Share News

Kumaram Bheem Asifabad: వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:09 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 24: వానకాలం సాగు ప్రణాళిక ఖరారైంది. జూన్‌ మొదటి వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలుపడంతో అన్నదాతలు వానాకాలం పంట కోసం సన్నద్దమవుతున్నారు.

 Kumaram Bheem Asifabad: వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు

- 4,60,196ఎకరాల్లో పంటల సాగుకు అంచనా

- ఏడు లక్షల పత్తివిత్తనాల ప్యాకెట్ల అవసరం

- వాణిజ్య పంటల వైపే రైతుల మొగ్గు

- 85.91మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమంటున్న అధికారులు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 24: వానకాలం సాగు ప్రణాళిక ఖరారైంది. జూన్‌ మొదటి వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలుపడంతో అన్నదాతలు వానాకాలం పంట కోసం సన్నద్దమవుతున్నారు. దుక్కులు దున్నడం సేంద్రియ ఎరువులను పంటచేలలో వేయడం వంటి పనులు ప్రారంభించారు. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా వానకాలం సాగు ప్రణాళికలను ఖరారు చేసింది. దీంతో వ్యవసాయాధికారులు పంటసాగుపై అంచనాలు రూపొందించారు. ఈ ఏడాది సాధారణానికి మించి పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారుల లెక్కలు వేశారు. ఈ వానాకాలం సీజన్‌లో 4,60,196ఎకరాల్లో అన్నిరకాల పంటలు సాగవుతాయని అంచనాలు వేసిన అధికారులు ఈ మేరకు 7లక్షల పత్తివిత్తన ప్యాకెట్లు, 85.91 మెట్రిక్‌టన్నుల ఎరువులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపారు.

జిల్లాలో 4,60,196 ఎకరాల్లో పంటల సాగు..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 4,60,196ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనాలు వేశారు. సాధారణ సాగుకు మించి పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాలో ఈ మేరకు అంచనాలు వేసిన అధికారులు పంటల సాగుపై గ్రామాల వారీగా పట్టికలు రూపొందించారు. జిల్లాలో సాధా రణ సాగు విస్తీర్ణం కంటే పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. అయితే వీటిలో పత్తి 3.5లక్షల ఎకరాలు, వరి పంట 59,212ఎకరాలు సాగవుతుందని అధికారులు అంచనాలు వేశారు. మొక్కజొన్న 742ఎకరాలు, జొన్న 680ఎకరాలు, పెసర 1700ఎకరాలు, మినుములు 163ఎకరాలు, కంది 38,239ఎకరాలు సాగవుతున్నట్లు అంచనాలు రూపొందించారు. అలాగే సోయాబీన్‌ 6089ఎకరాలు, మిరప 3173ఎకరాలు, వేరుశెనగ 178ఎకరాలు, అముదాలు 10ఎకరాలు, నువ్వులు 10ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనాలు రూపొందించారు.

7లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో పంట సాగుకు అంచనాలు వేసిన అధికారులు విత్తనాల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాలో అరకొర సాగునీటి వసతితో రైతులు అధికంగా వర్షాధార పత్తి పంట వైపే ఆధారపడుతున్నారు. ఈఏడాది వానాకాలం సైతం అధికంగా పత్తిసాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం 4,60,196ఎకరాల్లో ఉండగా ఇందులో మూడో వంతు పత్తిని సాగు చేయనున్నట్లు అధికారులు అంచనాలు వేశారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఉన్న ప్రాజెక్టుల కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో వర్షాధార పంటలనే రైతులు ఆశ్ర యిస్తున్నారు. దీంతో జిల్లాలోమొత్తం విస్తీర్ణంలో అగ్రభాగం పత్తి సాగునే చేపడుతున్నారు. జిల్లాలో పత్తి పంట 3.5లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు రూపొందించి నివేదికలు పంపించారు. ఇందుకుగాను వానాకాలం సీజన్‌లో ఆయా ప్రైవేటు కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచ నున్నారు. జిల్లాలో 7లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు.

85.91 మెట్రిక్‌ టన్నుల ఎరువులకు ప్రతిపాదనలు..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో సాధారణ సాగుకు మించి పంటలు సాగవుతాయని అంచనాలు రూపొందించిన అధికారులు 85.91 మెట్రిక్‌ టన్నుల ఎరువులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. యూరియా 45.06మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 11.26మెట్రిక్‌ టన్నులు, ఎంఓపీ 4.05మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 22.53మెట్రిక్‌ టన్నులు, అలాగే జిల్లాకు కావాల్సిన ఇతర ఎరువులు మూడు మెట్రిక్‌ టన్నులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపారు.

వానాకాలం సాగుకు అంచనాలు రూపొందించాం..

- రావూరి శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయాధికారి

వానాకాలం సాగుకు జిల్లాలో అంచనాలు రూపొందించాం. జిల్లాలో 4.60లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు నివేది కలను రుపొందించాం. ఇందుకు ఇప్పటికే అన్ని మండల వ్యవసాయాధి కారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాం. మండలాల వారీగా ప్రతి పాదనలు తెప్పించుకుని దానికి అనుగుణంగానే ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం.

Updated Date - Apr 24 , 2024 | 11:09 PM