Share News

కంబోడియా కేంద్రంగా సైబర్‌ మోసాలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:14 AM

కంబోడియా కేంద్రంగా చైనీస్‌ కంపెనీ పేరిట సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా వ్యవహారాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇద్దరు ఏజెంట్ల అరెస్ట్‌ చేసి మరో ఇద్దరికి లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

కంబోడియా కేంద్రంగా సైబర్‌ మోసాలు
మాట్లాడుతున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

- వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

సిరిసిల్ల క్రైం, ఏప్రిల్‌ 27: కంబోడియా కేంద్రంగా చైనీస్‌ కంపెనీ పేరిట సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా వ్యవహారాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇద్దరు ఏజెంట్ల అరెస్ట్‌ చేసి మరో ఇద్దరికి లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరుకు చెందిన అతికం లక్ష్మి తన కుమారుడు శివప్రసాద్‌ను గల్ఫ్‌ పంపేందుకు జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన కంచర్ల సాయిప్రసాద్‌ అనే ఏజెంట్‌ను కలిసింది. ఇందుకోసం రూ.1.40 లక్షలు ఇచ్చింది. ఏడాది క్రితం శివప్రసాద్‌ను కంబోడియా పంపించిన ఏజెంట్‌ సైబర్‌ మోసాలకు పాల్పడే కాల్‌సెంటర్‌లో పని ఇప్పించాడు. ఇండియాకు చెందిన ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేసి సైబర్‌ మోసం చేయమంటూ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని శివప్రసాద్‌ తన తల్లి ద్వారా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చాడు. లక్ష్మి ఫిర్యాదుతో సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. చైనీస్‌కు చెందిన కంపెనీలో శివప్రసాద్‌ పాస్‌పోర్ట్‌ తీసుకున్నట్లు, సైబర్‌ నేరాలు చేయిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతడితోపాటు ఇండియాకు చెందిన 600 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. కంబోడియాలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి వీరందరికి ఇండియన్‌ ఫోన్‌ నంబర్లు ఇస్తున్నారని, లాటరీ ఫ్రాడ్‌, జాబ్‌ ఫ్రాడ్‌, టాస్క్‌ల పేరిట సైబర్‌ మోసాలు చేయిస్తున్నారని తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే కంబోడియాలో ఉన్న ఇండియన్‌ ఎంబస్సీ అధికారులతో మాట్లాడినట్లు, బాధితుడి వివరాలు పంపించి అక్కడి పోలీసుల సహాయంతో రెస్క్యూ చేసి శివప్రసాద్‌ను కాపాడినట్లు ఎస్పీ చెప్పారు. శివప్రసాద్‌ రెండు రోజుల్లో సిరిసిల్లకు చేరుకుంటాడని, మిగతా బాధితులను ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేశామని ఎస్పీ వివరించారు.

ఫ ఇద్దరు ఏజెంట్ల అరెస్ట్‌, మరో ఇద్దరికి లుకౌట్‌ నోటీసులు

ఉపాధి పేరిట సైబర్‌ మోసాలకు పాల్పడే కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం పెట్టించి మోసం చేసిన ఏజెంట్లు జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామానికి చెందిన కంచర్ల సాయిప్రసాద్‌, మహారాష్ట్రలోని పూణేకు చెందిన అబిద్‌ అన్సరీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు ఏజెంట్లకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

ఫ కమీషన్‌ల కోసం ఏజెంట్ల దందా

కమీషన్‌ల కోసం ఏజెంట్లు దందాకు పాల్పడుతున్నట్లు తేలింది. కంబోడియా ఏజెంట్‌గా పని చేసిన సాయిప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. బాధితుడి ఇచ్చి మొత్తంలో సాయిప్రసాద్‌ రూ.10వేల కమీషన్‌ తీసుకొని లక్నోకి చెందిన సదాకత్‌ అనే వ్యక్తికి పంపిస్తాడు. ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఉంటున్న సదాకత్‌ రూ.10వేల కమీషన్‌ తీసుకొని పూణేకు చెందిన అబిద్‌ అన్సరీకి పంపిస్తాడు. అతను దుబాయ్‌లో ఉంటున్న బీహార్‌కు చెందిన షాదబ్‌ అనే వ్యక్తికి మిగిలిన మొత్తంతోపాటు, పాస్‌పోర్టు పంపిస్తే కంబోడియా దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తాడని విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ చెప్పారు. దీంతో కంచర్ల సాయిప్రసాద్‌, అబిద్‌ అన్సరీ అనే ఏజెంట్లను అరెస్ట్‌ చేశామని, సాయిప్రసాద్‌ను కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. అబిద్‌ అన్సరీకి నోటీసులు ఇచ్చి పంపామని, పరారీలో ఉన్న మిగతా ఇద్దరు ఏజెంట్లకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. గల్ఫ్‌ ఉద్యోగాల పేరిట ఏజెంట్ల చేతిలో మోసపోతే వెంటనే 8712656411కు ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, టౌన్‌ సీఐ రఘుపతి, టాస్క్‌ ఫోర్స్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:14 AM