Share News

నేను చేసిన అభివృద్ధి గ్రామగ్రామాన కనిపిస్తోంది

ABN , Publish Date - Apr 24 , 2024 | 01:31 AM

‘నియోజకవర్గ అభివృద్ధికి 12 వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాను. గ్రామగ్రామాన నేను చేసిన అభివృద్ధి కనిపిస్తున్నా.. ఏం చేశావని అడుగుతున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం తీగలగుట్టపల్లి ఆర్వోబీకి నిధులు ఇవ్వలేమని చేతులెత్తేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని సేతుబంధన్‌ పథకం కింద నిధులు తెప్పించి పనులు ప్రారంభించాం. రహదారుల పనులు చురుకుగా సాగుతున్నాయి.

నేను చేసిన అభివృద్ధి గ్రామగ్రామాన కనిపిస్తోంది

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

‘నియోజకవర్గ అభివృద్ధికి 12 వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాను. గ్రామగ్రామాన నేను చేసిన అభివృద్ధి కనిపిస్తున్నా.. ఏం చేశావని అడుగుతున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం తీగలగుట్టపల్లి ఆర్వోబీకి నిధులు ఇవ్వలేమని చేతులెత్తేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని సేతుబంధన్‌ పథకం కింద నిధులు తెప్పించి పనులు ప్రారంభించాం. రహదారుల పనులు చురుకుగా సాగుతున్నాయి. మళ్లీ గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తా.. కాంగ్రెస్‌లాగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వము. అధికారంలోకి రాగానే అభయహస్తం పేరుతో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే హామీల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఐపీఎల్‌ మాదిరిగానే దేశంలో ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌ రసవత్తరంగా సాగుతోందని, నరేంద్రమోదీ ఆద్వర్యంలోని బీజేపీ 400 సీట్లతో ఈ లీగ్‌లో విజేతగా నిలుస్తుందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు... వివరాలిలా ఉన్నాయి...

ఆంధ్రజ్యోతి: ఎంపీగా ఉంటూ కరీంనగర్‌ పార్లమెంట్‌కు నయాపైసా తేలేదని, కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు... మీరేమంటారు?

బండి సంజయ్‌: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఒక్కటై నన్ను ఓడించేందుకు అబద్ధాలు చెబుతున్నారు. 12 వేల కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశాను. నేను చేసిన అభివృద్ధి గ్రామ గ్రామాన కనిపిస్తున్నాయి. రెండేళ్ల కరోనా సంక్షోభ సమయంలో ఎంపీలాడ్స్‌ నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కరీంనగర్‌-వరంగల్‌ ఫోర్‌ లేన్‌ విస్తరణ పనులకు 2,146.86 కోట్లు, కరీంనగర్‌-జగిత్యాల ఫోర్‌ లేన్‌ విస్తరణకు 2,151.35 కోట్లు, ఎల్కతుర్తి-సిద్దిపేట రోడ్డు విస్తరణ పనుల కోసం 5,78.85 కోట్లు తీసుకువచ్చాను. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం విషయంలో పైసలివ్వకుండా కేసీఆర్‌ ప్రభుత్వం చేతులేత్తితే సేతుబంధన్‌ పథకం కింద కేంద్రమే పూర్తిగా నిధులను రూ. 154.85 కోట్లు విడుదల చేసేలా ఒప్పించి పనులు ప్రారంభించాం. సీఆర్‌ఐఎఫ్‌ ద్వారా 328.5 కోట్లు, కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి 51.8 కోట్లు తీసుకువచ్చి సెంట్రల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయించాం. శాతవాహన యూనివర్సిటీకి 12 బీ హోదా తీసుకువచ్చాం. ఎస్సారార్‌ కాలేజ్‌కి అటానమస్‌ హోదా తెచ్చాం. కేంద్ర పథకమైన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా 8,041 ఇళ్లకు 145 కోట్ల నిధులు మంజూరు చేయించా. అమృత్‌ 1.0 ద్వారా 281 కోట్లతో 12 ప్రాజెక్టులు, అమృత్‌ 2.0 ద్వారా 583.27 కోట్లతో 11 ప్రాజెక్టులు గుర్తించాం. పీఎం స్వనిధి ద్వారా 46,974 మంది స్ట్రీట్‌ వెండర్స్‌కి 76.48 కోట్ల రుణ సాయం అందించాం. ఉజ్వల యోజన పథకం కింద 50,647 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్స్‌ ఇప్పించా. సిరిసిల్ల చేనేత గొప్పతనం దేశమంతా తెలిసేలా కృషి చేశాను.

