరుకున్నారు. ఇక్కడ జాతీయ రహదారి పక్కన ఖాళీ పొలంలో బస చేసేందుకు (బస్సులోనే) ఏర్పాట్లు చేశారు.

నేడు గొబ్బూరులో బహిరంగ

శనివారం ఉదయం తొమ్మిది గంటలకు నక్కపల్లి మండలం గొడిచెర్ల నుంచి బస్సు యాత్రను కొనసాగిస్తారు. ఎలమంచిలి బైపాస్‌ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు అచ్యుతాపురం చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం కశింకోట మండలం తాళ్లపాలెం సమీపంలో గొబ్బూరు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు అక్కడ ఏర్పాటుచేసే బహిరంగ సభలో పాల్గొంటారు. తరువాత తాళ్లపాలెం జంక్షన్‌, కశింకోట, కొత్తూరు, అనకాపల్లి, శంకరం, రేబాక మీదుగా అనకాపల్లి మండలం చిన్నయ్యపాలెం వద్ద రాత్రి బసకు చేరుకుంటారు.

Updated Date - Apr 20 , 2024 | 01:59 AM