Share News

‘పొన్నం’ తిట్లను దీవెనలుగా భావిస్తా

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:19 AM

మంత్రి పొన్నం ప్రభాకర్‌ తిట్లను దీవెనలుగా భావిస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ, బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం బోయినపల్లిలో నిర్వహించిన బీజేపీ పన్నా ప్రముఖుల సమావేశంలో మాట్లాడారు.

‘పొన్నం’ తిట్లను దీవెనలుగా భావిస్తా
బోయినపల్లిలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

బోయినపల్లి, ఏప్రిల్‌ 27: మంత్రి పొన్నం ప్రభాకర్‌ తిట్లను దీవెనలుగా భావిస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ, బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం బోయినపల్లిలో నిర్వహించిన బీజేపీ పన్నా ప్రముఖుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం తనను వెధవ అంటూ తిడుతున్నారన్నారు. పొన్నం తనను వెధవ అంటే తన దృష్టిలో ‘వెయ్యేళ్లు ధనికుడిగా వర్ధిల్లు’ అని అర్థమన్నారు. ఓడిపోతామని తెలిసే ఓటుకు వెయ్యిరూపాయలు ఇచ్చి గెలవాలని కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రయత్నిస్తున్నారన్నారు. గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్‌ చేసిన మోసాలతో పాటు గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ చేసిన ద్రోహాన్ని వివరించి బీజేపీకి ఓటేయించాలని కోరారు. దేశమంతా నరేంద్రమోదీ గాలి వీస్తున్న నేపథ్యంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ కార్యకర్తలంతా పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని తటస్థ ఓటర్లతోపాటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కలిసి ఓట్లు అభ్యర్ధించాలని పిలుపునిచ్చారు. నూటికి నూరుశాతం ఓట్లు వేయించే పోలింగ్‌ బూత్‌ బాధ్యులను తాను స్వయంగా సన్మానిస్తానన్నారు. ఎన్నికల నాటికి ప్రతి కార్యకర్త ఇంటింటికీ మూడు సార్లు వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. తద్వారా అత్యధిక మెజారిటీతో గెలుపొందుతామని, కరీంనగర్‌ ప్రజా తీర్పును దేశానికి చాటి చెప్పి చరిత్ర సృష్టిద్దామని అన్నారు. మోదీ పాలనలో దేశాభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం కోసం విప్లవాత్మక చర్యలు తీసుకున్న ఘనత నరేంద్రమోదీదే నన్నారు. మొన్నటిదాక బోయినిపల్లిలో ఒక కుటుంబం ఆరాచకంగా వ్యవహరించిందని, కొందరు పోలీసులు వారికి వత్తాసు పలికారని అన్నారు. ఇప్పుడు ఆ కుటుంబం పరారీలో ఉందని, వత్తాసు పోలీసుల పరిస్థితి ఇబ్బందిగా మారిందని అన్నారు. ఆనాడూ బైంసాలో దారుణాలు జరిగినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వెనుకంజ వేయబోనని, అందరికీ అండగా ఉంటానని అన్నారు. కేసీఆర్‌ పాలనలో అరెస్ట్‌ చేసినా భయపడకుండా పోరాడానని, వందల కేసులు నమోదు చేసినా వెనుకంజ వేయలేదని అన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఘోరంగా ఓడిపోతున్నాయని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కూడా మోదీపట్ల సానుకూలంగా ఉన్నారని అన్నారు. వారిని కలిసి ఓట్లు అభ్యర్ధించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లేఖలు రాయడం తప్పా సాధించేదేమీ లేదన్నారు. తాను చేసిన అభివృద్ధి, తెచ్చిన నిధులను బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖాతాలో వేసుకుంటున్నారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కరీంనగర్‌ ఆర్వోబీ నిర్మాణానికి నిధులు తీసుకురాలేదన్నారు. తాను సేతు బంధన్‌ స్కీం కింద నిధులు తెచ్చి ఆర్వోబీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారుల విస్తరణ కోసం వేలాది కోట్లు తీసుకొస్తే తన లేఖలవల్లే వచ్చాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. ధాన్యానికి బోనస్‌ ఇవ్వడానికి, తరుగు, తాలుతో సంబంధం లేకుండా కొనడానికే డబ్బులు లేనోళ్లు రూ.2 లక్షల రుణమాఫీకి రూ.30 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ అక్కసుతో తనను బూతులు తిడుతున్నారని, పట్టించుకోవాల్సిన అవసరమే లేదని అన్నారు. ఎందుకంటే ఆయన వద్దకు పోవాలంటే ఆ పార్టీ కార్యకర్తలే భయపడుతు న్నారన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించి బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ, బీజేపీ నాయకులు అల్లాడి రమేష్‌, మండల అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి, ఊదారి నరసింహచారి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది

కరీంనగర్‌, (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రెండు పార్టీలు ఒక్కటై తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాల మైదానంలో వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కలుగులోని ఎలుక అని, ఎన్నికల ప్పుడుమాత్రమే బయటకు వస్తాడని, ఆ తర్వాత ఫాంహౌస్‌కే పరిమిత మవు తాడని ఎద్దేవా చేశారు. బీజేపీని పాకిస్తాన్‌ టీంగా ముఖ్యమంత్రి అభివర్ణించ డాన్ని తప్పుబట్టారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ముస్లిం ఓట్లను కొల్ల గొట్టేందుకు తమది ముస్లిం పార్టీ అని తుమ్మల నాగేశ్వర్‌రావు చెబుతున్నారంటే ఎవరిది పాకిస్తాన్‌ జట్టో ప్రజలకు అర్థమయిపోయిందన్నారు. బీజేపీ భారతీయ ఆత్మ అని, హిందుత్వ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్న పార్టీ అన్నారు. ఫైట ర్స్‌... చీటర్స్‌... లూటర్స్‌కు జరగుతున్న పోరులో ఫైటర్స్‌ పార్టీ బీజేపీ గెలుస్తుందన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:19 AM