Share News

తాగునీరు ఇస్తామన్నారు.. రహదారి నిర్మిస్తామన్నారు.. మాట తప్పారు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:44 AM

భీమవరం నియోజకవర్గంలో తీర గ్రామాలు, వీరవాసరం మండలంలో పలు గ్రామాల దప్పిక తీరుస్తామని హామీలు గుప్పించారు. యనమదుర్రు డ్రెయిన్‌పై కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెనలకు అప్రోచ్‌ రోడ్లు నిర్మిస్తామని గొప్పలు చెప్పారు.

తాగునీరు ఇస్తామన్నారు.. రహదారి నిర్మిస్తామన్నారు.. మాట తప్పారు
అప్రోచ్‌ రోడ్డు లేని యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెన

తీరంలో తాగునీటి తిప్పలు

యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెనకు మోక్షం లేదు

గ్రామాల్లో చెత్త సమస్య

భీమవరం నియోజకవర్గంలో తీర గ్రామాలు, వీరవాసరం మండలంలో పలు గ్రామాల దప్పిక తీరుస్తామని హామీలు గుప్పించారు. యనమదుర్రు డ్రెయిన్‌పై కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెనలకు అప్రోచ్‌ రోడ్లు నిర్మిస్తామని గొప్పలు చెప్పారు. చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఏ హామీ నెరవేరలేదు. డ్రెయినేజీల మురుగు, గ్రామాల్లో చెత్త సమస్యల కూడా పరిష్కారం కాలేదు. హామీలు నెరవేర్చని పాలకులు మరోసారి ఓటర్ల ముందుకు వస్తున్నారు.

(భీమవరం రూరల్‌, వీరవాసరం)

చేసిన పనులు లేకపోయినా ప్రభుత్వం అభివృద్ధిపై గొప్పలు చెబుతోంది. ఎంతో చేసేశామని ప్రజా ప్రతినిధుల హడావుడి.. తీరా నియోజకవర్గంలో తీర ప్రాంతం దాహంతో అలమటిస్తూ కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. స్వచ్ఛమైన తాగునీరందిస్తామన్న పాలకులు పత్తా లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీలు ఏమయ్యాయి. ఎన్నాళ్లీ తాగునీటి తిప్పలు అంటూ వాపోతున్నారు. వీరవాసరం మండల కేంద్రంలో సుమారు 20 వేల మంది జనాభా. గ్రామంలో నికి ప్రధాన సమస్య డ్రెయినేజీ. చెరువులు ఉన్నప్పటికీ సరైన తాగునీరు లేదు. దీనికితోడు గ్రామంలో టన్నుల కొద్దీ చెత్తా చెదారాన్ని వేయటానికి డంపింగ్‌ చేయటానికి స్థలం లేకరహదారి మార్జిన్‌వే వేసి పొగపెడుతున్నారు. గొంతేరు డ్రెయిన్‌ చేర్చి ఉన్న సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని సంపద కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రదాన రహదారికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో చెత్త సేకరణ వాహనాలు అక్కడికి వెళ్లడం లేదు. చెత్తను జాతీయ రహాదారి పక్కన గొంతేరు డ్రెయిన్‌ సమీపంలో ఉన్న సుమారు 45 సెంట్ల ప్రభుత్వ స్థలంలో వేస్తున్నారు. మండలంలో లక్షల వ్యయంతో నిర్మించిన సంపద కేంద్రాల లక్ష్యం నీరుగారింది. 23 గ్రామాలకు 18 గ్రామాలలో సంపద కేంద్రాలు ఏర్పాటయ్యాయి. లక్షల నిధులు నిరుపయోగం కాగా మత్స్యపురిలో సంపద కేంద్రం సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణానికి సిటింగ్‌ రూంగా మారింది. వీరవాసరం మండలం రాయకుదురులో తాగునీటి చెరువు ఆధునీకరణ, పంట కాలువ నుంచి చెరువు వరకూ ప్రత్యేక పైపులైన్‌కు రూ.40లక్షల అంచనా రూపొందించారు. ఐదేళ్లు గడిచి పోయాయి. తాగునీటి చెరువు వృథా చెరువే.

తీరుం గొంతెండుతోంది

భీమవరం మండలంలో తీరప్రాంత గ్రామాలైన లోసరి, దొంగపిండి, కొత్తపూసలమర్రు గ్రామాల్లో కలుషిత నీరే దిక్కు. ఆ నీరు తాగలేక ప్రైవేటు ప్లాంట్ల నుంచి నీరు కొనుగోలు చేసుకుంటున్నారు. లోసరి మెయిన్‌ కాలువ చెత్త తొలగింపు పనులు చేపట్టకపోవడం.. నీరు దిగువకు చేరలేని పరిస్థితి నెలకొంది. దీంతో లోసరి, దొంగపిండి, కొత్తపూసలమర్రు, గ్రామ మంచినీటి పథకాలు చెరువులు నింపాలంటే కష్టసాధ్యంగా మారింది. దానికితోడు పిల్టర్‌ బెడ్‌ల మరమతులకు నిధులు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. స్వచ్ఛమైన నీరు రాకవడం లేదు. ఇదంతా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వైఫల్యమేనని ప్రాంత ప్రజలు అంటున్నారు.

చెరువులున్నా.. సమస్యే..

