Share News

ఐదు ఎన్నికలకు అయిన ఖర్చు రూ.23.2 లక్షలే...

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:03 AM

నాటికీ, నేటికీ ఓటర్ల ఆలోచనల్లో బాగా మార్పు వచ్చిందని, గ్రామాభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రయోజనానికే అత్యధికులు ప్రాధాన్యం ఇస్తున్నారంటున్నారు సీనియర్‌ రాజకీయ నాయకుడు పప్పల చలపతిరావు అన్నారు.

ఐదు ఎన్నికలకు అయిన ఖర్చు రూ.23.2 లక్షలే...

  • ఇప్పుడు పరిస్థితి మారిపోయింది

  • ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యం పెరుగుతోంది

  • ఓటర్ల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది

  • అప్పట్లో గ్రామానికి ఏం చేస్తారని అడిగేవారు

  • ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట

  • నిత్యం ప్రజల్లో ఉండడం వల్లే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నిక కాగలిగా

  • తొలిసారి ఎమ్మెల్యేగా పనిచేసిన ఐదేళ్లలో స్కూటర్‌ కూడా లేదు

  • ‘ఆంధ్రజ్యోతి’తో టీడీపీ సీనియర్‌ నాయకుడు పప్పల చలపతిరావు

ఎలమంచిలి, ఏప్రిల్‌ 25:

నాటికీ, నేటికీ ఓటర్ల ఆలోచనల్లో బాగా మార్పు వచ్చిందని, గ్రామాభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రయోజనానికే అత్యధికులు ప్రాధాన్యం ఇస్తున్నారంటున్నారు సీనియర్‌ రాజకీయ నాయకుడు పప్పల చలపతిరావు అన్నారు. రాను రాను ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. ఎలాంటి వ్యాపారాలు, వ్యాపకాలు పెట్టుకోకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం వల్లే తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నిక కాగలిగానన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి...అంటే దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న చలపతిరావు తెలుగుదేశం పార్టీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇంకా టీటీడీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఆయన ప్రస్తుతం కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో సౌమ్యునిగా, వివాదరహితునిగా పేరున్న చలపతిరావు ఎలమంచిలిలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో విశేషాలను వివరించారు. అవి ఆయన మాటల్లోనే..

నాడు పార్టీలో స్వచ్ఛందంగా చేరాను

నాడు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో 1984 స్వచ్ఛందంగా చేరాను. పార్టీలో చేరడానికి ముందు రాంబిల్లి మండలం మురకాడ గ్రామ మునసబుగా, దిమిలి ఎల్‌ఎస్‌సీఎస్‌ (లార్జ్‌ సైజ్డ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ) అధ్యక్షునిగా రెండుసార్లు గెలిచాను. 1984లో ఎన్టీఆర్‌ గ్రామ మునసబు వ్యవస్ధను రద్దు చేయడంతో ఆ ఉద్యోగం కూడా పోయింది. మాది రాజకీయంగా గుర్తింపు ఉన్న కుటుంబం. మా పెదనాన్న పప్పల బాపునాయుడు 1952లో నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా కేఎల్‌పీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1976లో మా మామయ్య నగిరెడ్డి సత్యనారాయణ స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

టికెట్‌ వస్తుందని అనుకోలేదు

1985లో నాదెండ్ల భాస్కరరావు వల్ల ఏర్పడిన సంక్షోభంలో ఎలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద నాయకులంతా టీడీపీని వీడారు. అప్పటికి నేను నాయకుడిని కాదు. ఆ సమయంలో ప్రజలంతా ఎన్టీఆర్‌ వైపుఉన్నారు. గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించే వాళ్లం. ఎలమంచిలి పంచాయతీ కార్యాలయం సమీపంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. మాతోపాటే స్వర్గీయ ఆడారి తులసీరావు పనిచేశారు. సంక్షోభం ముగిసి మళ్లీ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఆడారి తులసీరావు ఎమ్మెల్యే టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతకుముందు ఒకసారి అనుకోకుండా హైదరాబాద్‌ వెళ్లాను. అక్కడ ఎన్టీఆర్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని తెలిసి వెళ్లాను. ఆశావహులతో చాంతాడంత క్యూ ఉంది. ఆ క్యూలో ఫైలు పట్టుకుని నేనూ నిల్చున్నాను. అర్ధగంట తరువాత నాకు అవకాశం వచ్చింది. ఇంటర్య్వూ గదిలోకి వెళ్లాను. సోఫాలో ఎన్టీఆర్‌ కూర్చున్నారు. ఇద్దరు పీఏలు ఆయన వెనుక నిల్చుని ఉన్నారు. ఎన్టీఆర్‌ నన్ను పట్టించుకోలేదు. కొద్ది నిమిషాలు తర్వాత నేను ఎదురుగా ఉన్న మరొక సోఫాలో కూర్చున్నాను. దీంతో ఎన్టీఆర్‌ ఏం? అన్నారు. లేచి నిలబడిన నేను ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని తెలుసుకుని వచ్చానన్నాను. నేను టికెట్‌ కోసం రాలేదు...మీకో చిన్న సూచన చేద్దామని వచ్చాను అని అనగానే ఎన్టీఆర్‌ కోపంగా నా వైపు చూశారు. లోలోపల భయం వేసింది అయినప్పటికీ ధైర్యం చేసుకుని టికెట్ల కేటాయింపులో నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తే అన్ని స్థానాల్లోనూ మంచి మెజారిటీ వస్తుందని సూచించా. సరే చూద్దాం...అన్నారు. నేను బయటకు వచ్చేశాను. పీఏ నన్ను మళ్లీ లోపలకు పిలిచారు. ‘నీ పేరేంటి’ అని ఎన్టీఆర్‌ అడిగి చిరునామా రాసుకున్నారు. మీ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గం ఎక్కువ అని అడిగారు. వివరాలు చెప్పాను. నా సామాజిక వర్గం అడిగారు చెప్పాను. మా నియోజకవర్గంలో ఎంక్వయిరీ చేసుకుని ఎవరికి టికెట్‌ కేటాయించినా మంచి ఫలితాలు ఉంటాయన్నాను. తరువాత ఎన్నికలు దగ్గరకొచ్చాయి. టికెట్‌ కేటాయింపులు జోరందుకున్నాయి. ఆడారి తులసీరావుకు మద్దతుగా మేం కూడా హైదరాబాద్‌కు వెళ్లాం. అయితే అనూహ్యంగా ఎలమంచిలి టికెట్‌ నాకు ఇచ్చారు.

