Viral: అయ్యో.. డెలివరీ ఏజెంట్లు ఇంత శ్రమ పడతారా? జనాల్ని కదిలిస్తున్న వీడియో
ABN , Publish Date - Aug 24 , 2024 | 08:57 PM
డెలివరీ ఏజెంట్ల కష్టాన్ని మనసులు కదలించేలా చూపించిన ఓ యూట్యూబర్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డెలివరీ ఏజెంట్ల కష్టం చూసి చలించిపోయిన అనేక మంది వారికి కచ్చితంగా టిప్ ఇవ్వాలని తీర్మానించారు.
ఇంటర్నెట్ డెస్క్: జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి యాప్‌లు అందుబాటులోకి వచ్చాక నగర జీవితం మరింత సౌకర్యవంతంగా మారిపోయింది. కాలుకదపకుండా ఇంట్లో కూర్చునే కావాల్సినవి ఆర్డరిచ్చి తెప్పిచ్చుకునేందుకు నగర జీవులు అలవాటు పడిపోయారు. అయితే, ఈ సౌకర్యం వెనక డెలివరీ ఏజెంట్ల రెక్కల కష్టం దాగుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఎలాంటి సమయంలోనైనా ఆర్డర్లను కస్టమర్లకు చేరవేసే డెలివరీ ఏజెంట్ల కష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడో కంటెంట్ క్రియేటర్. అతడు నెట్టింట పంచుకున్న వీడియో (Viral) ప్రస్తుతం సంచలనంగా మారింది.
Viral: ఏ పనీ చేయకుండా రూ.3 కోట్ల జీతం తీసుకున్నా: అమెజాన్ ఉన్నతోద్యోగి
న్యూఢిల్లీకి చెందిన ఈ కంటెంట్ క్రియేటర్ ఒక రోజు పాటు జొమాటో డెలివరీ ఏజెంట్‌గా పనిచేశాడు. తొలిసారి అతడికి తానున్న ప్రదేశం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెస్టారెంట్‌లో ఫుడ్ పికప్ చేసుకోమని ఆర్డర్ లభించింది. అక్కడ ఫుడ్ పికప్ చేసుకున్నాక 650 మీటర్ల దూరంలో ఉన్న కస్టమర్‌కు ఆర్డర్ డెలివరీ చేయాలన్న మరో నోటిఫికేషన్ వచ్చింది. చెప్పినట్టే చేసిన అతడికి ఆర్డర్ పూర్తయ్యాక కేవలం రూ.20 లభించింది. ఈ ఉదంతాన్ని షేర్ చేసిన అతడు.. డెలివరీ ఏజెంట్లు రూ.20 సంపాదించేందుకు అరగంట కష్టపడాలని కామెంట్ చేశాడు (Delhi man turns Zomato delivery agent for a day shows how he earned Rs 20. Video).
ఈ వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. డెలివరీ ఏజెంట్ల కష్టం అనేక మందిని కదిలించింది. వారికి టిప్స్ ఇస్తూ గౌరవించుకోవాలని కొందరు కామెంట్ చేశారు. వారితో మానవత్వంతో వ్యవహరించాలని అన్నారు. కొందరు మాత్రం కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారని అన్నారు. యాప్‌ల వెనుకున్న టెకీలకు కోట్లు చెల్లిస్తూ డెలివరీ ఏజెంట్లకు మాత్రం ఇంత తక్కువ చెల్లించడం అన్యాయమని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.