Share News

పేట...‘దేశం’ కంచుకోట

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:05 AM

ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పోరాటయోధుడు జగన్నాథ పాయకరావు పేరు మీద ఏర్పడిన పాయకరావుపేట స్వాతంత్య్రం వచ్చిన తరువాత జనరల్‌ నియోజకవర్గంగా ఏర్పడింది.

పేట...‘దేశం’ కంచుకోట

  • నియోజకవర్గానికి ఇప్పటివరకూ 15సార్లు ఎన్నికలు

  • అత్యధికంగా ఏడు సార్లు విజయం సాధించిన టీడీపీ

  • - మూడు పర్యాయాలు కాంగ్రెస్‌

  • - రెండు పర్యాయాలు వైసీపీ

  • - సీపీఐ ఒకసారి గెలుపు

పాయకరావుపేట, ఏప్రిల్‌ 18:

ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పోరాటయోధుడు జగన్నాథ పాయకరావు పేరు మీద ఏర్పడిన పాయకరావుపేట స్వాతంత్య్రం వచ్చిన తరువాత జనరల్‌ నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పట్లో మద్రాస్‌ సంయుక్త రాష్ట్రంలో ఉన్న ఈ నియోజకవర్గానికి పాయకరావుపేట మండలం గుంటపల్లికి చెందిన గెడ్డం సన్యాసిరావు శాసనసభ్యునిగా పనిచేశారు. ఆ తరువాత 1952లో జరిగిన ఎన్నికల్లో ఆర్‌.సాగిసూర్యనారాయణరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1962లో పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గంగా మారింది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ 15 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా ఏడుసార్లు టీడీపీ, మూడుసార్లు కాంగ్రెస్‌, రెండుసార్లు వైసీపీ, సీపీఐ, కాంగ్రెస్‌ (ఐ) ఒక్కొక్కసారి గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంట్‌ గెలుపొందారు.

పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ కాపు సామాజిక వర్గానిదే ఆధిపత్యం. నియోజకవర్గంలో కాపు, ఎస్సీ సామాజిక వర్గాలతోపాటు బీసీ వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఉన్న తీర ప్రాంతంలోని 18 మత్స్యకార గ్రామాల్లో ఉన్న మత్స్యకారుల ఓట్లు ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారుతుంటాయి.

పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకూ పరిశీలిస్తే 1962లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ తరపున పోటీ చేసిన మండే పిచ్చియ్య...కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎం.పోతురాజుపై గెలుపొందారు. 1967లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గంట్లాన సూర్యనారాయణ ఇండిపెండెంట్‌ అభ్యర్థి బి.నాగభూషణంపై విజయం సాధించారు. అదేవిధంగా 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున రెండోసారి పోటీ చేసిన గంట్లాన సూర్యనారాయణ...మరోమారు ఇండిపెండెంట్‌ అభ్యర్థి బి.నాగభూషణంపై గెలుపొందారు. 1978లో ఇందిరా కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన మారుతి ఆదియ్య...కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గారా చిననూకరాజుపై గెలుపొందారు.

1982లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీ వర్గాలు మద్దతుగా నిలిచాయి. దీంతో 1983 నుంచి 2004 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వరుసగా ఆరుసార్లు విజయాలు సాధించింది. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటెల సుమన...కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆర్‌.నీలపర్తిపై విజయం సాధించారు. అలాగే 1985 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కాకర నూకరాజు...కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జీవీ హర్షకుమార్‌పై, 1989లో టీడీపీ తరపున రెండోసారి పోటీ చేసిన కాకర నూకరాజు కాంగ్రెస్‌ తరపున బరిలోకి దిగిన గంటెల సుమనపై విజయం సాధించారు. అలాగే 1994లో మూడోసారి టీడీపీ తరపున పోటీ చేసిన కాకర నూకరాజు మరోమారు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గంటెల సుమనపై విజయం సాధించారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నిర్మాత చెంగల వెంకట్రావు...కాంగ్రెస్‌ పార్టీ తరపున మూడోసారి పోటీ చేసిన గంటెల సుమనపై విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ, కాంగ్రెస్‌ తరపున వీరిద్దరే పోటీపడగా చెంగల వెంకట్రావును విజయం వరించింది. ఇక నియోజకవర్గాల పునర్విభజనలో కాంగ్రెస్‌కు పట్టున్న కోటవురట్ల మండలాన్ని నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ‘పాయకరావుపేట’లో చేర్చింది. దీంతో టీడీపీ జైత్రయాత్రకు బ్రేకు పడింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున మూడోసారి చెంగల వెంకట్రావు బరిలోకి దిగగా, కాంగ్రెస్‌ పార్టీ తరపున గొల్ల బాబూరావు, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా జి.ధనరాజ్‌ పోటీ చేశారు. త్రిముఖ పోటీలో గొల్ల బాబూరావు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరిన గొల్ల బాబూరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కారణంగా 2012లో ఉప ఎన్నిక వచ్చింది. వైసీపీ తరపున గొల్ల బాబూరావు పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వంగలపూడి అనిత...వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెంగల వెంకట్రావుపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన గొల్ల బాబూరావు టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ బి.బంగారయ్యపై విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎస్‌.రాయవరం మండలానికి చెందిన కాకర నూకరాజు 1985, 1989, 1994 ఎన్నికల్లో టీడీపీ తరపున వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్‌ కొట్టారు. ఇప్పటివరకూ ఆయన రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేకపోయారు.

