Share News

Kumaram Bheem Asifabad: కౌలు రైతులకు దిక్కెవరు?

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:14 PM

వారంతా భూమి పుత్రులు. ఎలాంటి భూమి లేని కారణంగా మట్టిని నమ్ముకొని భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వారికి తెలిసిన పని ఒక్కటే. అదే వ్యవసాయం.

Kumaram Bheem Asifabad: కౌలు రైతులకు దిక్కెవరు?

- చుక్కలనంటుతున్న కౌలు ధరలు

- ఏటేటా పెరుగుతున్న పెట్టుబడులు

- 50రోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం

వారంతా భూమి పుత్రులు. ఎలాంటి భూమి లేని కారణంగా మట్టిని నమ్ముకొని భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వారికి తెలిసిన పని ఒక్కటే. అదే వ్యవసాయం. వారికున్న కొద్దో గొప్పో భూమితోపాటు మరికొంత భూమిని కౌలు తీసుకొని సాగు చేస్తు న్నారు. ప్రకృతి కరుణించి, గిట్టుబాటు ధర బాగుంటే నాలుగు రాళ్లు సంపాదించుకుంటారు. కానీ నాలుగైదు ఏళ్లుగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. - బెజ్జూరు

మరో 50రోజుల్లో వానాకాలం సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి భూములను కౌలుకు తీసుకునేందుకు సిద్ధమవుతు న్నారు. అయితే కౌలు వ్యవసాయం వారిని కన్నీరు పెట్టిస్తోంది. భూ యజమానులు కౌలు ధరలను అమాంతం పెంచడం, విత్తన, ఎరువుల ధరలు, కూలీల రేట్లు పెరిగిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పెట్టుబడి సాయం అందకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు.

పత్తి, వరి పంట సాగే అధికం.....

జిల్లాలో రైతులు అధికంగా పత్తి, వరి పంటలనే సాగు చేస్తారు. జిల్లాలో పెద్దగా సాగు నీటిప్రాజెక్టులు లేనికారణంగా వర్షాధారంపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాది 3.50లక్షల ఎకరాల్లో పత్తి, 55వేల ఎకరాల్లో వరి పంటలు సాగు చేశారు. జిల్లాలో సుమారుగా 20వేల మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. వీరంతా అధికంగా పత్తి సాగు చేస్తారు. జిల్లాలో నాలుగైదు ఏళ్లుగా ప్రకృతి వైపరిత్యాల కారణంగా దిగుబడి రాక నష్టాలను చవిచూస్తున్నారు. ఒక ఏడాది అతివృష్టితో నష్టపోతే, మరో ఏడాది అనావృష్టితో నష్టపోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. తొలకరి వానలతో పంటలు విత్తుకున్నా పూత, కాతకు వచ్చే సమయంలో వర్షాలు మొహం చాటేస్తుండటంతో పెట్టుబడి సైతం రాక అప్పులపాలవుతున్నారు. జిల్లాలో సిర్పూర్‌ నియోజకవర్గంలోని బెజ్జూరు, కౌటాల, చింతలమానేపల్లి, సిర్పూర్‌(టి) మండలాల పరిధిలో ప్రాణహిత, పెన్‌గంగ ప్రవహిస్తుండటంతో ప్రతీ ఏటా వర్షాకాలంలో వరదల కారణంగా పంటలన్నీ నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్ల్లాలో ప్రాణహిత వరదల కారణంగా ప్రతిఏటా దాదాపు 3వేల ఎకరాలకు పైగా పత్తి, 500ఎకరాల్లో వరి పంటలు నీటమునిగి నష్టపోతున్నారు. అయినా వీరికి ప్రభుత్వం ఎలాంటి వరదసాయం చేయకపోవటంతో తీవ్రంగా నష్టపోయారు.

ముందస్తు చెల్లింపులు..

