Share News

ఐదేళ్లలో బండి సంజయ్‌ ఐదు పైసల పని చేయలేదు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:31 AM

ఎంపీగా గెలిచి... గడిచిన ఐదేళ్లలో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో బండి సంజయ్‌ ఐదు పైసల పని చేయలేదని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా సైదాపూర్‌ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆయన రోడ్‌ షో నిర్వహించారు.

ఐదేళ్లలో బండి సంజయ్‌ ఐదు పైసల పని చేయలేదు

సైదాపూర్‌, ఏప్రిల్‌ 24: ఎంపీగా గెలిచి... గడిచిన ఐదేళ్లలో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో బండి సంజయ్‌ ఐదు పైసల పని చేయలేదని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా సైదాపూర్‌ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ బండి సంజయ్‌ మత రాజకీయాలతో పబ్బం గడుపుతున్నాడని, ఎంపీగా గెలిచి ఏం చేయలేదన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి కొత్త నాటకాలు మొదలు పెట్టారన్నారు. కాంగ్రెస్‌ నాలుగు నెలల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటై కరీంనగర్‌లో అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీగా మార్చానని, కరీంనగర్‌ నుంచి హైద్రాబాద్‌ రైల్వేలైన్‌ను తీసుకొచ్చానన్నారు. తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీ అని తెలిపారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లి తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. పార్లమెంట్‌లో కొట్లాడి తెలంగాణ ఏర్పాటులో ఎంతో కృషి చేశామన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చి ఆగస్టు 15 వరకు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా తనను కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడుతానన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, టూరిజం కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ గోపాల్‌రావు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజయ్య, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

దేవుడిపై ఒట్టు వేసి ఓట్ల రాజకీయం..

వేములవాడ: ఆచరణ సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దేవుడిపై ఒట్లు పెడుతూ రాజకీయం చేస్తున్నారని కరీంనగర్‌ లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన వేములవాడ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు దేవుళ్లపై ఒట్లు వేసి ఓట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పై నాలుగు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని అన్నారు. నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెక్స్‌ టైల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, జడ్పీ మాజీ చైర్మన్‌ తీగల రవీందర్‌గౌడ్‌, ప్యాక్స్‌ ఛైర్మన్‌ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:31 AM