వీరవాసరంలో తూర్పుచెరువు, ఎల్లమ్మచెరువు, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు పేరుతో పీర్లకోడు చెరువులు ఉన్నాయి. వీటి ద్వారా రెండు రక్షిత నీటి సరఫరా పఽథకాలు పనిచేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామం అంతటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీరు కొన్ని ప్రాంతాలకు శుద్ధి చేసే నీరు అందగా మరికొన్ని ప్రాంతాలకు మురుగునీరే సరఫరా అవుతుంది. తాగునీటి కోసం ప్రజలు ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్లపై ఆధారపడుతున్నారు. పంచాయతీ పరిధిలో నాందీ ఫౌండేషన్‌ ద్వారా తూర్పుచెరువు వద్ద ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీని నిర్వహాణ ప్రైవేట్‌కే అప్పగించారు. చినదళితపేటలో రావివారి చెరువు వద్ద సుజల పేరుతో 20 లీటర్ల నీరు తక్కువ దరకే సరఫరా చేసేలా పీతల హిట్లర్‌ ఫౌండేషన్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. దీనిని ఎప్పుడో మూతవేశారు. గ్రామంలో ఎక్కడికక్కడ వాటర్‌ ప్లాంట్‌లు ఏర్పాటుచేసి నిటి విక్రయాలు చేస్తున్నారు. పంచాయతీ పరంగా మాత్రం తాగునీరు సమస్యగానే మిగిలింది. ప్రతినిత్యం ఏడులక్షల లీటర్ల నీరు నీటి సరఫరా పధకాల ద్వారా పంపిణీ అవుతున్న గ్రామస్తుల దాహార్తి తీరడం లేదు. రాయకుదురు మంచినీటి చెరువుగట్టు పై 40 వేల లీటర్ల సామర్జ్యంతో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ఫిల్టర్‌ బెడ్లు ఉండేవి. మావుళ్లమ్మ ఆలయం సమీపంలో మరో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మించి బోర్‌ ద్వారా నీటిని అందిస్తున్నారు. చెరువుగట్టుపై ఒహెచ్‌ఎస్‌ఆర్‌ ఫిల్టర్‌బెడ్‌లను తొలగించారు. ఫిల్టర్‌బెడ్‌లోని నీరు శుద్ధి కాకపోవడంతో బోరు నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. సమీపంలో రొయ్యల సాగుతో చెరువు నీరు కలుషితమవుతోంది.

మాట ఇచ్చారు.. ఫలితం లేదు

మాట ఇచ్చారు కానీ ఫలితం లేదు. అంచనా వేయాలన్నారు.. నిధులు వచ్చాయన్నారు.. టెండర్‌ వేసిన ఎవరూ రాలేదంటున్నారు.. యనమదుర్రు డ్రైయిన్‌పై వంతెనలకు అప్రోచ్‌ రోడ్డు పరిస్థితి ఇది. రహదారిని నిర్మాణానికి ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీ గాలికొదిలేశారు. ఇప్పుటికి రహదారులు ఏర్పాటు లేకపోవడం వంతెనలు నిరుపయోగంగా ఉన్నాయి. అప్పట్లో యనమదుర్రు డ్రైయిన్‌పై తోకతిప్ప, గొల్లవానితిప్ప, పట్టణ పరిధిలోను మూడు చోట్ల ఒక్కొ వంతెన రూ.4.5 కోట్లుతో నిర్మాణం చేపట్టారు. దాదాపు ఆరేళ్లు దాటుతున్నా వంతెనలకు ఇరువైపులా రహదారులు లేవు. రెండు వంతెనలకు గ్రామస్తులే ర్యాంపులు వేసుకుని నడవడం రెండు చక్రాల వాహన ప్రయాణం సాగిస్తున్నారు. ఒక వంతెన శిథిలావస్ధకు చేరిన వంతెనలా మారింది. ఈ ప్రభుత్వం హాయంలో ఇరువైపులా రహదారులకు రూ.36 కోట్లు మంజూరు చేసింది. అలా వచ్చి ఏడాది అయిన టెండర్లు పిలవడం ఎవరూ ముందుకు రాలేదనడంతో పనులు ప్రారంభంకాని వంతెనలుగా మారాయి. ఇదంతా ప్రభుత్వం లోపమేనని నిర్వాసితులు నుంచి మాటలు వినిపిస్తున్నాయి.

సీసీ డ్రెయిన్లు..?

వీరవాసరంలో డ్రెయినేజీ సమస్యను తీర్చడానికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. దీనికోసం రూ 14.10 కోట్లు అంచనా విలువతో ఉపాదిహామీ పధకం నుండి నిధులు మంజూరు చేయించారు. 2019 డిసెంబరులో అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. డ్రెయిన్లను నిర్మించి, వాటిని మేజర్‌ డ్రెయిన్‌ గొంతేరు లో కలిపేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. గ్రామీణ నీటిసరఫరా, పారిఽశుధ్యశాఖ డ్రెయినేజీ నిర్మాణాలను చేపట్టింది. గ్రామంలో మొత్తం 47 డ్రెయినేజీలను నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. 2020లో కరోనా కారణంగా నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. అనంతరం నిధులు మురిగిపోయాయి. ఎమ్మేల్యే ఇచ్చిన హామీ పరిష్కారం కాకుండా నిలిచిపోయింది. దీనిని ముందుకు తీసుకువెళ్ళేందుకు తదుపరి చర్యలు లేకపోవటంతో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ప్రధాన డ్రయిన్‌ నిర్మాణం లేకుండా పలు వీధుల్లో ఇటీవల డ్రయినేజీ నిర్మాణాలు చేపట్టారు. ఈ నీరు త్రాగునీటి వనరుల ఉతీసుకువళ్ళే పీర్లకోడు ఛానల్‌లో కలుస్తుందని గ్రామస్తులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు.

Updated Date - Apr 20 , 2024 | 12:45 AM