జిల్లాలో కౌలు ఎకరానికి 10నుంచి 15 వేల వరకు పలుకుతోంది. భూమిని బట్టి రైతులు కౌలు చెల్లిస్తున్నారు. జిల్లాలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులేమీ లేని కారణంగా వర్షాధారంపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. వర్షాధారంగా పంటలు పండించే భూములకు ఎకరాకు 10నుంచి 15వేల వరకు చెల్లిస్తున్నారు. పంటల దిగుబడితో సంబంధం లేకుండా కౌలును చెలిం్లచాల్సిన పరిస్థితి ఉండటం, పంటలకు మద్దతు ధర లేకపోవడం వంటి ఇబ్బందులతో కౌలు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పెట్టిన పెట్టుబడులు సైతం రాక అప్పుల పాలవుతున్నారు. మరో 50రోజుల్లో వానాకాలం పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాగు ఖర్చు కోసం కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకొని సాగుచేస్తున్నా కనీసం పెట్టుబడులు సైతం రాని పరిస్థితులు నెలకొన్నాయి. పంట దిగుబడి రాకున్నా వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న డబ్బులను మాత్రం ఎలాగైనా చెల్లించాల్సిందే. ఇక కౌలుకు భూములు తీసుకునే రైతులు ముందస్తుగానే ఏప్రిల్‌, మే మాసాల్లోనే భూములను కౌలుకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్ప టికే కౌలు ధరలు పెరగడం, ఆశించినస్థాయిలో పంటలు దిగుబడి రాని కారణంగా కొందరు రైతులు కౌలుకు భూములు తీసుకోవాలంటేనే భయ పడుతున్నారు.

వర్తించని ప్రభుత్వ పథకాలు..

కౌలు రైతులకు ఎక్కడా అధికారిక గుర్తింపు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి వీరు అనర్హులుగా మిగిలిపోతున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంఽధు, రైతుబీమా వంటి పథకాలు వారు పొందలేకపోయారు. 2018లో అప్పటి ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించి ఎకరాకు రూ.5వేల చొప్పున సంవత్సరానికి రూ.10వేల పెట్టుబడి సాయం అందించింది. ఇక రైతు ఏ కారణంతోనైనా చనిపోయినా రైతులకు బీమా కింద రూ.5లక్షలు అంద జేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా కిసాన్‌ పథకం ద్వారా పెట్టుబడి సాయంగా రూ.6వేలు అందజేస్తోంది. కనీసం బ్యాంకు నుంచి రుణాలు పొందుదామన్నా కూడా పొందలేని పరిస్థితిలో కౌలు రైతులు ఉన్నారు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీకీ రుణాలు తెచ్చుకొని వ్యవ సాయం చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేసి వారిని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో కౌలు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో కౌలు రైతులు కూడా తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

పంట రాకున్నా కౌలు ఇవ్వాల్సిందే..

- నైతం అంజయ్య, రైతు ఇప్పలగూడ

భూములను కౌలుకు తీసుకొని కొన్నేళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్నా. కౌలు భూమిలో పంటలు సాగు చేసి పంట దిగుబడి వచ్చినా రాకున్నా కౌలు చెల్లించాల్సిందే. లేదంటే గ్రామాల్లో కౌలు భూములు ఎక్కడా కూడా దొరకవు. కౌలుతో పాటు సాగు పెట్టుబడి ధరలు కూడా అమాంతం పెరిగి పోవడంతో వ్యవసాయం చేయడం కష్టతరంగా మారింది. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకొని అన్ని రకాల పథకాలు వర్తింపజేయాలి.

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేయాలి..

- సెండె శంకర్‌, రైతు చిన్నసిద్దాపూర్‌

భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలి. రైతులకు అందజేస్తున్న పథకాల మాది రిగానే కౌలు రైతులకు కూడా అన్నిరకాల పథకాలు అమలు చేస్తూ బ్యాం కుల్లో రుణాలు ఇవ్వాలి. కౌలు చేస్తున్న రైతులకు ఎకరాకు రూ.15వేలు రైతు బంధు ఇవ్వాలి.

Updated Date - Apr 27 , 2024 | 11:14 PM