Share News

ఉపాధి హామీ పనులపై విచారణ

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:52 PM

గద్వాల మండలంలో రూ.8.76 కోట్లతో చేసిన ఉపాధి పనులపై ఆడిట్‌ పూర్తయ్యింది.

ఉపాధి హామీ పనులపై విచారణ
ఆడిట్‌పై విచారణ నిర్వహిస్తున్న డీఆర్‌డీవో నర్సింగ్‌రావు, అధికారులు

- 13 గ్రామాల విచారణ పూర్తి, ఇంకా కొనసాగింపు

- రూ. 1.50 లక్షల రికవరీకి ఆదేశం

గద్వాల, ఏప్రిల్‌ 24 : గద్వాల మండలంలో రూ.8.76 కోట్లతో చేసిన ఉపాధి పనులపై ఆడిట్‌ పూర్తయ్యింది. జిల్లా కేంద్రంలోని మండల పరిషత్‌ సమావేశ మందిరంలో డీఆర్‌డీవో నర్సింగ్‌రావు, ఎంపీడీవో ఉమాదేవి, ఎస్‌ఆర్‌పీ భద్రునాయక్‌ ఆధ్వర్యంలో బుధవారం దీనిపై విచారణ నిర్వహిం చారు. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభ మైంది. సాయంత్రం వరకు 13 గ్రామాల్లో చేసిన ఆడిట్‌పై విచారణ కొనసాగింది. ప్రధానంగా డీఆర్‌పీలు హరితహారంలో నాటిన మొక్కలు బతకలేదని, ట్యాంకర్లకు బిల్లులు ఎక్కువగా చెల్లించారని గుర్తించారు. చేసిన పనికి తగిన కొలతలు తీయలేదని, దీంతో ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తేలింది. అయితే ఆ డబ్బు కూలీల ఖాతాల్లో జమ కావడంతో, టెక్నికల్‌ అసిస్టెంట్ల తప్పుగా భావించి, వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. అదే విధంగా మదనపల్లి గ్రామంలో మల్టీపర్పస్‌ వర్కర్‌కు ఉపాధి హామీ కూలీ రూ.11 వేలు చెల్లించినట్లు గుర్తించారు. పంచాయతీ కార్యదర్శి ఆ నెల వేతనం ఇవ్వలేదని చెప్పగా, రుజువు చూపించాలని డీఆర్‌డీవో పీడీ నిలదీశారు. అదే విధంగా ఫార్మేషన్‌ రోడ్డు కొలతల్లో భారీగా తేడాలు వచ్చాయని, దీని వలన రూ.1.70లక్షల డబ్బు వృథాగా కూలీల ఖాతాల్లోకి వెళ్లాయని డీఆర్‌పీలు గుర్తించారు. అయితే వర్షం పడటంతో చేసిన పని పూర్తిగా కనిపించడం లేదని, దీంతో కొలతల్లో తేడాలు వచ్చాయని టెక్నికల్‌ అసిస్టెంట్‌ వివరణ ఇచ్చుకున్నారు. చాలా గ్రామాలలో చేసిన పనికంటే ఎక్కువ బిల్లులు చెల్లించారని ఆడిటర్లు గుర్తించారు. ఇప్పటి వరకు గుర్రంగడ్డలో రూ.43,104, చెనిగోనిపల్లిలో రూ. 11,673, అనంతాపురంలో రూ. 23,080, సంగాలలో రూ.14,265, బీరెల్లిలో రూ.3,929, తెలుగోనిపల్లిలో రూ.32,475, మదనపల్లిలో రూ. 16,954, మొత్తంగా రూ. 1.50 లక్షలు రికవరీ చేయాలని డీఆర్‌డీవో ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, కొలతలు, ఎంబీ రికార్డులు సక్రమంగా లేకపోవడం తదితరాలకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో పాటు శిక్షణకు పంపిస్తామని తెలిపారు. ఇంకా 15 గామ్రాల ఆడిట్‌ జరగాల్సి ఉంది. రాత్రి 10 గంటల వరకు విచారణ కొనసాగింది.

ఆడిటర్లపై అభ్యంతరాలు

కాగా ఆడిట్‌ నిర్వహించిన బృందంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడో చేసిన పనికి సంబంధించిన ఆనవాళ్లు కొన్ని చోట్ల లేకపోయినా, కొలతలు తీసేటప్పుడు వాటికి సంబందించిన ఫోటోలు చూపించినా పరిగణలోకి తీసుకోలేదని సిబ్బంది వాపోతున్నారు. వారి ఇష్టానుసారం కొలతలు తీసి తేడాలు చూపిస్తున్నారని, ఇది ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. కూలీలకు డబ్బు తక్కువ పడితే అధికారులే తిడుతున్నారని, ఆలాంటప్పుడు కనీస వేతనం పడేందుకు కొలతలు కొంత ఎక్కువ రాస్తే అది తమ మెడకు చుట్టుకుంటుందని వారు వాపోతున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:52 PM