ఫ స్మార్ట్‌సిటీ నిధులు, హైవేలకు నిధులు మా చొరవతోనే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అంటున్నారు కదా?

- దోచుకోవడం, ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి వేధించడం తప్ప బీఆర్‌ఎస్‌ నేతల చేసేదేముంది? స్వలాభం కోసం కరీంనగర్‌ అభివృద్ధిని కుంటు పరిచిన నేతలు బీఆర్‌ఎస్‌ వారు. చిత్తశుద్ధితో కరీంనగర్‌ను అభివృద్ధి చేసింది నేను. స్మార్ట్‌ సిటీ పథకం 2015లో ప్రారంభమైతే నాడు ఎంపీగా ఉన్న అపర మేధావి కేంద్రమిచ్చిన నిదులను కేసీఆర్‌ దారి మళ్లిస్తే ఎందుకు నోరు విప్పలేదు. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనుల అవకతవకల విషయంలో అప్పటి ప్రభుత్వాన్ని కేంద్రం చివాట్లు పెట్టంది నిజం కాదా? కేసీఆర్‌ అవినీతి, నిధుల దారి మళ్లింపు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకు పోయి పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీలో అధికారులను నిలదీశాను. కేంద్రం నిధులను వారంలో జమ చేయకపోతే వడ్డీతో సహా వసూలు చేస్తామని కేంద్రం హెచ్చరించే దాకా పట్టించుకోలేని బీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పుడు మా ఘనతే అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. కరీంనగర్‌-వరంగల్‌, ఎల్కతుర్తి-సిద్దిపేట ఫోర్‌ లైన్‌ విస్తరణ పనులకు నిధులు మంజూరైంది నా హయాంలోనే.. స్వయంగా ప్రధాని మోదీనే పనులకు శ్రీకారం చుట్టింది నేను ఎంపీగా ఉన్నప్పుడే. కరీంనగర్‌-వరంగల్‌, ఎల్కతుర్తి-సిద్దిపేట, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, కొత్త హంగులతో సంతరించుకుంటున్న రైల్వే స్టేషన్‌ వద్దకు వెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయో చూడండి. అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల (సిఆర్‌ఐఎఫ్‌) నిధి కింద నిధులు తీసువచ్చా.

ఫ రాముడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం తప్ప బండి సంజయ్‌ చేసిందేమి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌లు పదే పదే విమర్శిస్తున్నారు?

