Share News

వైసీపీ పాలనపై చార్జిషీటు

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:46 PM

వైసీపీ ఐదేళ్ల పాలనంతా అన్యాయాలు.. అక్రమాలు.. అవినీతే తప్ప అభివృద్ధి లేదని, ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎన్‌డీఏ కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) తరుపున చార్జిషీటు విడుదల చేస్తున్నామని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రకటించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నేతలంతా ఉమ్మడిగా చార్జిషీటును ఆవిష్కరించారు

వైసీపీ పాలనపై చార్జిషీటు
ఐదేళ్ల వైసీపీ పాలనపై చార్జిషీటు విడుదల చేస్తున్న టీడీపీ నాయకులు

వైసీపీ పాలనపై చార్జిషీటు

ఐదేళ్లలో అన్యాయాలు.. అక్రమాలే

అభివృద్ధి చేసింది ఎక్కడ?

టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 27: వైసీపీ ఐదేళ్ల పాలనంతా అన్యాయాలు.. అక్రమాలు.. అవినీతే తప్ప అభివృద్ధి లేదని, ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎన్‌డీఏ కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) తరుపున చార్జిషీటు విడుదల చేస్తున్నామని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రకటించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నేతలంతా ఉమ్మడిగా చార్జిషీటును ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ, ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. కక్షపూరితమైన చర్యలు తప్ప, ఎటువంటి అభివృద్ధీ లేదన్నారు. నిత్యావసరాల ధరలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచేశారని, ప్రజలపై పన్నుల భారాన్ని అధికంగా వేశారన్నారు. చివరకు ప్రజలు ఉపయోగించి పారేసే చెత్తపై కూడా పన్ను వేసేశారన్నారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా పట్టించుకునే వారే లేరన్నారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన తప్పులు, అన్యాయాలపై ఎన్‌డీఏ కూటమి చార్జిషీటు విడుదల చేసిందని, దీనిని ప్రజల ముంగిటకు తీసుకువెళ్తామన్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, వైసీపీ తప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. కూటమి విజయనగరం అసెంబ్లీ అభ్యర్థి అదితిగజపతిరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐదేళ్లలో ప్రజా వ్యతిరేక పాలన సాగిందని, అన్ని వర్గాలకూ ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందని అన్నారు. నిరుద్యోగులకు ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారని, ఇంతవరకూ చేయలేదని అన్నారు. జనసేన నాయకురాలు పాలవలస యశస్విని మాట్లాడుతూ చార్జిషీటులో పొందుపరిచిన ప్రతి అంశాన్నీ ప్రజల వద్దకు తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకుడు శంబర లక్ష్మీనరసింహం మాట్లాడుతూ, కేంద్రంలో వున్న బీజేపీ ఎన్నో నిధులు ఈ రాష్ట్రానికి విడుదల చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే, జగన్‌ స్టిక్కర్లు వేసుకున్నారని విమర్శించారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, కర్రోతు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

చార్జిషీటులో కొన్ని అంశాలు

- ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రూ.10 లక్షల భారం..

- ల్యాండ్‌ , శాండ్‌, మైనింగ్‌, గంజాయి, డ్రగ్స్‌, ఎర్రచందనం, రేషన్‌ బియ్యంలో రూ.8 లక్షల కోట్లు కమీషన్‌ కాజేసారు.

- విషపూరిత మద్యంతో 35 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడుచేసి, 30 వేల మహిళల మాంగల్యాలను మంటగలిపారు.

- విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ, ఇసుక ధరలను విపరీతంగా పెంచేశారు.

Updated Date - Apr 27 , 2024 | 11:46 PM