Share News

కడుపులో ఉన్న శిశువు మృతి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:18 PM

మహిళ కడుపులో ఉన్న శిశువు మృతి చెందగా.. అందుకు వైద్యులే కారణమంటూ బాధితులు ఓ ప్రైవేటు ఆస్పతి ముందు ఆందోళన చేసిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

కడుపులో ఉన్న శిశువు మృతి

చివరి క్షణాల్లో సీరియస్‌గా ఉన్నదంటూ వేరే ఆస్పత్రికి రెఫర్‌ చేసిన ప్రైవేటు వైద్యులు

శిశువు మృతికి వారి నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల ఆందోళన

గద్వాల క్రైం, ఏప్రిల్‌ 27: మహిళ కడుపులో ఉన్న శిశువు మృతి చెందగా.. అందుకు వైద్యులే కారణమంటూ బాధితులు ఓ ప్రైవేటు ఆస్పతి ముందు ఆందోళన చేసిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలం ర్యాలంపాడు గ్రామానికి చెందిన గీత, నాగార్జున్‌రెడ్డిలకు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గర్భం దాల్చిన గీత జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రతీ నెల పరీక్షలు చేయించుకుంటోంది. ప్రతీ నెల బిడ్డ ఆరోగ్యంగా ఉందని, హార్ట్‌ బీట్‌ కూడా బాగుందని వైద్యులు సూచించారు. గీతకు తొమ్మిది నెలలు పూర్తికావడంతో మే 15న కాన్పు జరుగుతుందని వైద్యులు సూచించారు. గత గురువారం కడుపులో ఇబ్బందిగా ఉందని గీత ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు హార్ట్‌బీట్‌ బాగుందని తెలిపి, ఒక ఇంజక్షన్‌ ఇచ్చారు. ఆ ఇంజక్షన్‌ వల్ల మరుసటి రోజు శుక్రవారం గీత కడుపులో నొప్పి వచ్చింది. దాంతో సాయంత్రం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు పరిస్థితి విషమించిందని, శిశువు కడుపులో మృతి చెందిందని, వెంటనే కర్నూల్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఇంత సడన్‌గా చెబితే ఎలా వెళ్లాలని, ఏదేమైనా మీరే చికిత్స చేయాలని కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. తల్లి ప్రాణానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఎంత ప్రాధేయపడ్డా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక జిల్లా కేంద్రంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆపరేషన్‌ చేసి, కడుపులో మృతి చెందిన శిశువును బయటికి తీశారు. కడుపులో మృతి చెందిన శిశువు ఎక్కువ సమయం ఉండటంతో తల్లి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉందని ఆపరేషన్‌ చేసిన ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ప్రతీనెల చెక్‌పలు చేయించినప్పుడు అంతా బాగానే ఉందని వైద్యులు చెప్పారని, ఇప్పుడు కడుపులో శిశువు ఎలా మృతి చెందిందని బాధితులు ప్రశ్నించారు. శిశువు మృతికి, తల్లి పరిస్థితి విషమించడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను సద్దుమనిగేలా చేశారు.

Updated Date - Apr 27 , 2024 | 11:18 PM