- వేర్వేరు పార్టీలో ఉన్నా వారిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. నన్ను ఓడించడమే పనిగా పెట్టుకున్నారు. అభివృద్ధి గురించి నేను మాట్లాడుతుంటే వాళ్లు చర్చను పక్క దారి పట్టించేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. అయినా రాముడి పేరు వింటే వాళ్లకు అంత భయమెందుకు? దేవుడి పేరు వింటే భయపడేది సైతాన్లు, భూతాలు, దయ్యాలు మాత్రమే. మరి వాళ్లు ఏ కోవకు చెందిన వాళ్లో వారి విచక్షణకే వదిలేస్తున్నా. అయోధ్యలో రామమందిర నిర్మాణం దేశంలోని హిందువులందరి ఐదు దశాబ్దాల కల. కరసేవకుల త్యాగాల స్పూర్తితో రామ మందిరాన్ని నిర్మించిన ఘనత బీజేపీదే. మాకు ఆదర్శం మోదీ.. మేం దేశం కోసం, హిందూ ధర్మం కోసం పనిచేస్తామే తప్ప, కాంగ్రెస్‌ నాయకుల మాదిరిగా రాహుల్‌గాంఽధీ కోసమో, కేసీఆర్‌ కుటుంబం కోసమో రాజకీయం చేయడం లేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణం హిందువులకు ఒక పండుగ. అలాంటి సందర్భంలో ఫ్లెక్సీలు కట్టుకుని సంబురం చేసుకుంటే తప్పేముంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు రంజాన్‌, క్రిస్‌మస్‌ పండుగలప్పుడు ముస్లింలకు, క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఫ్లేక్సీలు కట్టడం లేదా. ఏనాడైనా దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగల సమయంలో హిందువులకు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు కట్టారా? నిజమైన హిందుత్వ వాదులెవరో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. శ్రీరాముడి కటౌట్లు పెడితే తప్పేముంది. వాళ్లకు దమ్ముంటే బాబర్‌, తుగ్లక్‌ పేరు చెప్పుకుని ఓట్లు అడగమనండి. ఎవరికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. వారిలాగా మేము వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను మోసం చేయలేదు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పేరు మీద వేల ఎకరాల భూదందా చేయలేదు. భూదాన్‌ భూములను కబ్జా చేయలేదు. నిజాయితీగా, నిఖార్సుగా ఇచ్చిన మాటకు కట్టుబడి రామ మందిరాన్ని నిర్మించి వంద కోట్ల హిందువుల కలను నేరవేర్చినాం.

ఫ ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు.. మీకు సంతృప్తినిచ్చిందా?

- తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గల్లీలోకి ఈడ్చుకొచ్చి గడీల పాలనను బద్దలు కొట్టినం. ఏ ప్రభుత్వమైతే ధర్నాలు, నిరసనలను నిషేధించిందో అదే ప్రభుత్వాన్ని ధర్నా చౌక్‌కు తీసుకువచ్చాను. కేసీఆర్‌ పాలనలో విసిగిపోయిన, అన్యాయాలకు గురైన ప్రజలందరికీ అండగా ఉంటు పోరాటాలు చేసిన. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం నా పోరాటాల ఫలితంగానే అన్నో, ఇన్నో నోటిఫికేషన్‌లు ఇచ్చింది. ఆర్టీసీ ఆస్తులు అమ్మకుండా ప్రజా సంపదను రక్షించా. రైతుల పక్షాన అలుపెరగని పోరాటాలు చేశా. పాలకులు ఫాంహౌస్‌కే పరిమితమై సమస్యలను గాలికి వదిలివేస్తే ప్రజా సంగ్రామ యాత్రతో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచా. పేపర్లకే పరిమితమైన అభివృద్ధి పనులను పట్టాలెక్కించా.

ఫ ఆరు గ్యారెంటీలు అమలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మాకే ఓట్లేస్తారని కాంగ్రెస్‌ ధీమాతో ఉంది.. మీరేమంటారు?

- కాంగ్రెస్‌ పార్టీ అభయ హస్తం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫేస్టోలో ఆరు గ్యారెంటీల కార్డులో మొత్తం 11 హామీలున్నాయి. వీటిని వంద రోజుల్లో పూర్తి అమలు చేస్తామని హామి ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. వీటిపై ప్రశ్నిస్తుంటే ఆ హామీలను అమలు చేశామని ప్రచారం చేస్తూ మరోసారి జనాన్ని మోసం చేసేందుకు సిద్ధమైంది. దొంగ హామీలు ఇవ్వడం, మోసం చేయడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది. మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఒక్క మహిళకైనా ఇచ్చారా.. వృద్ధులు, వితంతువులకు నాలుగు వేల పెన్షన్‌, రైతులు, కౌలు రైతులకు ఎకరాకు 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు రైతు భరోసా ఇచ్చారా.. విద్యార్థులకు ఐదు లక్షల భరోరా కార్డు, ఇల్లులేని పేదలందరికి ఐదు లక్షల ఆర్థిక సాయం, రైతులకు రెండులక్షల రుణమాఫీ అమలు చేశారా.. కాంగ్రెస్‌ నాయకులు గుండెపై చేతులు వేసుకుని చెప్పాలి. కాంగ్రెస్‌ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఆరు గ్యారెంటీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి.

