Share News

తుమ్మిళ్ల కింద రిజర్వాయర్లు నిర్మించాలి

ABN , Publish Date - Apr 23 , 2024 | 11:30 PM

రేవంత్‌ మగాడివైతే తమ ప్రభుత్వం హయాంలో నిర్మించి తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద మల్లమ్మకుంట, జూలకల్‌, వల్లూరు రిజర్వాయర్లను నిర్మించి చూపించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.తారకరామరావు అన్నారు.

 తుమ్మిళ్ల కింద రిజర్వాయర్లు నిర్మించాలి
మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

అలంపూర్‌ చౌరస్తా, ఏప్రిల్‌ 23: రేవంత్‌ మగాడివైతే తమ ప్రభుత్వం హయాంలో నిర్మించి తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద మల్లమ్మకుంట, జూలకల్‌, వల్లూరు రిజర్వాయర్లను నిర్మించి చూపించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.తారకరామరావు అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్‌ చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటలెక్కువ, పని తక్కువ అన్నట్లు సాగుతుందన్నారు. రేవంత్‌రెడ్డి ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుళ్లపై ఒట్టు వేసి చెబుతున్నాడని, రేపు ఇక్కడకు వచ్చి జోగుళాంబ సాక్షిగా అని నమ్మించే ప్రయత్నం చేస్తాడని, ఇది నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు. వయసుకు కూడా విలువ ఇవ్వకుండా కేసీఆర్‌ను సూటిపోటి మాటలంటున్నాడని, నేను కూడా ఆయన బాషలోనే అడుగుతున్నానని.. రేవంత్‌ నువ్వు మగాడివైతే తమ ప్రభుత్వం హయాంలో నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద మల్లమ్మకుంట, జూలకల్‌, వల్లూరు రిజర్వాయర్లను నిర్మించి చూపించాలన్నారు. తాము నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని వినియోగంలోకి తేవాలని, నెట్టెంపాడు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. మొన్న సూర్యపేటలో ఓ బస్సులో జేబు దొంగ కత్తులు పెట్టుకుని తిరుగుతుంటే పోలీసులు ఎందుకు కత్తులు పెట్టుకున్నావని విచారణ చేస్తే.. అదేం సార్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే జేబులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నాడని, తాను పెట్టుకుంటే తప్పేంటని అన్నాడన్నారు. అంటే రాష్ట్రంలో దొంగలు రేవంత్‌రెడ్డి ఆదర్శంగా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నాగర్‌కర్నూల్‌లో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులను గమనించాలని, సమర్థుడైన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను గెలిపించాలన్నారు. కారుకు ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీలో మన విజయుడు ఉన్నాడు, పార్లమెంట్‌లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఉంటే రాయచూరు రహదారిని జాతీయ రహదారిగా మార్చుకోవడమేగాక నడిగడ్డ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మన ప్రభుత్వ హయాంలో నీళ్లకు, కరెంటుకు, రైతుబంధుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేశామని, దాంతో ఉమ్మడి జిల్లాలో నడిగడ్డకు కర్నూల్‌ నుంచి కూలీలు వలస వచ్చారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని, దీనిని ఓట్ల రూపంలో చూపాలన్నారు. తెలంగాణలో మనం జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల నిర్మిస్తే మోదీ ఒక్క మెడికల్‌ కళాశాల కూడా నిర్మించలేదన్నారు. అందుకే కేసీఆర్‌ బలపరిచిన విద్యవంతుడైన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఓటేయ్యాలని, ఆయన గురించి గతంగతః అని, ఆర్‌ఎస్‌ పవీణ్‌కుమార్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అని చెప్పారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే త్వరలోనే అధికారంలోకి వస్తామని అన్నారు. నా మిత్రుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అష్టకష్టాలు పడుతున్నాడన్నారు. హామీలను నెరవేర్చని కాంగ్రె్‌సకు భయం పుట్టాలన్నా, చెప్పిన పనులు చేయలన్నా ప్రవీణ్‌కుమార్‌ను గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఆగ్రగామిగా నిలబెట్టిన రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ ఆశీర్వదంతో మీ బిడ్డగా ముందుకు వచ్చానని, తనను ఆశీర్వదించాలని కార్యకర్తలను కోరారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్‌ నియోజకవర్గంలోని మునిసిపల్‌ చైర్‌పర్సన్లు మనోరమ, కరుణశ్రీ, చైర్‌పర్సన్‌ దేవన్న, నాయకులు గజేందర్‌రెడ్డి, పరమేశ్వరరెడ్డి, పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, రజిత, సుష్మ, గడ్డం కృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 11:30 PM