Share News

రోడ్డును ఆక్రమించిన షెడ్ల కూల్చివేత

ABN , Publish Date - Apr 23 , 2024 | 10:55 PM

జిల్లా కేంద్రంలో రహదారుల ఆక్రమణల తొలగింపు ప్రక్రియపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యా దులు వచ్చినప్పుడో, రాజకీయ ఒత్తిళ్లతోనో షెడ్లను కూల్చివేయడం, ఆ తరువాత విస్మరించడం మున్సిపల్‌ అధికారులకు అలవాటుగా మారింది.

రోడ్డును ఆక్రమించిన షెడ్ల కూల్చివేత

మంచిర్యాల, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో రహదారుల ఆక్రమణల తొలగింపు ప్రక్రియపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యా దులు వచ్చినప్పుడో, రాజకీయ ఒత్తిళ్లతోనో షెడ్లను కూల్చివేయడం, ఆ తరువాత విస్మరించడం మున్సిపల్‌ అధికారులకు అలవాటుగా మారింది. కొన్నేళ్ళుగా ఈ తంతు జరుగుతుండగా అధికారుల అలసత్వం కారణంగా పట్టణంలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు యేటా పుట్టుకొస్తు న్నాయి. పట్టణంలో రోడ్ల పక్కన వెలిసిన టేలాలు, ఇతర ఆక్రమణల వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు, ఇతర నాయకుల ప్రమేయం ఉన్నదనే విషయం జగమెరిగిన సత్యం.

రూ. 20వేల వరకు కిరాయి వసూలు

పట్టణంలోని ప్రధాన రహదారుల పక్కన ఎక్కడ ఖాళీ జాగా ఉన్నా అక్కడ షెడ్లు ఏర్పాటు చేసి వాటిని చిరు వ్యాపారులకు అద్దెకు ఇవ్వడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఒక్కో ఆక్రమణకు నెలకు రూ.10 వేల నుం చి రూ.20వేల వరకు కిరాయిలు వసూలు చేస్తున్నారు. పాన్‌ టేలాలు, జ్యూస్‌ సెంటర్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు జిల్లా కేంద్రంలోని అర్చన టెక్స్‌ చౌరస్తా, రైల్వే స్టేషన్‌ రోడ్డు, షిరిడీ సాయిబాబా రోడ్డులో డ్రైనేజీపై, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, ప్రభుత్వ ఐటీఐ కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రహరీలను ఆనుకొని పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రముఖ షాపింగ్‌ మాల్స్‌ ముందు కూడా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తూ షెడ్లను నిర్మించి కిరాయికి ఇస్తూ వేలల్లో వసూలు చేస్తున్నారు. దీంతో రోడ్లు ఇరుకుగా మారి, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. అయితే ఆయా నిర్మాణాల వల్ల చిరు వ్యాపారులకు ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశ్యంతో అధికారులు తొలగించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీనిని అలుసుగా తీసుకుంటూ రోజురోజుకూ కొత్త టేలాలను నాయకుల అండదండలతో ఏర్పాటు చేస్తూ వేలల్లో కిరాయిలు గుంజుతున్నా అడిగేవారు లేరు. మున్సిపాలిటీకి ఎలాంటి పన్ను చెల్లించకుండా నాయకులు టేలాలు ఏర్పాటు చేస్తుండగా కిరాయి రూపంలో చిరు వ్యాపారులకు విపరీతమైన భారం పడుతోంది.

కూల్చివేయడంలో పక్షపాత ధోరణి

మున్సిపాలిటీ పరిధిలోని రహదారి ఆక్రమణలపై అధికారులు కొరఢా ఝళిపిస్తున్నారు. ఇందులో పక్షపాత ధోరణి అవలంభిస్తుండటంతో విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంగబలం లేని వ్యక్తుల ఆక్రమణలను తొలగించడంలో ఉత్సాహం కనబరుస్తున్న అధికారులు, నాయకులు, ఇతర ప్రముఖుల వ్యక్తుల జోలికి వెళ్లడం లేదు. తాజాగా మంగళవారం అర్చన టెక్స్‌ చౌరస్తాలో ఓ వ్యాపారికి చెందిన ఆక్రమణ తొలగించడంలోనూ పక్షపాత ధోరణి అవలంభించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే ఉద్దేశ్యంతో ఆక్రమణలను తొలగించిన అధికారులు, వాటిని ఆనుకొని పక్కనే ఉన్న ప్రముఖ వ్యాపారికి చెందిన నిర్మాణాలను ముట్టుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా పక్క పక్కనే ఉన్న ఆక్రమణల్లో కేవలం ఒకదానినే తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. రహదారి ఆక్రమణలకు ఎవరు పాల్పడినా చట్ట విరుద్ధమే అయినప్పటికీ కొందరిపైనే ప్రతాపం చూపడంలో అధికారులు ఉత్సాహం కనబర్చడం విమర్శలకు దారి తీస్తోంది.

ఆక్రమణలన్నింటినీ తొలగిస్తాం

మారుతీ ప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌

మున్సిపాలిటీ పరిధిలో రహదారులను ఆక్రమిస్తూ వెలిసిన నిర్మాణా లను ఎలాంటి వివక్ష లేకుండా తొలగిస్తాం. అర్చన టెక్స్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ అంతరాయం కలుగుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే షెడ్లను కూల్చివేశాం. షెడ్లను తొలగించాలని ముందస్తుగా నోటీసులు ఇచ్చిన తరువాతనే చర్యలు చేపడుతున్నాం. మిగతా కొన్ని చోట్ల కూడా నోటీసులు జారీ చేశాం. త్వరలో మిగిలిన వాటికి కూడా నోటీసులు జారీ చేసి, స్పందన లేనిపక్షంలో తొలగిస్తాం.

Updated Date - Apr 23 , 2024 | 10:55 PM