ఫ తెలంగాణ జలాలను కొల్లగొట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని, గోదావరి నీటి వాటాను తేల్చిన తరువాతే నదుల అనుసంధానం పనులు ప్రారంభించాలని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేస్తున్నారు.. దీనిపై మీరేమంటారు?

- పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కమిషన్లకు కక్కుర్తి పడి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను అక్రమంగా ఏపీకి దోచిపెట్టిన నేతలు కూడా నీటి జలాల పంపిణీపై మాట్లాడుతున్నారు. ఇంది దయ్యాలు వేదాలు వల్లంచినట్లే ఉంది. జనం నవ్వుకుంటున్నారనే సోయి కూడా లేకుండా అపర మేధావి మాట్లాడుతున్నాడు. గోదావరి, కృష్ణా జలాలు, ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత కూడా బీఆర్‌ఎస్‌ నేతలకు లేదు. మనకు రావాల్సిన నీళ్లను ఏపీకి దోచి పెట్టారు. కమీషన్లకు కక్కుర్తి పడి కట్టిన ప్రాజెక్టులన్నీ కూలి పోతున్నాయి. మొన్న కాళేశ్వరం, ఇవాళ పెద్దపల్లి-ఓడేడు బ్రిడ్జి ఇందుకు నిదర్శనం.

ఫ తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందని మీ అంచనా?

- ఐపీఎల్‌ మాదిరిగానే దేశంలో ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌ రసవత్తరంగా ప్రారంభమైంది. ఈ ఎన్నికల్ల్లో నరేంద్రమోదీ కెప్టెన్సీలో బీజేపీ 400 సీట్లతో విజేతగా నిలవబోతోంది. రాష్ట్రంలో జరిగే తెలంగాణ పొలిటికల్‌ లీగ్‌ (టిపిఎల్‌)లో కిషన్‌రెడ్డి నాయకత్వంలో 17 సీట్లు సాధించి టీపీఎల్‌నూ కైవసం చేసుకుంటాం. బీఆర్‌ఎస్‌ నుంచి ప్లేయర్లు తప్పుకుని పక్క టీంలోకి జారుకుంటున్నారు. కాంగ్రెస్‌ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కాంగ్రెస్‌ టీంకు కెప్టెన్‌ (ప్రధాని అభ్యర్థి) కూడా లేడు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు టీంలు రెండో స్థానం కోసం పోటీ పడాల్సిందే.

ఫ బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్‌ విమర్శిస్తున్నది. దీనికి మీ సమాధానం?

- నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. అన్నట్లు ఆ రెండు పార్టీలు నటిస్తున్నాయి. నిజానికి చీకటి ఒప్పందాలు, అవినీతిపై విచారణ లేకుండా రాయబారాలు నడుపుతూ డ్రామాలాడుతోంది బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలే.. బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నాయి ఆ రెండు పార్టీలు ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా టెంట్లు కూడా పంచుకుంటున్నాయి. గిరిజన ఆదివాసీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఓడించాలని చూసింది ఆ రెండు పార్టీలే. తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు. ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు.

ఫ బండి సంజయ్‌ హిందువులను రెచ్చగొట్టి లబ్ధి పొందడమే పనిగా పెట్టుకున్నారని మీ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు.. దీనిపై ఏమంటారు?

