Share News

తాగునీటి సరఫరాకు పటిష్ట చర్యలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:17 AM

ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా తాగునీరు సరఫరా చేయాలని అందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి మిషన్‌భగీరథ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా సూచించారు.

తాగునీటి సరఫరాకు పటిష్ట చర్యలు
నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలిస్తున్న సందీప్‌ కుమార్‌ సుల్తానియా

సిరిసిల్ల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా తాగునీరు సరఫరా చేయాలని అందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి మిషన్‌భగీరథ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా సూచించారు. శనివారం జిల్లాలోని రుద్రవరం ఇంటెక్‌వెల్‌, అగ్రహారం నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లోనీటి నిల్వ పూర్తి సామర్థ్యం 27.50 టీఎంసీలకు 5.90 టీఎంసీలకు తగ్గడం వల్ల వేసవిలో మిషన్‌భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. మిషన్‌భగీరథ నీటి అవసరాలు, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో ఉన్న నీటి లభ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు మూడు నెలలకు 0.36 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని ప్రస్తుతం 4 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉందని వివరించారు. ప్రతి గ్రామానికి అవసరమైన మేరకు సమృద్ధిగా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ గౌతమి, మిషన్‌భగీరథ సీఈ అమరేంద్ర, ఎస్‌ఈ రవీందర్‌, ఈఈలు విజయ్‌కుమార్‌, జానకి తదితరులు ఉన్నారు.

రాజన్న సేవలో సందీప్‌ కుమార్‌ సుల్తానియా

వేములవాడ : వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర పంచా యతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తా నియా శనివారం దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అడిషనల్‌ కలెక్టర్‌ గౌతమిలతో కలిసి ఆయన శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనము గావించారు.

Updated Date - Apr 28 , 2024 | 12:17 AM