Share News

NRI: ప్రవాసీయుల సంక్షేమ విధానానికి తెలంగాణ ప్రభుత్వం తుదిమెరుగులు

ABN , Publish Date - Apr 16 , 2024 | 08:16 PM

గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో పని చేస్తున్న తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి ఒక ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పడానికి తమ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు.

NRI: ప్రవాసీయుల సంక్షేమ విధానానికి తెలంగాణ ప్రభుత్వం తుదిమెరుగులు
Telangana NRI Welfare policy

  • గల్ఫ్ ప్రవాసీయులతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

  • దశాబ్దకాలం తరువాత నెరవేరనున్న ప్రవాసీయుల కల

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో ని చేస్తున్న తెలంగాణ ప్రవాసీయుల (NRI) సంక్షేమానికి ఒక ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పడానికి తమ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు.

మంగళవారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో గల్ఫ్ ప్రవాసీ ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రవాసం అనేది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని వ్యవహారమని పెర్కొన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో విదేశీ మంత్రిత్వ శాఖ వ్యవహారాలను ఎనిమిదేళ్ళ పాటు పరిశీలించిన శేషాద్రి అనే సీనియర్ అధికారి ప్రస్తుతం తన కార్యాలయంలో సేవలందిస్తున్నారని, ప్రవాసీ సంక్షేమ విధానానికి సంబంధించి ఆయన విధివిధానాలను రూపొందిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.

ఫిలిప్పీన్స్ దేశం, కేరళ రాష్ట్రంలో అమలులో ఉన్న ప్రవాసీ సంక్షేమ విధానాన్ని అధ్యయనం చేసి ఒక ముసాయిదాను రూపొందించామని, వాటిని ప్రవాసీయులతో చర్చించి తుది విధానాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రవాసీ సంక్షేమానికి సంబంధించి విధివిధానాలను రూపొందించడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తామే ప్రవాసీయులను అతిథులుగా పిలుస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక సీనియర్ ఐఏయస్ అధికారి ఆధ్వర్యంలో ప్రజాభవన్‌లో ప్రవాసీయులకు సహాయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17 లోపు దీన్ని ఏర్పాటు చేస్తామని కూడా ముఖ్యమంత్రి అన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు.


విదేశాలలో మరణించిన వారికి అయిదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించే విధంగా ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించామని, అదే విధంగా న్యాయ సహాయం చేసే దిశగా కూడా ప్రణాళిక రూపొందిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. గమ్య దేశాలకు పత్యేకించి గల్ఫ్ దేశాలకు వెళ్ళక ముందు వారికి వారం రోజుల పాటు పునశ్చరణ తరగతుల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. స్వదేశంలో స్థిరాస్తులను కొనుగోలు చేసి కొంత మంది ప్రవాసీయులు మోసపోతున్నట్లుగా తాము గమనించామని, దీన్ని అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

3.jpgఉత్తర తెలంగాణ జాతీయ స్రవంతిలో గల్ఫ్ ప్రవాసం కీలకమైన అంశమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానికంగా ఉపాధి లభించినా, లభించకున్నా మెరుగైన జీవన ప్రమాణాల కోసం గల్ఫ్ దేశాలకు ఉపాధి వలసలకు వెళ్తున్నారని అన్నారు.

బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అంటూ తెలంగాణ ఉద్యమంలో నినదించిన ఉద్యమ సారథి పదేళ్ళుగా ఒక్కసారి కూడా ప్రవాసీయులపై కన్నెత్తి చూడకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది.


గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ నుండి టి.జీవన్ రెడ్డిని లోక్‌సభకు పంపించవల్సిందిగా ముఖ్యమంత్రి ప్రవాసీయులకు విజ్ఞప్తి చేసారు.

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్ధి టి. జీవన్ రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ ప్రవాసీ ప్రముఖుడు, మాజీ ఎమ్మెల్యే ఈరబత్తిని అనిల్‌తో పాటు గల్ఫ్ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు సమస్యలను వివరించారు.

సమావేశానికి మంద భీంరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించగా కృష్ణ ధోనికెని, వంశీ గౌడ్, గుండేళ్ళ నర్సింహా, గుగిళ్ళ రవి గౌడ్, గణేశ్, మీర్ ఆయూబ్ అలీ ఖాన్, గడ్డం హరిక, కోటపాటి నర్సింహానాయుడు, చింతలటన ప్రవీణ్ తదితరులు మాట్లాడారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఖతర్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఖర్జూరపు పళ్ళను ఖతర్‌లోని తెలంగాణ ప్రవాసీ సంఘం నాయకుడు ఖాజా నిజామొద్దీన్ అందజేశారు.

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 08:26 PM