మరోసారి టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ

వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా వంగలపూడి అనిత, వైసీపీ అభ్యర్థిగా కంబాల జోగులు పోటీలో ఉన్నారు. ఇంకా పార్టీల నుంచి అభ్యర్థులు, ఇండిపెండెంట్లు బరిలో ఉన్నా టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ జరగనున్నది. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందిన వంగలపూడి అనిత 2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం పోటీ చేసి ఓటమి చెందారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆమె పోటీ చేయబోతున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి అయిన కంబాల జోగులు 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రాజాం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి రెండుసార్లు గెలుపొందారు. ఇప్పుడు పాయకరావుపేట నుంచి బరిలోకి దిగారు.

1952లో పాయకరావుపేట నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల వివరాలు పరిశీలిస్తే...

సంవత్సరం విజేత పార్టీ పొందిన ఓట్లు సమీప ప్రత్యర్థి పార్టీ పొందిన ఓట్లు మెజారిటీ

1952 ఆర్‌ఎస్‌ఎస్‌ రాజు ఇండిపెండెంట్‌ 9,757 ఎస్‌.ఎ.నాయుడు కాంగ్రెస్‌ 5,737 4,020

ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడిన తరువాత నుంచి..

1962 మండే పిచ్చియ్య సీపీఐ 13,464 ఎం.పోతురాజు కాంగ్రెస్‌ 11,379 2,085

1967 జి.సూర్యనారాయణ కాంగ్రెస్‌ 13,804 బి.నాగభూషణం ఇండిపెండెంట్‌ 12,165 1,639

1972 జి.సూర్యనారాయణ కాంగ్రెస్‌ 21,844 బి.నాగభూషణం ఇండిపెండెంట్‌ 3,588 18,256

1978 మారుతి ఆదియ్య కాంగ్రెస్‌(ఐ) 29,490 జీసీ.నూకరాజు కాంగ్రెస్‌ 14,023 15,467

1983 గంటెల సుమన టీడీపీ 34,090 ఆర్‌.నీలపర్తి కాంగ్రెస్‌ 10,252 22,778

1985 కాకర నూకరాజు టీడీపీ 42,821 జీవీ హర్షకుమార్‌ కాంగ్రెస్‌ 13,053 28,769

1989 కాకర నూకరాజు టీడీపీ 38,764 గంటెల సుమన కాంగ్రెస్‌ 35,486 3,278

1994 కాకర నూకరాజు టీడీపీ 39,666 గంటెల సుమన కాంగ్రెస్‌ 35,657 4,009

1999 చెంగల వెంకట్రావు టీడీపీ 46,478 గంటెల సుమన కాంగ్రెస్‌ 38,902 7,576

2004 చెంగల వెంకట్రావు టీడీపీ 40,794 గంటెల సుమన ఇండిపెండెంట్‌ 27,105 13,689

2009 గొల్ల బాబూరావు కాంగ్రెస్‌ 50,698 చెంగల వెంకట్రావు టీడీపీ 50,042 656

2012 గొల్ల బాబూరావు వైసీపీ 71.963 చెంగల వెంకట్రావు టీడీపీ 57,601 14,362

2014 వంగలపూడి అనిత టీడీపీ 86,355 చెంగల వెంకట్రావు వైసీపీ 83,527 2,828

2019 గొల్ల బాబూరావు వైసీపీ 98,745 బి.బంగారయ్య టీడీపీ 67,556 31,189

Updated Date - Apr 28 , 2024 | 02:05 AM