Share News

LSG vs RR: కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

ABN , Publish Date - Apr 27 , 2024 | 09:30 PM

లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (76) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించడం..

LSG vs RR: కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (76) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించడం, దీపక్ హుడా (50) అర్థశతకంతో మెరుపులు మెరిపించడంతో.. లక్నో అంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో బదోనీ (18), కృనాల్ పాండ్యా (15) సైతం తమవంతు సహకారం అందించారు.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకి మొదట్లో భారీ ఎదురుదెబ్బలే తగిలాయి. 8 పరుగుల వద్ద డికాక్ ఔట్ అవ్వగా.. గత మ్యాచ్‌లో సెంచరీతో శివాలెత్తిన మార్కస్ స్టోయినిస్ డకౌట్‌గా వెనుదిరిగాడు. వీళ్లిద్దరు వెనువెంటనే ఔట్ అవ్వడంతో.. లక్నో జట్టుపై ఒత్తిడి పెరిగింది. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్, దీపక్ హుడా కలిసి తమ జట్టుని ఆదుకున్నారు. వెంటనే మరో వికెట్ పడే అవకాశం ఇవ్వకుండా.. ఇద్దరు అడ్డగోడలా నిలబడిపోయారు. ఓవైపు ఆచితూచి ఆడుతూనే, మరోవైపు వీలు దొరికినప్పుడల్లా భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించారు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కి 115 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ తమతమ అర్థశతకాలు కంప్లీట్ చేసుకున్నారు.

వాళ్లిద్దరు క్రీజులో పాతుకుపోవడం చూసి.. చివరివరకూ ఇన్నింగ్స్ ఆడుతారని భావించారు. కానీ.. ఇంతలోనే దీపక్ హుడా భారీ షాట్‌కి ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో శతక్కొడతాడని భావిస్తే, 76 వ్యక్తిగత పరుగుల వద్ద అతడు అనుకోకుండా ఔట్ అయ్యాడు. ఇతర బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా.. తమవంతు పరుగులు చేసి, జట్టుకి భారీ స్కోరుని అందించడంలో సహాయం చేశారు. రాజస్థాన్ ముందు 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంలో తమవంతు పాత్ర పోషించారు. మరి.. ఇంత భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు ఛేధిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Updated Date - Apr 27 , 2024 | 09:30 PM