Share News

టెండర్‌దారుల తీరుపై భక్తుడి ఆగ్రహం

ABN , Publish Date - Apr 21 , 2024 | 11:43 PM

సెల్‌ఫోన్‌ ఇస్తేనే లోపలికి

టెండర్‌దారుల తీరుపై భక్తుడి ఆగ్రహం
భక్తుడిని అడ్డుకుంటున్న టెండర్‌ నిర్వహక సిబ్బంది

చేర్యాల, ఏప్రిల్‌ 21 : కరీంనగర్‌కు చెందిన ఓ భక్తుడు కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఇంటిల్లిపాదితో వచ్చారు. పట్నం వేయడానికి పూజాసామగ్రితో కుటుంబసభ్యులు గంగిరేగుచెట్టు ప్రాంగణంలోకి వెళ్లిపోయారు. కాసేపటికి అతడు ఆలయానికి చేరుకోగా, రాజగోపుర ఆవరణలో సెల్‌ఫోన్‌ టెండర్‌దారుల సిబ్బంది సెల్‌ఫోన్‌ ఇస్తేనే లోపలికి అనుమతిస్తామని అడ్డుకున్నారు. దీంతో తాను ఆలయం లోపలికి వెళ్లడం లేదని చెప్పినా వినకుండా వెంటపడి వాగ్వాదానికి దిగారు. దౌర్జన్యం చేయడంపై భక్తుడు మండిపడటంతో కొంత సేపు గందరగోళం నెలకొన్నది. భక్తులతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిన ఆలయ ఈవో బాలాజీశర్మ, ఏఈవో శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ టెండర్‌దారుడిని మందలించారు. డిటెక్టర్లతో తనిఖీ చేయొద్దని, భక్తులు ఇస్తేనే సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ చేసుకోవాలని సూచించారు. కానీ, లక్షలాది రూపాయలు పెట్టి టెండర్‌ పాడామని, తమకెలా డబ్బు వస్తుందని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో పద్ధతి మార్చుకోకపోతే టెండర్‌ రద్దు చేస్తామని ఆలయాధికారులు హెచ్చరించారు. అనంతరం ఈవో బాలాజీశర్మ విలేకరులతో మాట్లాడుతూ టెండర్‌ గడువు పూర్తయ్యాక సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ కౌంటర్‌ పూర్తిగా రద్దు చేస్తామని, భక్తుల ఇబ్బందుల దృష్ట్యా లగేజ్‌ కౌంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Updated Date - Apr 21 , 2024 | 11:43 PM