- నేను ఏనాడు హిందూ ధర్మాన్ని రాజకీయం కోసం వాడుకోలేదు. హిందూ ధర్మ రక్షణ కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉండి పోరాడుతా. అసలు హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది ఎంఐఎం పార్టీ. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానని ఒవైసీ చెబితే చర్యలు తీసుకోకుండా ఆ పార్టీతో బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాటు కలిసి పనిచేసింది. ప్రభుత్వ మనుగడ కోసం ఒవైసీతో అంటకాగుతోంది కాంగ్రెస్‌ పార్టీ. ట్యాంక్‌బండ్‌పై, ఎన్టీఆర్‌, పీవీ విగ్రహాలను కూల్చేస్తానని మాట్లాడితే కనీసం ఆ వ్యాఖ్యలు తప్పని కూడా ఖండించని పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌. కరీంనగర్‌ కేంద్రంగా హిందువులను గతంలో కించ పరిచి మాట్లాడింది ఎవరో తెలుసు. హిందువుల మనోభావాలు దెబ్బతింటుంటే మౌనంగా ఉండడం నాకు చేతకాదు. హిందూ ధర్మ రక్షణ కోసం బరాబర్‌ రాజకీయం చేస్తా.. ఎందాకైనా పోరాడుతా. ఇది నా ధర్మంపై నాకున్నా బాధ్యత. ఎందుకంటే మేము పక్క హిందుత్వ వాదులం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాదిరిగా కుహనా లౌకిక వాదులం కాదు. ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుని ఇల్లు దాటగానే బొట్టు తుడుచుకునే వాళ్లం కాదు.

ఫ రాబోయే కాలంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి పనిచేస్తాయని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది.

- పార్లమెంట్‌లో కలిసి పని చేస్తోంది ఆ రెండు పార్టీలే.

ఫ కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీల వైఖరిపై మీ అభిప్రాయం ఏంటి?

- రెండు పార్టీలూ తోడు దొంగలే. ప్రజలను హామీలతో మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే బట్టేబాజ్‌ పార్టీలే. రెండు పార్టీలకు వాళ్ల కుటుంబాల అభివృద్ధే ముఖ్యం. ఆ రెండు పార్టీలకు మధ్యవర్తి ఎంఐఎం పార్టీ. లౌకిక వాద ముసుగులో హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేయడమే ఈ రెండు పార్టీల సిద్ధాంతం. రెండు పార్టీల అవినీతి ఎలా చేయాలి. ప్రజలను ఎలా మోసం చేయాలి అనే విషయంలో పోటీ పడుతున్నాయి. దేశాన్ని దోచుకోవడంలో కాంగ్రెస్‌, రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్‌ఎస్‌ పీహెచ్‌డీ చేశాయి.

ఫ మీరు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని మీ పార్టీ నేతలే చెబుతున్నారు . దీనిపై మీ కామెంట్‌?

- నేను బీజేపీ సైనికుడిని.. కరీంనగర్‌ ప్రజల సేవకుడిని.. మోది బాటలో నడిచే కార్యకర్తను.. పార్టీ అప్పగించిన పనిని వంద శాతం నిర్వహించడమే నా బాధ్యత. నాకు ఏలాంటి బాధ్యత గుర్తింపు ఇవ్వాలో మోదీ, జేపి నడ్డా, అమిత్‌షా ఆధ్వర్యంలో జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చి తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం బీజేపీ కల్పించింది. నిజం చెప్పాలంటే నా కష్టాన్ని ప్రతి సారీ నా పార్టీ గుర్తించింది. సామాన్య కార్యకర్తనైన నాకు మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. ఎంపీగా అవకాశం కల్పించింది. రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసింది. భవిష్యత్తులో ఎలాంటి అవకాశం ఇవ్వాలో పార్టీ ఆలోచిస్తుంది. పార్టీ ఇచ్చే ఏ బాధ్యతనైనా శిరసావహిస్తూ పనిచేసే సైనికుడిని నేను.

Updated Date - Apr 24 , 2024 | 01:31 AM