అద్దె కారులో ప్రచారం

సీటు రావడంతో ఒక అంబాసిడర్‌ కారును అద్దెకు తీసుకుని నెల రోజులు పాటు ఎన్నికల ప్రచారం చేశా. ఓటర్లకు డబ్బు, మద్యం, వంటివి ఏమీ పంపిణీ చేయలేదు. మొత్తం ఆ ఎన్నిక ఖర్చు 1.9 లక్షలు. తొలిసారి ఎమ్మెల్యేగా పనిచేసిన ఐదేళ్లు నాకు స్కూటర్‌ కూడా లేదు. ఎవరైనా పనుల కోసం వచ్చేవారు నన్ను స్కూటర్‌పై తీసుకువెళ్లేవారు. 1989లో కూడా పార్టీ టికెట్‌ నాకే వచ్చింది అప్పుడు స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు దాదాపు నాలుగు లక్షల రూపాయలు వరకూ కానుకలుగా ఇచ్చారు. దానిలో 3.2 లక్షలు ఎన్నికల్లో ఖర్చయ్యాయి మిగిలిన డబ్బుతో ఒక సెకండ్‌ హ్యాండ్‌ మారుతీ కారు కొనుక్కున్నాను. 1994లోనూ నాకే సీటు రావడంతో పోటీ చేశాను. ఆ ఎన్నికల్లో 3 లక్షల రూపాయలు, తరువాత 1999 నాటి ఎన్నికల్లో సుమారు 3 లక్షల రూపాయలు ఎన్నికలకు ఖర్చయ్యాయి. 2004లో ఎంపీగా సీటు రావడంతో పోటీ చేసి గెలుపొందాను. ఈ ఎన్నికల్లో సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చయింది. ఈ ఐదు ఎన్నికల్లో సుమారు మొత్తం 23 లక్షల 20 వేల రూపాయలు వరకూ ఖర్చయింది. తరువాత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గానూ, పార్లమెంటరీ కమిటీ సభ్యునిగా, దేవ దేవుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా దేవునికి సేవ చేసుకునే అవకాశం లభించడం నా పూర్వ జన్మసుకృతం. తరువాత ఎమ్మెల్సీగా ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం వచ్చింది.

ఓటర్లలో మార్పు వచ్చింది...వ్యక్తిగత విమర్శలు పెరిగాయి

ఓటర్ల మనోగతంలో మార్పు వచ్చింది. గతంలో అయితే మా గ్రామానికి ఏం చేస్తారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనేవారు. వ్యక్తిగత ప్రయోజనాలకు తావు ఉండేది కాదు. అలాగే అప్పటి ఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు ఉండేవి కావు. నైతిక విలువలు, సిద్థాంతాలతో ముందుకు సాగేవాళ్లం. ఇప్పుడు డబ్బు ప్రాధాన్యం పెరిగిపోయింది. ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎన్ని రూ.కోట్లు ఖర్చు పెట్టగలరనేది ప్రామాణికంగా మారింది.

కూటమి పార్టీల్లో చేరేందుకు ఉత్సాహంగా..

రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరేందుకు ప్రస్తుతం యువతతోపాటు అన్నివర్గాల ప్రజలు చాలా ఉత్సాహంగా ముందుకువస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ‘కూటమి’ అభ్యర్థుల విజయం ఖాయం.

Updated Date - Apr 28 , 2024 | 02:03 AM