Share News

అభ్యర్థులకు సవాల్‌

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:18 AM

లోక్‌సభ ఎన్నికల ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 25 వరకు గడువు ఉంది. 29న ఉపసంహరణ ఘట్టం ముగియగానే ప్రచారపర్వం మరింత పుంజుకుంటుంది. ఇప్పటికైతే ప్రచారానికి కేవలం 19 రోజులు మాత్రమే మిగిలింది. మే 13న పోలింగ్‌ జరుగుతున్న దృష్ట్యా ఒకరోజు ముందుగా అంటే మే 11న ప్రచార కార్యక్రమాలు ముగించాలి. ఈ కాస్త సమయంలో గ్రామగ్రామాన పర్యటించడం అభ్యర్థులకు సవాల్‌గా మారనున్నది.

అభ్యర్థులకు సవాల్‌

ప్రచారానికి 19 రోజులే సమయం

మండల కేంద్రాలు, పట్టణాలకే పరిమితం

సభలు, రోడ్‌షోల్లో గళమెత్తుతున్న వైనం

క్షేత్రస్థాయిలో కానరాని ప్రచారం

దడ పుట్టిస్తున్న మండుటెండలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్‌ 22 : లోక్‌సభ ఎన్నికల ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 25 వరకు గడువు ఉంది. 29న ఉపసంహరణ ఘట్టం ముగియగానే ప్రచారపర్వం మరింత పుంజుకుంటుంది. ఇప్పటికైతే ప్రచారానికి కేవలం 19 రోజులు మాత్రమే మిగిలింది. మే 13న పోలింగ్‌ జరుగుతున్న దృష్ట్యా ఒకరోజు ముందుగా అంటే మే 11న ప్రచార కార్యక్రమాలు ముగించాలి. ఈ కాస్త సమయంలో గ్రామగ్రామాన పర్యటించడం అభ్యర్థులకు సవాల్‌గా మారనున్నది.

మెదక్‌ లోక్‌సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి 49 మండలాలు, 920 గ్రామపంచాయతీలు, 12 మున్సిపాలిటీలు, 3 జీహెచ్‌ఎంసీ డివిజన్లు ఉన్నాయి. అదే విధంగా 18,12,858 మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి 2,124 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సభలు, రోడ్‌షోలపై ఫోకస్‌

ప్రధాన పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ఇప్పటివరకైతే ప్రచారానికి దిగలేదు. ఇంకా సమయం తక్కువగా ఉండడంతో పట్టణాలు, మండలాల వారీగానే ప్రజలతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థులుగా ఖరారైనప్పటి నుండే బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రధానంగా తమ పార్టీ శ్రేణులతో సమావేశాలకే ప్రాధాన్యత ఇచ్చారు. నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి తమ వాణిని వినిపించారు. సంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బహిరంగ సభకు హాజరుకాగా.. ఇటీవల మెదక్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ఈనెల 25న సిద్దిపేట బీజేపీ తరఫున అమిత్‌షా సభ జరగబోతుంది. ఇవే కాకుండా అభ్యర్థులు, వారితోపాటు ఇతర ప్రాంతాల ముఖ్యనేతలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటా వెళ్లి ప్రచారం నిర్వహించేంత సమయం లేకపోవడంతో ఎక్కడికక్కడ జనసమీకరణ చేసి రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు, సమావేశాలు చేపడుతున్నారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలో మరోసారి కేసీఆర్‌ సభ, రాహుల్‌ లేదా ప్రియాంక సభ, ప్రధాని మోదీతో బహిరంగ సభ జరిగేలా ఆయా పార్టీల అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు.

ఎండతో అభ్యర్థుల పరేషాన్‌..

మండుటెండల్లో లోక్‌సభ ఎన్నికలు జరగడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. సాధారణంగా ఉదయం 10 గంటల తర్వాతనే సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, ఇతర ప్రచార కార్యక్రమాలకు స్పందన కనిపిస్తుంటుంది. కానీ ఉదయం 9గంటలకే ఎండలు భగ్గుమంటున్నాయి. మెదక్‌ లోక్‌సభ పరిధి మొత్తం ఆరెంజ్‌ అలర్ట్‌ జోన్‌లో ఉంది. ఇటీవల సిద్దిపేట జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఒకింత ఆందోళనను కలిగించింది. ఈ క్రమంలో అభ్యర్థుల సమావేశాలకు జనసమీకరణ కష్టమవుతోంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత అంతర్గత సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. మళ్లీ సాయంత్రం 5 గంటల తర్వాతనే కాలు బయటపెడుతున్నారు. దీంతో వారి ప్రచార ప్రణాళిక సైతం తలకిందులవుతోంది. మిగిలిన సమయంలో అన్ని గ్రామాల్లో పర్యటించడం సవాల్‌గానే మారిందని అంటున్నారు. ఒక గ్రామానికి వెళ్లి మరో గ్రామానికి వెళ్లకున్నా ప్రతికూల పరిస్థితి ఎదురవుతుందని మండల కేంద్రాలు, పట్టణాలకే పరిమితమవు తున్నారు. అయితే కొన్ని ప్రభావం చూపించే గ్రామాలు, మేజర్‌ గ్రామాలకు మాత్రం అభ్యర్థులు ప్రాధాన్యతనిచ్చి ప్రచారం చేస్తున్నారు. లేదంటే ఆయా ప్రాంతాలకు చెందిన ముఖ్యనేతలను ప్రచారంలో దింపుతున్నారు.

ప్రచార రథాలు, సోషల్‌మీడియాపై దృష్టి..

ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రధానంగా సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్నారు. తమ ప్రచార వీడియోలు, ఫొటోలను క్షణాల్లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో షేర్‌ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. తమ హామీలతోపాటు ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ వీడియోలు, పోస్ట్‌లను సోషల్‌ మీడియా ద్వారా చేరవేస్తున్నారు. చెవులు హోరెత్తేలా ప్రచార రథాలను సిద్దం చేసి క్షేత్రస్థాయిలో తిప్పుతున్నారు. తమపై వ్యక్తిగతంగా రాసిన పాటలతోపాటు ఆయా పార్టీలకు సంబంధించిన పాటలు, సందేశాలను వినిపిస్తూ ఈ ప్రచార రథాలు ఊరూరా చక్కెర్లు కొడుతున్నాయి. ఆయా గ్రామాల రచ్చబండల వద్ద కళాబృందాల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అభ్యర్థుల ముఖాలను ప్రత్యక్షంగా ఎరుగకున్నా ఇలాంటి ప్రచారాల ద్వారా మాత్రం ప్రజలకు ఎంతో కొంత అవగాహన కలుగుతోంది.

Updated Date - Apr 23 , 2024 | 12:18 AM