Share News

బుజ్జగింపులు

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:28 PM

రేపటితో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి

బుజ్జగింపులు

మెదక్‌ బరిలో 53 మంది అభ్యర్థులు

వీరంతా పోటీలో ఉంటే నాలుగు ఈవీఎంలు అవసరం

పలువురిని పోటీ నుంచి తప్పించేలా ప్రయత్నాలు

బుజ్జగిస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

తప్పుకుంటామంటూ కొందరి రాయబారాలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్‌ 27 : లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోటీచేసిన సెగ్మెంట్‌గా, బీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా, పలు ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలనూ ఆదరించిన స్థానంగా మెదక్‌కు పేరుంది. అయితే ప్రస్తుతం 53 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసిన రికార్డును సైతం సొంతం చేసుకుంది. గడిచిన 2019 ఎన్నికల్లో కేవలం 10 మంది బరిలో నిలిస్తే ఇప్పుడేమో ఐదింతలుగా అభ్యర్థులు నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే రేపటి వరకు ఉపసంహరణలకు తుది గడువు ఉండడంతో 53 మందిలో పోటీ నుంచి తప్పుకునేదెవరో అనే విషయం కూడా తేటతెల్లమవుతుంది.

తేలనున్న అభ్యర్థులు

పోలింగ్‌కు మరో 16 రోజుల సమయం ఉండగా ప్రచారానికి కేవలం 14 రోజులే ఉంది. రేపు ఉపసంహరణలు పూర్తయితేనే బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా సిద్ధమవుతుంది. ఈవీఎంలో అభ్యర్థుల సీరియల్‌ నంబర్లు, గుర్తులు కేటాయిస్తారు. అంతేగాకుండా ప్రధాన పార్టీల గుర్తులతో పోలిన స్వతంత్రుల గుర్తుల వ్యవహారం కూడా బయటపడుతుంది. అందుకే ఆయా గుర్తులు పొందే పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు ముఖ్యమైన స్వతంత్ర అభ్యర్థులను ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పోటీ నుంచి తప్పుకునేందుకు రేపే చివరి గడువు కావడంతో నేడు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు.

బూత్‌కు నాలుగు ఈవీఎంలు..

ప్రస్తుతం నామినేషన్లు వేసిన అభ్యర్థులంతా బరిలో ఉంటే మెదక్‌ లోక్‌సభకు సంబంధించి ప్రతీ పోలింగ్‌ బూత్‌కు నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 2,098 పోలింగ్‌ కేంద్రాల్లో 4 చొప్పున ఈవీఎంలను అందుబాటులో ఉంచక తప్పదు. ఒక ఈవీఎం మెషీన్‌లో 16 మంది అభ్యర్థుల పేర్లు, గుర్తులు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం 53 మంది ఉన్నందున నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సిందే. ఇదిలాఉంటే రెండు ఈవీఎంలు ఏర్పాటు చేస్తేనే ఓటర్లు తికమక పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది నాలుగు ఈవీఎంలు పోలింగ్‌ కేంద్రంలో కనిపిస్తే ఓటర్లు తర్జనభర్జన పడే అవకాశాలు లేకపోలేదు. కనీసం 25 మంది ఉపసంహరించుకుంటే రెండు ఈవీఎంలతో ఎన్నికలు జరపవచ్చు. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. చివరగా మూడు ఈవీఎంలను ఏర్పాటు చేసే పరిస్థితి రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉపసంహరణలకు ప్రయత్నం..

ప్రస్తుతం 53 మంది నామినేషన్లు వేయగా ఇందులో వివిధ పార్టీలకు సంబంధించి 16 మంది అభ్యర్థులు ఉండగా మిగతా వారంతా స్వతంత్రులుగా బరిలో నిలవడానికి సిద్ధమయ్యారు. అయితే పలు పార్టీలకు సంబంధించిన గుర్తులు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో అలాంటి పార్టీల తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులే తమకు అనుకూల పరిస్థితి కల్పించుకునే దిశగా ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్రులుగా నిలిచిన వారికి కొందరికి వందల సంఖ్యలో ఓట్లు పడగా.. మరికొందరికి వేలల్లో పోలయ్యాయి. వీరెవరో తెలియకున్నా, కనీస ప్రచారం చేయకున్నా భారీగా ఓట్లు పొందారంటే కేవలం ప్రధాన పార్టీల గుర్తులను పోలిన గుర్తులను కేటాయించడం వల్లేనని చెప్పకతప్పదు.

తప్పుకోవడానికీ రాయబారాలు..!

ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామంటూ పలువురు రాయబారాలు నెరుపుతున్నట్లుగా సమాచారం ఉంది. కొందరిని ఉపసంహరించుకునేలా ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తుండగా.. ఇందుకు రివర్స్‌గా మరికొందరు తామే తప్పుకుంటామంటూ కీలక అభ్యర్థులకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం తాము వెచ్చించిన ఖర్చుతోపాటు తమ త్యాగానికి తగిన ప్రతిఫలం కూడా అందుకోవాలని ఆశిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఉపసంహరణల గడువు ఉండడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

జహీరాబాద్‌లో బూత్‌కు రెండు ఈవీఎంలు అవసరం

జహీరాబాద్‌ పార్లమెంట్‌కు సంబంధించి 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 12 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఒక ఈవీఎంలో 16 పేర్లకు అవకాశం ఉండగా, నాడు ఒకే ఈవీఎం సరిపోయింది. ఈసారి మాత్రం 40 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 14 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 26 మంది అభ్యర్థుల్లో ఎంతమంది ఉపసంహరించుకుంటారో చూడాలి. ఒకవేళ ఉపసంహరణ అనంతరం కూడా 16 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిస్తే రెండు ఈవీఎంలు అవసరం పడతాయి. నియోజకవర్గ పరిధిలోని ప్రతీ పోలింగ్‌ బూత్‌లో రెండేసీ ఈవీఎంల చొప్పున ఏర్పాటు చేయాల్సి వస్తుంది.

Updated Date - Apr 27 , 2024 | 11:28 PM