Share News

కేసీఆర్‌ బస్సు యాత్రకు బ్రహ్మరథం

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:17 PM

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్‌, మాజీ సీఎం కే.చంద్రశేఖర్‌రావు నిర్వహిస్తున్న బస్సు యాత్రకు నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో జనం బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర రాత్రి 7:10 గంటలకు ఉయ్యాలవాడకు చేరుకుంది.

కేసీఆర్‌ బస్సు యాత్రకు బ్రహ్మరథం
బస్సులో ర్యాలీగా వస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ నాగర్‌కర్నూల్‌ రోడ్‌షో విజయవంతం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించకపోవడం బీజేపీ దురుద్దేశమే:

మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్‌, మాజీ సీఎం కే.చంద్రశేఖర్‌రావు నిర్వహిస్తున్న బస్సు యాత్రకు నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో జనం బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర రాత్రి 7:10 గంటలకు ఉయ్యాలవాడకు చేరుకుంది. అక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు బాణసంచా కాలుస్తూ అడుగడుగునా కేసీఆర్‌కు నీరాజనం పలికారు. కిలో మీటరున్నర దూరం యాత్ర పట్టణానికి చేరుకోడానికి గంటన్నర వ్య వధి పట్టింది. అనంతరం బస్టాండ్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ ఉత్సాహంగా కనిపించారు. ఆయన ప్రసంగానికి జనం నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన లభించింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నీతి, నిజాయితీ గల అధికారిగా అభివర్ణించిన ఆయన.. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నుంచి ఆయనను గెలిపిస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థికే పట్టం కడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మైనార్టీలను కూడా తన ప్రసంగం ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేశారు. బీజేపీ కాంగ్రె్‌సలకు ఓటేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, సెక్యులర్‌ పార్టీ అయిన బీఆర్‌ఎ్‌సకు మద్దతిస్తే వెన్నంటే ఉంటామన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే ఇమామ్‌, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించలేదన్నారు. దీని పర్యవసానంగానే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక భారం పడిందన్నారు.

తెలంగాణ జాతిపిత కేసీఆర్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కీలక భూమిక పోషించిన కేసీఆర్‌ ఈ ప్రాంత జాతిపిత అని ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఆయనకు పాదాభివందనం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రపంచంలోనే నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌కు వన్నె తెచ్చేలా వ్యవహరిస్తానని పేర్కొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:17 PM